నువ్వు ఏడ్వకు అమ్మ! నేను నీ కూతుర్ని!!
on Oct 14, 2022
బిగ్ బాస్ హౌస్ లో కెప్టెన్సీ పోటీదారుల ఎంపికలో భాగంగా కంటెస్టెంట్స్ కి వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడే అవకాశం బిగ్ బాస్ కల్పించిన విషయం తెలిసిందే. అయితే నిన్న జరిగిన ఎపిసోడ్ లో 'హైలెట్ అఫ్ ది డే' గా ఫైమా తన అమ్మతో మాట్లాడిన వీడియో కాల్ ప్రేక్షకుల హృదయాలను హత్తుకుంటోంది.
హౌస్ లో కాల్ రాగానే, ఫైమా ఫోన్ లిఫ్ట్ చేయడంతో టాస్క్ మొదలైంది. అందులో తనకు రెండు ఆప్షన్ లు ఇచ్చాడు బిగ్ బాస్. మొదటిది వాళ్ళ 'అమ్మతో వీడియో కాల్'. రెండవది 'లక్కీ నుండి ఆడియో మెసేజ్' . అయితే ఈ రెండింటిలో ఫైమా అమ్మతో వీడియో కాల్ ఆప్షన్ ని ఎంపిక చేసుకోగా, కాసేపటికి హౌస్ లోని టీవీలో ఫైమా వాళ్ళ అమ్మ వీడియో కాల్ మొదలైంది. ఫైమా చాలా సంతోషంగా తన అమ్మతో మాట్లాడింది. తన అటతీరు, మాటతీరు గురించి అడిగి తెలుసుకుంది.
"నేను బాగా నవ్విస్తున్నానా?" అని ఫైమా అడుగగా, "బాగా నవ్విస్తున్నావ్, ఇంకా నవ్వించాలి" అని వాళ్ళ అమ్మ చెప్పడంతో ఫైమా సంతోషపడింది. ఫైమా "నేను మేకప్ వేసుకుంటలేను. టీవిలో బాగా కనిపిస్తున్నానా?" అని అడుగగా, "నువ్ మేకప్ వేసుకున్న, వేసుకోకపోయినా నువ్ నా కూతురువి. ఎప్పుడు అందంగానే ఉంటావ్" అని గర్వంగా చెప్పుకొచ్చింది తన అమ్మ.
ఆ తర్వాత "నేను మొన్న హౌస్ లో కట్టెలు కొట్టిన చూసావా, నువ్ నన్ను కట్టెలు కొట్టడానికి తీసుకుపోయినప్పుడు సరిగా కొట్టలేదు అన్నావ్ కదా కానీ మొన్న జరిగిన టాస్క్ లో మంచిగానే కొట్టిన" అని ఫైమా అంది. ఇది విన్న వాళ్ళ అమ్మ ఒక్కసారిగా ఏడ్చేసారు. ఇది హౌస్ మేట్స్ అందరినీ ఎమోషనల్ చేయగా, అందరూ ఫైమాని ఓదార్చే ప్రయత్నం చేసారు. "నువ్వు ఏడ్వకు అమ్మ, నేను బాగా ఆడి, అందరిని మెప్పిస్తా. నేను నీ కూతురుని. ఇప్పటి నుండి షహీదా కూతురు ఫైమా అని అందరూ చెప్పుకుంటారు చూడు" అని ఫైమా అనడంతో వాళ్ళ అమ్మతో పాటు హౌస్ మేట్స్ అందరు నవ్వేసారు.
ఈ వీడియో కాల్ సీన్ అంతా కూడా అటు హౌస్ మేట్స్ , ఇటు ప్రేక్షకుల మనసును హత్తుకుంటోంది. ఫైమా చిన్న వయసులోనే తన కుటుంబం గురించి ఆలోచించే విధానం పట్ల పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇదే ఉత్సాహంతో ఫైమా హౌస్ లో బాగా రాణిస్తే తనే ఈ సీజన్ విజేత కావడం ఖాయమనిపిస్తోంది. ఫైమా ఈ అవకాశాన్ని వినియోగించుకుంటుందో, లేదో.. చూడాలి మరి.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
