'ఎటో వెళ్ళిపోయింది మనసు' సీరియల్ రేపే ప్రారంభం!
on Jan 21, 2024
'ఎటో వెళ్ళిపోయింది మనసు' అనే పాట తెలుగు ప్రేక్షకులకుందరికి గుర్తుండే ఉంటుంది. 'నిన్నే పెళ్ళాడతా' సినిమాలో నాగార్జున, టబుల మధ్య సాగే రొమాంటిక్ సాంగ్ ఇది. కొందరు దర్శక, నిర్మాతలు అలనాటి సినిమాలలోని హిట్ సాంగ్స్ ని, వాటిలో వచ్చే చరణాలని నేడు సినిమాలుగా, సీరియల్స్ గా తీసుకొస్తున్నారు. ఝుమ్మందినాదం, సీతాకోకచిలుక, కార్తీక దీపం, సత్యభామ, అవే కళ్ళు, మిస్సమ్మ, కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని, గుండె నిండా గుడిగంటలు.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సీరియల్స్ బుల్లితెర ధారావాహికలుగా తెలుగు ప్రేక్షకులని అలరిస్తున్నాయి. ఇప్పుడు అదే కోవలో స్టార్ మా టీవీలో కొత్త సీరియల్ రాబోతుంది.
రేపు అనగా జనవరి 22న స్టార్ మా టీవీలో 'ఎటో వెళ్ళిపోయింది మనసు' సీరియల్ ప్రారంభం కానుంది. ఇందులో ప్రధాన పాత్రలుగా సీతాకాంత్, రక్ష నింబార్గి చేస్తున్నారు. భార్యామణి, అష్టా చెమ్మ సీరియల్స్ లలో నటించి సీతాకాంత్ మంచి ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నాడు. రక్ష నింబార్గి కన్నడ భామ. బింగో అనే కన్నడ మూవీతో వెండితెరపై అరంగేట్రం చేస్తుంది. రక్ష నింబార్గి తెలుగులో చేస్తోన్న తొలి సీరియల్ ఎటో వెళ్ళిపోయింది మనసు. కన్నడ, తమిళ్ నుండి వచ్చిన ఎంతోమంది హీరోయిన్ లు తెలుగులో మంచి ఫ్యాన్ బేస్ తెచ్చుకున్నారు. ప్రియాంక జైన్, పల్లవి గౌడ, రక్ష గౌడ, శోభాశెట్టి ఇలా చెప్పుకుంటూ పోతే తెలుగు సీరియల్స్ లలో కన్నడ భామల లిస్ట్ పెద్దగానే ఉంది. ఆ జాబితాలోకి ఇప్పుడు రక్ష నింబార్గి చేరింది.
ఈ సీరియల్ నుంచి తాజాగా విడుదలైన ప్రోమోలో ఏం ఉందంటే.. సీతాకాంత్, రామలక్ష్మీల వివాహం కోసం ముహుర్తంతో ప్రోమో ఆసక్తిగా మొదలైంది. ఇక రామలక్ష్మి, సీతాకాంత్ మధ్యలో చాలానే ఏజ్ గ్యాప్ ఉంది. ఇప్పటికే ఏజ్ గ్యాప్ మీద 30 weds 21 వెబ్ సిరీస్ ఎంత పాపులర్ అయిందో అందరికి తెలిసిందే. ఇప్పుడు అదే బాటలో ఈ కొత్త సీరియల్ రాబోతుంది. నీకు షేక్ హ్యాండ్ ఇవ్వడమంటేనే కంపరం.. అలాంటిది నీ చేతిలో చేయి వేసి నడవడమంటే అది ఇంపాజిబుల్ అని సీతాకాంత్ అనగా.. శానిటైజర్ స్మెల్ తో సంసారమో సైన్స్ ల్యాబో తెలియని నీతో లైఫ్ అంటేనే హర్రిబుల్ అని రామలక్ష్మి అంటుంది. ఇలా ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ఉండగా మరి వీరిద్దరికి పెళ్ళి జరుగుతుందా? లేదా.. జరిగితే ఎలా కలిసి ఉంటారో తెలియాలంటే ఈ సీరియల్ ని చూడాల్సిందే. తెలుగులో మొట్టమొదటి సీరియల్ చేస్తోన్న రక్ష నింబార్గి హిట్ అందుకుంటుందో లేదో చూడాలి మరి.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
