శేఖర్ మాస్టర్ మంచి మనసు.. పస్తులుంటున్న డాన్సర్ల కోసం..!
on May 17, 2021
కరోనా సెకండ్ వేవ్ కారణంగా దేశంలో కేసులు పెరిగిపోయాయి. గతేడాది మాదిరి ఈ ఏడాది కూడా కార్మికుల పరిస్థితి దారుణంగా మారింది. లాక్ డౌన్ వలన చాలా మంది ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు. నిత్యావసర సరుకులు కూడా కొనలేని పరిస్థితి. దీంతో పలువురు సెలబ్రిటీలు తమకు తోచిన సాయం చేస్తూ ఆపదలో ఉన్నవారిని ఆదుకుంటున్నారు. అయితే ఈ సెకండ్ వేవ్ లో కళను నమ్ముకొని జీవనం సాగిస్తున్న ఎంతోమంది డాన్సర్లు కూడా పని లేక పస్తులు ఉంటున్నారు.
దీంతో అలాంటివారిని ఆదుకోవడానికి ముందుకొచ్చారు ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్. గ్రూప్ డాన్సర్ లు, టీవీ షోలు చేసే డాన్సర్లకు ఈ సమయంలో పని దొరకడం చాలా కష్టంగా మారిందని చెప్పిన ఆయన.. తినడానికి కూడా డబ్బులు లేక చాలా మంది ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఇలా ఎవరైనా ఇబ్బందులు పడుతుంటే వెంటనే తనకు ఫోన్ చేసి చెప్పమని తెలుపుతూ తన సోషల్ మీడియా అకౌంట్ లో ఓ వీడియోను పోస్ట్ చేశారు శేఖర్ మాస్టర్.
ఆడియో ఫంక్షన్లు, సంగీత్ వంటి కార్యక్రమాలు ఆగిపోవడంతో గ్రూప్ డాన్సర్లు సహా చాలా మందికి ఆదాయం లేదని.. హైదరాబాద్ లో ఉన్న డాన్సర్లకు ఎవరికైనా నిత్యావసర సరుకులు అవసరమైతే తాను అందిస్తానని శేఖర్ మాస్టర్ అన్నారు. ఈ మేరకు 9989189885, 9618961492, 7416519257 నెంబర్లకి ఫోన్ చేసి ఉచితంగా నిత్యావసర సరకులు తీసుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం పరిస్థితుల కారణంగా అందరూ ఇంట్లోనే ఉండాలని.. అవసరం ఉంటేనే తప్ప బయటకి రావొద్దని సూచించారు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
