Brahmamudi: ఆస్తి పంపకాలు చేయిస్తానంటున్న సుభాష్.. ఆ ముగ్గురు ఫుల్ ఖుషీ!
on Dec 11, 2024
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి(Brahmamudi)'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్-590 లో.. నాన్న ఆరోగ్యం బాగుపడే వరకు శాంతంగా ఉండాలని ధాన్యలక్ష్మికి సుభాష్ నచ్చజెప్పే ప్రయత్నం చేస్తాడు.ఇక మధ్యలో రుద్రాణి కలుగజేసుకొని.. నాన్న ఆరోగ్యం సాకుగా భలే చూపిస్తున్నావ్ అన్నయ్యా.. మరి నాన్న తిరిగి క్షేమంగా రాకపోతే అని కోపంగా అంటుంది రుద్రాణి. ఏం కూసావే అంటు రుద్రాణి చెంపచెల్లమనిపిస్తుంది ఇందిరాదేవి. రుద్రాణీ.. నీకు ఇదే చెప్పడం.. ఇది నువ్వు లేపిన రచ్చే అని అర్థమవుతోంది నాకు.. నిన్ను నడిరోడ్డు మీద కట్టు బట్టలతో నిలబెడతాను జాగ్రత్త అంటూ ఇందిరాదేవి వార్నింగ్ ఇస్తుంది.
దాంతో రగిలిపోయిన రుద్రాణి.. నేను ఈ ఇంటి బిడ్డనే.. నాన్నే నాకు మాటిచ్చాడు ఆడపిల్లకు హక్కు ఉందని. సరే మీరంతా ఇంతగా నా మీద అరుస్తున్నారు కాబట్టి ఇప్పుడు చెబుతున్నాను వినండి.. ధాన్యలక్ష్మి అడుగుతున్నట్లు నాకు కూడా ఆస్తి కావాల్సిందే.. నాకు నా కొడుక్కి నాకు పుట్టబోయే మనవడికి ఆస్తి పంచాల్సిందే.. ఇవ్వనంటే ఎలా తీసుకోవాలో నాకు తెలుసు. ఆ సత్తా నాకుందని రుద్రాణి గట్టిగా చెప్తుంది. నువ్వు ఆగు రుద్రాణీ.. వీళ్లంతా నా మొగుడ్ని అమాయకుడ్ని చేసి.. నా నోట్లో మట్టి కొట్టాలని చూస్తున్నారు.. నేను ఊరుకోను.. ఆస్తి ముక్కలు చేసి మా వాటా కళ్యాణ్‌కి ఇవ్వాల్సిందేనని ధాన్యలక్ష్మి ఫైర్ అవుతుంది. ఇక విసిగిపోయిన ఇందిరాదేవి తన గదికి వెళ్లిపోతుంది. ఇక ధాన్యలక్ష్మి మాటలు విన్న సుభాష్.. సరే అందరికి ఆస్తిని పంపేస్తాను.. కలిసి ఉండాలని లేని మీ అందరిని వదిలించుకోవడమే నాకు నయం.. మీకు కావాల్సింది ఆస్తే కదా.. రేపే లాయర్‌ని పిలిపించి మొత్తం ఆస్తిని పంచేస్తానంటాడు. ఆస్తిని పంచిస్తానని సుభాష్ చెప్పడంతో రాహుల్, రుద్రాణి, ధాన్యలక్ష్మి పొంగిపోతారు. ఇక సుభాష్ కోపంగా బయటకి వెళ్లి పూలకుండి తన్నేస్తాడు. తన దగ్గరికి వెళ్లిన కావ్య.. కోపంలో తీసుకునే నిర్ణయాలు మంచి ఫలితాలను ఇవ్వవని నాకంటే మీకే బాగా తెలుసు మావయ్యగారు.. వాళ్లంతా విచక్షణ మాట్లాడారే అనుకోండి. మీరెందుకు సహనం కోల్పోయారు.. తాతయ్యగారికి సుమారు 70 ఏళ్లు ఉంటాయనుకోండి. ఆయన ఎందుకు ఈ వయసులో ఈ ఇల్లు ముక్కలు అవ్వకూడదనే ఆఖరి నిమిషం వరకూ పోరాడారని ఆలోవించమని కావ్య అంటుంది. ఆలోచించానమ్మా.. ఒక్కసారి కాదు వందసార్లు ఆలోచించాను. కానీ నా నిర్ణయం మారదు. నిజంగానే వాళ్లు మాట్లాడిన మాటలు మా నాన్నే విని ఉంటే ఈ క్షణమే ఆస్తి పంచేసేవారనేసి సుభాష్ అక్కడ నుంచి కోపంగా వెళ్లిపోతాడు.
ఆ తర్వాత రాజ్ దగ్గరికి వెళ్లిన కావ్య.. మీరేం పట్టించుకోరా.. ఇల్లు ముక్కలవుతుంటే చూస్తూ ఉంటారా.. ఏమండీ అర్థం చేసుకోండి. మావయ్యగారిని ఆస్తి పంచొద్దని చెప్పండి అంటూ రాజ్‌ని తెగ రిక్వెస్ట్ చేస్తుంది కావ్య. ఈ ఇల్లు అల్లకల్లోలం కాకూడదని ఇంతకాలం చాలా ప్రయత్నించాను.. కానీ అది వృధా అని అర్థం చేసుకున్నాను.. ఇంట్లో వాళ్లు ఎలా మాట్లాడుతున్నారో నువ్వు చూశావ్ కదా.. ఒక రకంగా డాడీ తీసుకున్న నిర్ణయం కరెక్టే అనిపిస్తోంది.. ఎవరికి వాళ్లు ఆస్తి కావాలని గొడవపడుతున్నారే తప్ప కలిసి ఉందామని ఒక్కరైనా చెప్పారా? అసలు తాతయ్య తనకు నచ్చిన విధంగా నిర్ణయాలు తీసుకున్నాడు.. నిన్ను కంపెనీకి సీఈవోని చేశాడు.. ఆ రోజు నన్ను అడిగారా? కానీ ఈ రోజు ఆస్తి కావాలని ఇంట్లో అంతా గొడవ చేస్తున్నారు.. ఒక్క మాట అయినా నన్ను అడిగారా అని రాజ్ అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Also Read