Brahmamudi: హాస్పిటల్ బెడ్ పై పెద్దాయన.. ఎస్సై ట్రైనింగ్ కి అప్పు!
on Dec 6, 2024
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ బ్రహ్మముడి. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్- 586 లో.. సీతారామయ్య హాస్పిటల్ లో ఉండగా.. అందరు బయట ఉంటారు. కావ్యని లోపలికి రమ్మని పిలుస్తాడు సీతారామయ్య. తను రాగానే.. అమ్మా కావ్యా అంటూ ఆక్సిజన్ మాస్క్ తీసి మాట్లాడటం మొదలుపెడతాడు సీతారామయ్య. తాతయ్యా మీకు ఆక్సిజన్ అందకపోతే మళ్లీ ఇబ్బంది అవుతుందని కావ్య అంటుంది. పర్వాలేదమ్మా.. కూర్చో.. నేను మళ్లీ నీతో మాట్లాడతానో లేదో ఏం చెప్పినా ఇప్పుడే చెప్పనివ్వు అమ్మా అని సీతారామయ్య అంటాడు. అలా మాట్లాడకండి తాతయ్యా.. మీకు ఏదైనా అయితే మీ చిట్టీ (ఇందిరా దేవి) ఏమైపోతుంది? ఇప్పటికే ఈ బావ కోసం గుండె గుప్పెట్లో పెట్టుకుని బయట ఏడుస్తూ కూర్చుందని కావ్య అంటుంది. మేము ఆకలిగా ఉన్నామని తెలిసి వాడు మాట్లాడకపోయినా అన్నం తెచ్చి పెట్టిన దానివి.. నేను లేకపోయినా నువ్వు చిట్టీని చూసుకోగలవు కదమ్మా అని సీతారామయ్య అనగా.. మీరు అలా మాట్లాడకండి తాతయ్యా. మీరు మీ చిట్టి కోసమే కాదు.. ఈ మనవరాలి కోసం మీ మనవడి కోసం క్షేమంగా తిరిగి వస్తారని కావ్య అంటుంది.
అమ్మా.. నేను ఇప్పుడు చెప్పే మాటలు బాగా విను.. ఇప్పటి నుంచి ప్రతి రోజు నీకో పరీక్షలా ఉండొచ్చు.. రాజ్ నీ విషయంలో కాస్త దురసుగా ప్రవర్తించొచ్చు. నువ్వు మా ఇంటి మహాలక్ష్మివి. నువ్వు ఇల్లు దాటిన రోజు ఇల్లు చీకటి అయిపోతుంది. ఎవరికి వారు అయిపోతారు. ఇల్లు ముక్కలైపోతుంది. అలా జరగకుండా చేస్తానని నాకు మాటివ్వమ్మా అని సీతారామయ్య అంటాడు. ఇంతపెద్ద బాధ్యతను నేను ఎలా మోయగలను తాతయ్యా అని కావ్య అంటుంది. చేయగలవమ్మా.. నీ సహనమే నీకు శ్రీరామరక్ష.. ఇదే నా ఆఖరి కోరిక అనుకోమ్మా అని సీతారామయ్య అనగానే.. సరేనని కావ్య మాటిస్తుంది. ఇంతలో సీతారామయ్యకి ఊపిరి తీసుకోవడం కష్టం కావడంతో నర్స్ వచ్చి కావ్యని బయటికి పంపిస్తుంది. ఇక కావ్య బయటకు రాగానే ఏం అన్నాడని రుద్రాణి అడుగుతుంది. లోపల తాతయ్యగారు నాతో చెప్పింది చెప్పినట్లుగా చెబుతున్నాను. కొంత మందికి నచ్చకపోవచ్చు.. అయినా చెబుతున్నాను.. తాతయ్యగారు కోలుకుని ఇంటికి తిరిగి వచ్చే దాకా కుటుంబంలో గొడవలు పడకూడదు అని అన్నారు.. ఆయన తిరిగి వచ్చాక ఎవరికి ఎలా న్యాయం చెయ్యాలో అలా చేస్తాను అని అన్నారని కావ్య అంటుంది. ఇక ఇందిరాదేవి అయితే.. బావా అంటూ ఐసీయూ గేట్ నుంచి లోపలికి చూస్తూ ఏడ్చే సీన్ మాత్రం మనసుల్ని మెలిపెట్టేస్తుంది.
మరోవైపు కళ్యాణ్ ఇంటికి ఓ పోస్ట్ వస్తుంది. అది చూసి కళ్యాణ్ సంబరపడి.. అప్పుని పిలిచి ఇస్తాడు. వావ్ కూచీ.. నేను గెలిచాను.. పోలీస్ అయ్యాను.. ట్రైనింగ్‌కి లెటర్ వచ్చేసిందని అప్పు అంటుంది. అవును నా పొట్టీ పోలీస్ అయ్యిందని కళ్యాణ్ అంటాడు. అవునురా భయ్.. ఇక నుంచి నేను నీ పోలీస్ పెళ్లాన్ని.. నువ్వు నా పాటల మొగుడివి అంటూ గుండెలపై వాలిపోతుంది అప్పు. పొట్టీ ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ రోజు కోసం మనం ఎంతో ఎదురు చూశాం.. ఈ విషయం వెంటనే తాతయ్య వాళ్లకు చెప్పాలి.. తాతయ్య అయితే చాలా సంతోషిస్తారని అంటాడు కళ్యాణ్. ఇంతలో ఆ లెటర్ లో ట్రైనింగ్ ఈ రోజే అని ఉండటంతో.. తొందరగా బ్యాగ్ తెచ్చుకో , నేను మా ఫ్రెండ్ కి చెప్పి టికెట్ బుక్ చేస్తా అని అంటాడు కళ్యాణ్. ఇంతలో కావ్య ఫోన్ చేసి.. తాతయ్య గారిని హాస్పిటల్ లో జాయిన్ చేశామని జరిగిందంతా చెప్తుంది. సరే వదినా వస్తామని చెప్పి కళ్యాణ్ ఫోట్ కట్ చేస్తాడు. ఇంతలో అప్పు రెడీ అయి వస్తుంది. సారీ అప్పు నేను రావడం లేదు.. లిరిక్ రైటర్ రమ్మన్నాడు.. నువ్వు ఒక్కదానివే వెళ్ళాలని కళ్యాణ్ అనగా.. కాబోయే ఎస్సై ని నాకేం భయం.. నేను వెళ్తానని అప్పు వెళ్తుంది. సారీ అప్పూ.. తాతయ్యకు బాలేదని తెలిస్తే నువ్వు ఆగిపోతావ్.. నువ్వు ఆగిపోకూడదు.. అందుకే చెప్పడం లేదని కళ్యాణ్ మనసులో అనుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Also Read