ఎనిమిదేళ్ల తర్వాత వైవీఎస్ చౌదరి డైరెక్షన్ లో మూవీ.. ఎవరితోనో తెలుసా?
on Sep 23, 2023
'శ్రీ సీతారాముల కళ్యాణం చూతము రారండి', 'సీతారామరాజు', 'లాహిరి లాహిరి లాహిరిలో', 'సీతయ్య', 'దేవదాసు' వంటి విజయవంతమైన చిత్రాలతో దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు వైవీఎస్ చౌదరి. 'దేవదాసు' తర్వాత 'ఒక్క మగాడు', 'సలీమ్' రూపంలో ఘోర పరాజయాలు ఎదురుకావడంతో కొన్నేళ్లు డైరెక్షన్ కి దూరమయ్యారు. 'సలీమ్' 2009 లో విడుదల కాగా, ఆయన డైరెక్ట్ చేసిన తదుపరి సినిమా 'రేయ్' 2015 లో విడుదలైంది. ఈ మూవీతో సాయి ధరమ్ తేజ్ ని హీరోగా పరిచయం చేస్తూ ఆరేళ్ళ గ్యాప్ తర్వాత వచ్చినా.. వైవీఎస్ కి పరాజయం తప్పలేదు. దీంతో ఆయన ఎనిమిదేళ్లుగా మెగా పట్టలేదు. కానీ అనూహ్యంగా ఇంత గ్యాప్ తర్వాత మళ్ళీ ఆయనకు డైరెక్షన్ వైపు మనసు మళ్ళింది.
వైవీఎస్ చౌదరి దర్శకత్వంలో ఓ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ రూపొందనుందట. నూతన నటీనటులతో తెరకెక్కించనున్న ఈ ప్రాజెక్ట్ కోసం ప్రస్తుతం ఆడిషన్స్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. నటీనటులు కొత్తవాళ్లు అయినప్పటికీ, టెక్నీషియన్స్ పరంగా మ్యూజిక్ డైరెక్టర్ ఎం.ఎం.కీరవాణి సహా పలువురు సీనియర్లు పని చేయబోతున్నట్లు సమాచారం.
వైవీఎస్ చౌదరి తన సినిమాల ద్వారా పలువురు నూతన నటీనటులను పరిచయం చేశారు. ముఖ్యంగా రామ్ పోతినేని, ఇలియానాలను పరిచయం చేస్తూ తీసిన 'దేవదాసు' ఎంతటి విజయం సాధించిందో తెలిసిందే. మరి ఎనిమిదేళ్ల తర్వాత డైరెక్టర్ గా రీఎంట్రీ ఇస్తూ కొత్త వాళ్ళతో చేస్తున్న ప్రయత్నం వైవీఎస్ చౌదరికి మళ్ళీ 'దేవదాసు' లాంటి విజయాన్ని అందిస్తుందేమో చూడాలి.