ఆర్జీవీ 'వ్యూహం'.. వైఎస్ జగన్, భారతిని దింపేశారుగా!
on Jun 1, 2023
"నేను అతి త్వరలో 'వ్యూహం' అనే పేరుతో ఓ రాజకీయ సినిమా తీయబోతున్నాను. ఇది బయోపిక్ కాదు.. బయోపిక్ కన్నా లోతైన రియల్ పిక్. బయోపిక్‌లో అబద్ధాలు ఉండొచ్చు కానీ, రియల్ పిక్‌లో నూటికి నూరు పాళ్ళు నిజాలే ఉంటాయి" అంటూ రామ్‌గోపాల్ వర్మ ఇటీవల ఓ ప్రకటన ఇచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ 'వ్యూహం' సినిమాలో ప్రధాన పాత్రలు పోషిస్తున్న నటీనటుల వివరాలు వెల్లడించారు.
'వ్యూహం' అనేది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబ నేపథ్యంలో తెరకెక్కుతోన్న చిత్రం. ఇందులో ఆర్జీవీ, వైఎస్ జగన్ పాత్రను హైలైట్ చేసి చూపించనున్నారని తెలుస్తోంది. ఈ చిత్రంలో జగన్ పాత్రలో 'రంగం' ఫేమ్ అజ్మల్, జగన్ సతీమణి భారతి పాత్రలో మానస రాధాకృష్ణన్ నటించనున్నారు. ఆ పాత్రల్లో వారు ఎలా కనిపించనున్నారో తెలుపుతూ కొన్ని ఫోటోలను విడుదల చేశారు. జగన్, భారతి పాత్రలకు ఆ ఇద్దరు సరిగ్గా సరిపోయారు అనిపిస్తోంది. ముఖ్యంగా కొన్ని ఫోటోలలో మానసలో భారతి పోలికలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. కాగా గతంలో ఆర్జీవీ రూపొందించిన 'అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు' చిత్రంలోనూ జగన్ పాత్రలో అజ్మల్ నటించడం విశేషం.
ఈ చిత్రాన్ని రామదూత క్రియేషన్స్ పతాకంపై దాసరి కిరణ్ నిర్మిస్తున్నారు. ఇది 'అహంకారానికి ఆలోచనకు మధ్య జరిగే యుద్ధం' ఇతివృత్తంతో రూపొందుతోందని, త్వరలో ఇతర వివరాలను ప్రకటిస్తామని మేకర్స్ తెలిపారు.