ఒకేరోజు రెండు భారీ సినిమాలు.. చప్పుడు లేదేంటి..?
on Apr 4, 2025
ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఎవరి ఊహలకి అందదు. గతంలో తాము నిర్మించిన బాలకృష్ణ 'వీరసింహారెడ్డి', చిరంజీవి 'వాల్తేరు వీరయ్య' సినిమాలను ఒకేసారి విడుదల చేసి సర్ ప్రైజ్ చేసింది. ఇప్పుడు కూడా తమ బ్యానర్ లో రూపొందిన ఇద్దరు స్టార్ హీరోల సినిమాలను ఒకేరోజు విడుదల చేస్తోంది. కానీ, ప్రమోషన్స్ లో మాత్రం వెనుకబడిపోయింది.
ఏప్రిల్ 10న 'గుడ్ బ్యాడ్ అగ్లీ', 'జాట్' సినిమాలు విడుదలవుతున్నాయి. ఈ రెండు కూడా మైత్రి బ్యానర్ లో భారీ బడ్జెట్ తో రూపొందినవే. 'గుడ్ బ్యాడ్ అగ్లీ'లో కోలీవుడ్ స్టార్ అజిత్ హీరోగా నటించగా, అధిక్ రవిచంద్రన్ దర్శకుడు. ఇక 'జాట్'లో బాలీవుడ్ స్టార్ సన్నీ డియోల్ నటించగా, మన తెలుగు దర్శకుడు గోపీచంద్ మలినేని డైరెక్ట్ చేశాడు. ఈ రెండూ భారీ బడ్జెట్ తో తెరకెక్కిన క్రేజీ ప్రాజెక్ట్ లే. పైగా విడుదలకు ఇంకా ఐదు రోజులే సమయముంది. అయినప్పటికీ ప్రమోషన్స్ లో మాత్రం జోరు లేదు. (Good Bad Ugly)
అజిత్ మొదటి నుంచి ప్రమోషన్స్ కి దూరం. దాదాపు ఆయన మూవీల ప్రమోషన్స్ బాధ్యతను మిగతా టీం తీసుకుంటూ ఉంటుంది. కానీ, ఇప్పుడు 'గుడ్ బ్యాడ్ అగ్లీ' విషయంలో పూర్తిగా వదిలేసినట్టుగా అనిపిస్తోంది. తమిళనాట అజిత్ సినిమా స్థాయి హడావుడి కనిపించట్లేదు. ఇక తెలుగునాట సరేసరి. నిర్మాతలు మైత్రి అయినప్పటికీ, ఎందుకనో తెలుగులో ప్రమోట్ చెయ్యట్లేదు. (Jaat)
ఇక 'జాట్' పరిస్థితి కూడా అలాగే ఉంది. 'గదర్-2' వంటి బిగ్గెస్ట్ హిట్ తర్వాత సన్నీ డియోల్ నుంచి వస్తున్న సినిమా కావడంతో.. జాట్ పై హిందీ ప్రేక్షకుల్లో ఆసక్తి ఉండటం సహజం. అలాగే ఓ వైపు మైత్రి నిర్మాణం, మరోవైపు గోపీచంద్ దర్శకత్వం కావడంతో.. తెలుగు ప్రేక్షకుల దృష్టి కూడా ఈ సినిమాపై ఉంటుంది. కానీ అందుకు తగ్గ ప్రమోషన్స్ లేకపోవడంతో.. అటు హిందీలోనూ, ఇటు తెలుగులోనూ రావాల్సినంత హైప్ రాలేదు.
ఒకే రోజు తమ బ్యానర్ నుంచి ఇద్దరు స్టార్స్ సినిమాలు వస్తున్నా మైత్రి ఇంత సైలెంట్ గా ఎందుకు ఉంది? ఇదొక కొత్త స్ట్రాటజీనా? సైలెంట్ వచ్చి రిజల్ట్ తో సర్ ప్రైజ్ చేస్తుందేమో చూడాలి.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
