రిలీజ్‌కు విజయ్ 'మాస్టర్' ట్రైలర్ రెడీ
on Jul 15, 2020
తమిళ స్టార్ యాక్టర్ విజయ్ టైటిల్ రోల్ పోషిస్తోన్న 'మాస్టర్' మూవీపై అంచనాలు ఆకాశాన్నంటుతుండగా, ఆ సినిమా అప్డేట్స్ తెలియక ఫ్యాన్స్ తీవ్ర అసహనానికి గురవుతున్నారు. ఆ సినిమా థియేటర్లలోనే రిలీజ్ అవుతుందని నిర్మాత జేవియర్ బ్రిట్టో ధ్రువీకరించడమే చివరిసారిగా ఆ మూవీ గురించి వినిపించిన సమాచారం. ఆ మధ్య 'మాస్టర్' ఓటీటీ ప్లాట్‌ఫామ్‌పై విడుదలవుతుందంటూ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారంలోకి వచ్చింది. కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి ఉధృతి కారణంగా సినిమా హాళ్లు ఇప్పట్లో తెరుచుకొనే అవకాశం కనిపించకపోతుండటంతో అనేకమంది నిర్మాతలు తమ సినిమాలను ఓటీటీపై విడుదల చేయడానికి మొగ్గు చూపుతున్నారు.
'ఖైది' ఫేమ్ లోకేశ్ కనగరాజ్ డైరెక్ట్ చేస్తోన్న ఈ మూవీలో విజయ్‌తో పాటు విజయ్ సేతుపతి, మాళవికా మోహనన్, శంతను భాగ్యరాజ్, ఆండ్రియా జెర్మియా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇటీవల 'మాస్టర్' ట్రైలర్ గురించి ఒక ఇంటర్వ్యూలో వెల్లడించాడు శంతను. అతను చెప్పిన దాని ప్రకారం దర్శక నిర్మాతలు ఆ ట్రైలర్‌ను సిద్ధం చేస్తున్నారు. అయితే తాను ఓ షార్ట్ ఫిల్మ్ కోసం పనిచేస్తుండటంతో, నిర్మాతలు కబురంపినా, ఆ ట్రైలర్‌ను చూడలేకపోయానని అతను తెలిపాడు. సినిమాల పోస్ట్ ప్రొడక్షన్ పనులకు తమిళనాడు గవర్నమెంట్ అనుమతులు ఇవ్వడంతో, అందుకు అనుగుణంగా 'మాస్టర్' నిర్మాతలు పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుతూ వస్తున్నారు. మంచి రోజు చూసుకొని ట్రైలర్‌ను విడుదల చేయడానికి సిద్ధమవుతున్నారు.
వాస్తవానికి 'మాస్టర్' ఏప్రిల్‌లోనే ప్రేక్షకుల ముందుకు రావాల్సింది. కానీ కొవిడ్-19 వ్యాప్తి కారణంగా థియేటర్లు మూతపడటంతో అనివార్యంగా విడుదల వాయిదాపడింది. కనీసం ట్రైలర్ అయినా వస్తే 'మాస్టర్'గా తమ హీరో ఎలా ఉంటాడో, ఎలాంటి డైలాగ్స్ చెబుతాడో చూడాలని విజయ్ ఫ్యాన్స్ అత్యంత ఆత్రుతతో ఎదురుచూస్తున్నారు.