పోలీస్ స్టేషన్‌లో విజయశాంతి దంపతులు.. అసలేం జరిగింది?
on Apr 12, 2025
సీనియర్ హీరోయిన్ విజయశాంతి, ఆమె భర్త శ్రీనివాస్ ప్రసాద్ పోలీసులను ఆశ్రయించారు. చంద్రశేఖర్ అనే వ్యక్తి తమను బజారుకీడుస్తానని, చంపుతామని బెదిరిస్తున్నాడని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. వీరు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా చంద్రశేఖర్ అనే వ్యక్తిపై బంజారా హిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. అసలు విజయశాంతి దంపతులకు, చంద్రశేఖర్‌కి మధ్య ఏం జరిగింది, వీరి మధ్య ఉన్న వివాదం ఏమిటి అనే వివరాల్లోకి వెళితే..
కొంతకాలం క్రితం చంద్రశేఖర్ అనే వ్యక్తి విజయశాంతి భర్త శ్రీనివాస్ ప్రసాద్‌ని కలిశారు. తాను సోషల్ మీడియాలో ప్రమోషన్స్ చేస్తానని చెప్పడంతో విజయశాంతికి సంబంధించిన సోషల్ మీడియా ఎకౌంట్‌ను అతనికి అప్పగించి ప్రమోట్ చెయ్యమని చెప్పారు. అయితే కొన్నిరోజులు చేసిన తర్వాత తమకు నచ్చితే ఫిక్స్ చేసుకుంటామని చెప్పారు. దాని కోసం కొంత డబ్బు కూడా అతనికి ఇచ్చారు. శ్రీనివాస్ ప్రసాద్ చెప్పినట్టుగానే కొంతకాలం చంద్రశేఖర్ సోషల్ మీడియాలో వారి కోసం వర్క్ చేశాడు. పనితీరు నచ్చకపోవడంతో అతన్ని తొలగించారు. దీనిపై కొంత కాలం సైలెంట్‌గా ఉన్న చంద్రశేఖర్ బెదిరింపులకు పాల్పడుతున్నాడు. శ్రీనివాస్ ప్రసాద్‌కి ఫోన్ చేసి తాను అడిగినంత డబ్బు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాడు. లేకపోతే శ్రీనివాస్ ప్రసాద్‌ను, విజయశాంతిని చంపేస్తానని మెసేజ్‌లు పెడుతున్నాడు. డబ్బు ఇవ్వకపోతే పరువు తీసి బజారుకీడుస్తానని చెబుతున్నాడట. దీంతో వీరు బంజారా హిల్స్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు.
కొన్ని సంవత్సరాల క్రితమే సినిమాలకు గుడ్‌బై చెప్పి రాజకీయాల్లో చురుకుగా పాల్గొంటున్న విజయశాంతి ప్రస్తుతం కాంగ్రెస్ ఎమ్మెల్సీగా పదవీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. 2020లో వచ్చిన సరిలేరు నీకెవ్వరు చిత్రం ద్వారా తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆమె తాజాగా నందమూరి కళ్యాణ్‌రామ్ హీరోగా నటిస్తున్న అర్జున్ సన్నాఫ్ వైజయంతి చిత్రంలో పోలీస్ ఆఫీసర్ పాత్ర పోషిస్తున్నారు. గతంలో ఇలాంటి ఎన్నో పవర్‌ఫుల్ క్యారెక్టర్స్ చేసిన విజయశాంతికి ఇది ఒక ప్రెస్టీజియస్ మూవీ కాబోతోంది. ఈనెల 18న అర్జున్ సన్నాఫ్ వైజయంతి చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది.
Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
