ప్రముఖ నటుడు విజయకాంత్ కన్నుమూత
on Dec 27, 2023

సినీ పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ తమిళ నటుడు, డీఎండీకే పార్టీ అధినేత కెప్టెన్ విజయకాంత్(71) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ ఈరోజు(డిసెంబర్ 28) ఉదయం కన్నుమూశారు.
ఇటీవల విజయకాంత్ తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిపాలై, కాస్త కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. అయితే ఆయన శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడటంతో మళ్ళీ కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. ఆయనకు కోవిడ్ కూడా సోకినట్లు నిర్దారణ అయింది. ఈ క్రమంలో చికిత్స పొందుతూ గురువారం మరణించారు.
తమిళనాట అగ్ర నటుల్లో విజయకాంత్ ఒకరు. 1979 లో 'ఇనిక్కుం ఇలామై' సినిమాతో నటుడిగా ప్రయాణం మొదలుపెట్టిన ఆయన.. వరుస సినిమాలతో అలరిస్తూ కెప్టెన్ గా ఎదిగారు. ముఖ్యంగా పలు చిత్రాల్లో పోలీస్ పాత్రలు పోషించి మెప్పించారు. నాలుగు దశాబ్దాల సినీ కెరీర్ లో 150కి పైగా సినిమాల్లో నటించి తిరుగులేని ఇమేజ్ సొంతం చేసుకున్నారు. డీఎండీకే పార్టీని స్థాపించి తమిళ రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేశారు.
విజయకాంత్ అసలు పేరు విజయరాజ్ అళగరస్వామి నాయుడు. ఆయన మధురైలో కె.ఎన్.అలగర్‌స్వామి, ఆండాళ్ అజగర్‌స్వామి దంపతులకు ఆగస్టు 25, 1952 న జన్మించారు. 1990 జనవరి 31 న ప్రేమలతను వివాహం చేసుకున్నారు. వారికి ఇద్దరు కుమారులు.. విజయ్ ప్రభాకర్, షణ్ముగ పాండ్యన్.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



