విజయ్ తర్వాత కమల్‌కి విలన్‌గా సేతుపతి!
on Apr 7, 2021
`ఖైదీ`, `మాస్టర్` చిత్రాలతో తమిళ, తెలుగు పరిశ్రమల దృష్టిని ఆకర్షించాడు యువ దర్శకుడు లోకేశ్ కనకరాజ్. ప్రస్తుతం ఈ టాలెంటెడ్ డైరెక్టర్.. లోక నాయకుడు కమల్ హాసన్ కాంబినేషన్ లో `విక్రమ్` చేస్తున్నాడు. కమల్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేసిన టైటిల్ టీజర్ విశేషంగా అలరించిన నేపథ్యంలో.. ఈ సినిమాపై సర్వత్రా మంచి ఆసక్తి నెలకొంది. వాస్తవానికి ఈ వేసవిలోనే `విక్రమ్` థియేటర్స్ లోకి రావాల్సింది. అయితే చిత్రీకరణ పరంగా జాప్యం చోటుచేసుకోవడంతో.. సమ్మర్ సీజన్ ని మిస్ అవక తప్పడం లేదు.
ఇదిలా ఉంటే.. ఈ చిత్రంలో ప్రతినాయకుడి పాత్రలో మల్టిటాలెంటెడ్ రాఘవ లారెన్స్ నటించబోతున్నాడంటూ ఆ మధ్య జోరుగా ప్రచారం సాగింది. ఏమైందో ఏమో.. ఇప్పుడీ సినిమాలో లారెన్స్ నటించడం లేదట. తన గత చిత్రం `మాస్టర్`లో విలన్ గా నటించిన `మక్కల్ సెల్వన్` విజయ్ సేతుపతినే ఈ పాత్రకి ఒప్పించే దిశగా ప్రయత్నాలు చేస్తున్నాడట లోకేశ్. అదే గనుక కార్యరూపం దాల్చితే.. కమల్, విజయ్ కాంబో బాక్సాఫీస్ సెన్సేషన్ కావడం ఖాయం. మరోవైపు మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్ పేరు కూడా ఈ ప్రాజెక్ట్ కోసం వినిపిస్తోంది. త్వరలోనే `విక్రమ్` విలన్ ఎవరో క్లారిటీ వస్తుంది.