Home

»

Latest News

డెక్కన్ కిచెన్ కేసులో దగ్గుబాటి కుటుంబానికి బిగ్ షాక్ ఇచ్చిన హైకోర్టు.!

Aug 7, 2026 5:38PM

టాలీవుడ్ ప్రముఖ కుటుంబమైన దగ్గుబాటి ఫ్యామిలీకి తెలంగాణ హైకోర్టులో ఊహించని షాక్ తగిలింది. హైదరాబాద్‌ ఫిల్మ్‌నగర్‌లోని ‘దక్కన్ కిచెన్’ లీజు వివాదంలో హీరో దగ్గుబాటి వెంకటేష్, రానా, ప్రముఖ నిర్మాత సురేష్ బాబు, అభిరామ్‌లపై నమోదైన క్రిమినల్ కేసును కొట్టివేసేందుకు న్యాయస్థానం నిరాకరించింది.

తమపై నమోదైన క్రిమినల్ కేసును, పోలీసు ఛార్జ్‌షీట్‌ను రద్దు చేయాలంటూ దగ్గుబాటి సోదరులు తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్ ఎన్.తుకారాంజీ పిటిషన్‌ను కొట్టివేశారు. ఈ వ్యవహారంలో క్రిమినల్ నేరాలకు సంబంధించిన ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని, కాబట్టి నాంపల్లి కోర్టులో విచారణ కొనసాగాల్సిందేనని తేల్చి చెప్పారు.

ఈ వివాదం కేవలం ఆస్తి లీజు హక్కులు, స్థల స్వాధీనానికి సంబంధించిన సివిల్ వ్యవహారమని, ఇందులో ఎలాంటి క్రిమినల్ నేరం లేదని దగ్గుబాటి కుటుంబ సభ్యుల తరఫున లాయర్లు వాదించారు. అయితే, పిటిషనర్లు చేసిన వాదనలను తోసిపుచ్చిన హైకోర్టు, ఈ దశలో విచారణను నిలిపివేయడం సరికాదని స్పష్టం చేసింది.

అసలు ఈ వివాదం విషయానికి వస్తే.. ఫిల్మ్‌నగర్‌లోని దగ్గుబాటి కుటుంబానికి చెందిన స్థలాన్ని నందకుమార్ అనే వ్యక్తి లీజుకు తీసుకుని 'దక్కన్ కిచెన్' హోటల్‌ను నిర్వహించేవారు. అయితే నిబంధనలకు విరుద్ధంగా, జీహెచ్‌ఎంసీ అధికారులతో కలిసి దగ్గుబాటి కుటుంబ సభ్యులు తమ హోటల్‌ను అక్రమంగా కూల్చివేశారని, సామగ్రిని తొలగించి బెదిరింపులకు పాల్పడ్డారని నందకుమార్ నాంపల్లి కోర్టును ఆశ్రయించారు.

ఈ ప్రైవేట్ ఫిర్యాదు ఆధారంగా విచారణ జరిపిన నాంపల్లి మెజిస్ట్రేట్ కోర్టు, పోలీసులను కేసు నమోదు చేసి లోతుగా విచారించాలని ఆదేశించింది. ఆ తర్వాత పోలీసులు దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌ను కోర్టు స్వీకరించి క్రిమినల్ చర్యలు చేపట్టింది. దీన్ని రద్దు చేయాలని వెంకటేష్, రానాలు హైకోర్టును అభ్యర్థించినప్పటికీ ఉపశమనం లభించలేదు.

ఈ పరిణామం సోషల్ మీడియాలోనూ, టాలీవుడ్ వర్గాల్లోనూ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. విక్టరీ వెంకటేష్, రానా లాంటి ప్రముఖ నటులు చట్టపరమైన వివాదంలో చిక్కుకోవడంపై అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడూ కాంట్రావర్సీలకు దూరంగా ఉండే దగ్గుబాటి ఫ్యామిలీ ఇప్పుడు కోర్టు కేసుల చుట్టూ తిరగాల్సి రావడం సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. హైకోర్టు తీర్పుతో నాంపల్లి కోర్టులో ఈ కేసు విచారణ మరింత వేగవంతం కానుంది. ఈ లీజు వివాదంలో దగ్గుబాటి ఫ్యామిలీ తదుపరి చట్టపరమైన అడుగులు ఎలా వేయనుందో వేచి చూడాలి.

 

Venkatesh Daggubati, Rana Daggubati, Deccan Kitchen Case

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com