'వకీల్ సాబ్' లుక్ వచ్చింది.. రెస్పాన్స్ అదిరింది!
on Mar 2, 2020
పవన్ కల్యాణ్ 'వకీల్ సాబ్'గా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. అవును. బాలీవుడ్ ఫిల్మ్ 'పింక్' తెలుగు రీమేక్‌కు 'వకీల్ సాబ్' అనే టైటిల్ పెట్టనున్నట్లు మొదట బ్రేక్ చేసింది 'తెలుగుఒన్' కావడం గమనార్హం. ఆన్‌లైన్‌లో ఆ సినిమాకు 'లాయర్ సాబ్' అనే టైటిల్ పెడుతున్నట్లు ప్రచారం జరుగుతున్నప్పుడు విశ్వసనీయ సమాచారం అందుకున్న 'తెలుగుఒన్'.. తొలిగా 'వకీల్ సాబ్' టైటిల్‌ను ఖరారు చేసే అవకాశం ఉందని తెలిపింది. ఇప్పుడు అదే ఖాయమైంది. సోమవారం ఈ సినిమా టైటిల్ లోగోతో పాటు పవన్ కల్యాణ్ ఫస్ట్ లుక్‌ను నిర్మాతలు విడుదల చేశారు. ఆ లుక్‌లో.. ఒక టెంపోలో ఇంటి సామాను వేసుకొని, చేతిలో ఒక పుస్తకం పట్టుకొని, ఒక చైర్‌లో.. పడుకొన్న తరహాలో కూర్చొని, తిరగేసి ఉన్న ఇంకో చైర్‌పై కాళ్లను పెట్టుకున్న పవన్ కల్యాణ్ కనిపిస్తున్నారు. హుడీ ధరించిన ఆయన కళ్లకు నల్లటి గాగుల్స్ కూడా ఉన్నాయి. చూడగానే ఫ్యాన్స్‌ను అలరించే విధంగా ఈ లుక్ ఉందని చెప్పొచ్చు. లుక్ బయటకు వచ్చీ రాగానే ఫ్యాన్స్ నుంచి వచ్చిన స్పందన అనూహ్యం.
హిందీలో అమితాబ్ బచ్చన్ చేసిన క్యారెక్టర్‌ను పవన్ కల్యాణ్ పోషిస్తున్న ఈ మూవీలో నివేదా థామస్, అంజలి, అనన్య నాగళ్ల.. లైంగిక వేధింపులకు గురైన స్నేహితురాళ్లుగా నటిస్తున్నారు. వాళ్ల తరపున కోర్టులో వాదించే లాయర్‌గా పవన్ కల్యాణ్ కనిపిస్తారు. 'మిడిల్ క్లాస్ అబ్బాయి' ఫేమ్ శ్రీరామ్ వేణు డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాకి 'అల వైకుంఠపురములో' సూపర్ హిట్ కావడంలో కీలక బాధ్యతలు వహించిన సంగీత దర్శకుడు తమన్, సినిమాటోగ్రాఫర్ పి.ఎస్. వినోద్ ఈ మూవీకి పనిచేస్తున్నారు. మే 15న చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
