ఉయ్యాలవాడకు కొబ్బరికాయ్ కొట్టేశారు!
on Aug 16, 2017
సినిమాకు పదేళ్లు దూరమై... మళ్లీ వచ్చి గత వైభవాన్ని గుర్తు చేసేంత భారీ విజయాన్ని ఇచ్చిన క్రెడిట్ భారతీయ చిత్ర పరిశ్రమలో ఒక్క మెగాస్టార్ చిరంజీవికే ఉందనుకుంట. ఒక సామాన్యమైన సినిమాకు 150 కోట్ల వసూళ్లేమిటండీ... విడ్డూరం కాకపోతే. మెగాస్టారా మజాకా.
తెలుగు రాష్ట్రాల వసూళ్లు మాత్రమే చూస్తే... ‘ఖైదీ నంబర్ 150’నే ఇప్పటికీ నంబర్ వన్. ఇందులో ఏ మాత్రం సందేహం లేదు. మరి ఆ సినిమా విడుదలై ఏడు నెలలైంది. ఇప్పటి వరకూ మెగా సినిమా ప్రారంభం కాలేదు. మళ్లీ మెగాస్టార్ ని ఎప్పుడు తెరపై చూస్తామా? అని అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో... గప్ చిప్ గా... గుట్టు చప్పుడు కాకుండా... ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ చిత్రానికి కొబ్బరికాయ కొ్ట్టేశారు మెగాస్టార్ చిరంజీవి. బుధవారం ఉదయం ఈ చిత్రం పూజాకార్యక్రమాలను నిర్వహించారు. చిరంజీవి, సురేఖ దంపతులతో పాటు, రామ్ చరణ్, దర్శకుడు సురేందర్ రెడ్డి, అల్లు అరవింద్, పరుచూరి బ్రదర్స్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా... సాయిమాధవ్ బుర్రా రాసిన స్క్రిప్ట్ ని... మెగాస్టార్ దంపతులలకు పరుచూరి బ్రదర్స్ అందించారు. ఏ.ఆర్.రెహమాన్ ని ఈ చిత్ర సంగీత దర్శకునిగా తీసుకోడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయ్. రవివర్మన్ ఛాయాగ్రహణం అందించనున్న ఈ చిత్రానికి అంతర్జాతీయ సాంకేతిక నిపుణులు పనిచేయనున్నారు.