'30 రోజుల్లో ప్రేమించటం ఎలా'గో చెప్తున్న ప్రదీప్ మాచిరాజు
on Jan 25, 2020
పాపులర్ యాంకర్ ప్రదీప్ మాచిరాజు '30 రోజుల్లో ప్రేమించటం ఎలా' అనే రొమాంటిక్ కామెడీ మూవీతో హీరోగా వెండితెరపై అడుగుపెడుతున్నాడు. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దగ్గర 'ఆర్య 2', 'నేనొక్కడినే' సినిమాలకు పనిచేసిన మున్నా ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఆయనే ఈ సినిమాకు రచన కూడా చేస్తున్నాడు. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్, మోషన్ పోస్టర్ లను శనివారం రానా దగ్గుబాటి ఆవిష్కరించాడు. పోస్టర్ల కాన్సెప్టు, మ్యూజిక్ తనకు బాగా నచ్చాయని ఆయన చెప్పాడు.
ఫస్ట్ లుక్ పోస్టరులో పల్లెటూరి వేషంలో ఉన్న ప్రదీప్, సినిమాలో తన ప్రేయసిగా నటిస్తోన్న అమృత అయ్యర్ తో పాటు కులాసాగా కనిపిస్తున్నాడు. ఇద్దరి ముఖాల్లోనూ ఉల్లాసం తాండవిస్తోంది. సూర్యోదయం, జలపాతాలు, పక్షులు, చెట్లతో బ్యాగ్రౌండ్ ఒక అందమైన పెయింటింగ్ ను తలపిస్తోంది. టైటిల్ డిజైన్ కూడా ఆసక్తికరంగా ఉంది. బాణం విసురుతున్న మన్మథుడు, గులాబీ, లవ్ లెటర్, తాళం వేసిన హృదయం వంటి వాటితో ఆ టైటిల్ ను రూపకల్పన చేశారు.
ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. త్వరలోనే విడుదల తేదీని చిత్ర బృందం ప్రకటించనున్నది. ఎస్.వి. ప్రొడక్షన్స్ పతాకంపై కన్నడ నిర్మాత ఎస్.వి. బాబు నిర్మిస్తున్న ఈ చిత్రానికి దాశరథి శివేంద్ర సినిమాటోగ్రాఫరుగా పనిచేస్తున్న ఈ మూవీకి పనిచేస్తుండగా, అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందిస్తున్నాడు. పాటలన్నింటినీ చంద్రబోస్ రాశారు. వాటిని సిద్ శ్రీరామ్, రాహుల్ సిప్లిగంజ్, అనురాగ్ కులకర్ణి, ధనంజయ్, సునీత, మోహన భోగరాజు, మధుప్రియ ఆలపించారు.