TOLLYWOOD IN 2024: కేసులే కేసులు.. అరెస్టులే అరెస్టులు!
on Dec 24, 2024
వందేళ్ళ చరిత్రలో ఎన్నడూ లేని పరిస్థితుల్ని తెలుగు చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటోంది. అంతేకాదు, ఏ చిత్ర పరిశ్రమలోనూ సంభవించని ఘటనలు ఇక్కడ చోటు చేసుకోవడం అందర్నీ ఆందోళనకు గురి చేస్తోంది. చిన్న చిన్న స్టార్సే కాదు, పెద్ద స్టార్స్, ఎంతో అనుభవమున్న సినీ ప్రముఖులు సైతం వివాదాల్లో ఇరుక్కోవడం, పోలీసుల చుట్టూ, కోర్టుల చుట్టూ తిరగడం చూస్తుంటే తెలుగు సినీ పరిశ్రమ పెద్ద సంక్షోభంలో ఇరుక్కోబోతోందా అనే సందేహం కలుగుతోంది. 2024 సంవత్సరం ద్వితీయార్థం నుంచి ఇప్పటివరకు ఒకదాని తర్వాత మరొకటి అన్నట్టు సీరియల్‌గా వివాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఒక పక్క తెలుగు సినిమా ఖ్యాతి ప్రపంచం నలుమూలలా విస్తరిస్తుంటే.. ఇక్కడ మాత్రం రకరకాల వివాదాలు, ఎఫైర్స్, దాడులు, స్టార్స్ వల్ల అనుకోని మరణాలు సంభవిస్తున్నాయి. విచిత్రం ఏమిటంటే.. ఒక దశలో తీవ్రస్థాయిలో మీడియాలో చర్చలు జరిగిన వివాదాలు సైతం ఏదైనా కొత్త వివాదం వెలుగులోకి రాగానే పాత దాని గురించి కనీసం ప్రస్తావించడం కూడా మానేస్తున్నారు. దీంతో మీడియాలో ఎప్పటికప్పుడు ఫ్రెష్ న్యూస్‌లు, ఫ్రెష్ కాంట్రవర్సీలు దర్శనమిస్తున్నాయి. అసలు 2024లో ఏయే వివాదాలు తెరపైకి వచ్చాయి. వాటికి ఎలాంటి పరిష్కారాలు లభించాయి అనేది చూద్దాం.
ఈ ఏడాది మొదటి 5 నెలలు టాలీవుడ్‌లో ఎలాంటి వివాదాలు లేకుండా ప్రశాంతంగానే గడిచింది. జూన్‌లో బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో నటి హేమ పాల్గొంది అనే వార్త ఒక్కసారిగా టాలీవుడ్‌లో సంచలనం సృష్టించింది. ఆ కేసు ఎన్నో మలుపు తిరిగింది. కొందర్ని అరెస్ట్ చేశారు. హేమను కూడా అరెస్ట్ చేసి ఆ తర్వాత బెయిల్‌పై విడుదల చేశారు. ఈ వార్త కొన్నాళ్ళు సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇది జరిగిన నెలరోజులకే మరో వార్త వెలుగులోకి వచ్చి టాలీవుడ్‌ని ఎలర్ట్ చేసింది. హీరో రాజ్‌తరుణ్ తనని పెళ్లి చేసుకున్నాడని, ఇప్పుడు తనను వదిలేసి మరో హీరోయిన్‌తో సహజీవనం చేస్తున్నాడని లావణ్య అనే యువతి రాజ్‌తరుణ్‌పై కేసు ఫైల్ చేసింది. ఈ కేసు మీడియాలో ఎంతో ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. మీడియాలో ఎక్కడ చూసినా వీరిద్దరి వార్తలే కనిపించాయి. ఈలోగా కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కేసు వెలుగులోకి రావడంతో రాజ్‌తరుణ్, లావణ్య కేసు మరుగున పడిపోయింది. ఒక్క మీడియా సంస్థ కూడా ఆ వైపు మళ్ళీ వెళ్ళలేదు. జానీ మాస్టర్ తనను కొన్నాళ్ళుగా లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడని, 17 సంవత్సరాల వయసులోనే తనపై అత్యాచారం చేశాడని ఆరోపించింది అతని అసిస్టెంట్ శ్రష్టి వర్మ. దీనిపై స్పందించిన పోలీసులు జానీ మాస్టర్‌ని అదుపులోకి తీసుకొని రిమాండ్‌కి తరలించారు.
ఇదిలా ఉంటే.. ఓ తమిళ చిత్రంలో జానీ మాస్టర్ కంపోజ్ చేసిన పాటకు నేషనల్ అవార్డు వరించింది. అతను అవార్డు అందుకోవడం కోసం తనకు మధ్యంతర బెయిల్ కావాలని అడగడం, కోర్టు మంజూరు చేయడం జరిగింది. అయితే ఫోక్సో చట్టం కింద నమోదైన కేసులో జానీ ముద్దాయిగా ఉండడంతో అతనికి వచ్చిన నేషనల్ అవార్డును తాత్కాలికంగా రద్దు చేసింది కేంద్రప్రభుత్వం. దీంతో మళ్ళీ జానీ మాస్టర్‌ని జైలుకి తరలించారు. అలా 36 రోజుల పాటు జైలులో ఉన్న తర్వాత బెయిల్‌పై విడుదలయ్యారు జానీ మాస్టర్. ఈ గొడవను పక్కన పెడుతూ వెంటనే మరో వివాదం తెరపైకి వచ్చింది. యూట్యూబ్ ఇన్‌ఫ్లుయెన్సర్ హర్షసాయిపై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. బిగ్‌బాస్ ఫేమ్, నటి, నిర్మాత మిత్రశర్మ.. నార్సింగి పోలీస్ స్టేషన్‌లో హర్షసాయిపై ఫిర్యాదు చేసింది. తనపై అత్యాచారం చేశాడని, తనను న్యూడ్‌గా షూట్ చేసి ఆ వీడియాలతో బ్లాక్‌మెయిల్ చేస్తున్నాడని తన ఫిర్యాదులో పేర్కొంది. ఇది కొన్నాళ్ళు మీడియాలో సందడి చేసింది. ఇక ఆ తర్వాత చడీ చప్పుడు లేదు.
ఈ కేసుల పరంపర ఇలా జరుగుతుండగానే అక్కినేని నాగార్జునకు సంబంధించిన ఎన్ కన్వెన్షన్ అక్రమ నిర్మాణమని భావించిన హైడ్రా.. దాన్ని కూల్చివేసింది. ఇది కొన్నిరోజులపాటు మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఇది ముగిసిన కొన్నిరోజులకు తెలంగాణ రాష్ట్ర మంత్రి కొండా సురేఖ.. అక్కినేని నాగార్జున ఫ్యామిలీపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో నాగార్జున ఆమెపై పరువు నష్టం దావా వేశారు. ఈ కేసు చాలా రోజులు మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ కేసుకు సంబంధించిన విచారణ జరుగుతూనే ఉంది.
ఈ వివాదాలన్నీ ఎంత వేగంగా వచ్చాయో అంతే వేగంగా అందరి దృష్టి నుంచి దూరమైపోయాయి. ఏడాది చివరికి వచ్చేసరికి ఆ ఉధృతి బాగా పెరిగిపోయింది. డిసెంబర్ 4న పుష్ప2 ప్రీమియర్ సందర్భంగా హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాట కేసు ఇప్పుడు రాష్ట్రానే కాదు, దేశాన్ని కూడా కుదిపేస్తోంది. ఈ ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందింది. ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడి ఇప్పటికీ చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనకు బాధ్యుడు అల్లు అర్జునేనని రేవతి భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అందులో భాగంగానే అల్లు అర్జున్‌ని పోలీసులు అరెస్ట్ చేయడం, ఎన్నో నాటకీయ పరిణామాల తర్వాత మధ్యంతర బెయిల్‌పై విడుదల కావడం జరిగింది. ఇప్పుడీ కేసు రాజకీయ రంగు పులుముకోవడంతో ఏం జరగబోతోంది అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. రోజుకో కొత్త మలుపుతో మీడియాలో ప్రధానాంశంగా మారిపోయింది. గత 20 రోజులుగా ఏ మాధ్యమంలో చూసినా సంధ్య థియేటర్ ఘటనపైనే చర్చ జరుగుతోంది. ఫైనల్‌గా ఈ కేసు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వర్సెస్ అల్లు అర్జున్‌గా మారిపోయింది.
సంధ్య థియేటర్ కేసు ఓ పక్క జరుగుతుండగానే టాలీవుడ్ సీనియర్ నటుడు మంచు మోహన్‌బాబు కుటుంబ వ్యవహారం రచ్చకెక్కింది. మోహన్‌బాబు కుమారులు విష్ణు, మనోజ్‌ల మధ్య రాజుకున్న వివాదం చిలికి చిలికి గాలివానగా మారింది. ఆరోపణలతోనే సరిపెట్టుకోకుండా ప్రత్యక్ష దాడులకు కూడా పాల్పడడంతో ఈ వివాదం మరింత జఠిలంగా మారింది. ఈ నేపథ్యంలోనే మంచు మోహన్‌బాబు దూకుడుగా వ్యవహరించి ఓ మీడియా రిపోర్టర్‌పై దాడి చేయడంతో క్రిమినల్ కేసుగా మారింది. మోహన్‌బాబును అరెస్ట్ చేయాలనే నినాదాలు వెల్లువెత్తాయి. అయితే మోహన్‌బాబు మాత్రం పోలీసులకు అందుబాటులో లేరు. ఏ క్షణం ఏం జరుగుందోననే ఉత్కంఠ ఈ కేసులో నెలకొంది.
ఇలా ఈ ఏడాది ద్వితీయార్థం నుంచి ప్రారంభమైన పలు రకాల వివాదాలు టాలీవుడ్‌ని కుదిపేస్తున్నాయి. ఇప్పటికే ఇలాంటి కేసులతో టాలీవుడ్ తన ప్రతిష్టను కోల్పోయింది. ముందు ముందు ఇంకెన్ని కేసులు వెలుగులోకి వస్తాయో.. ఇది వచ్చే ఏడాది కూడా కొనసాగుతుందా అనే సందేహం అందరిలోనూ ఉంది. వీటికి ఫుల్‌స్టాప్ ఎక్కడ అనేది ఎవరూ చెప్పలేని పరిస్థితి ఏర్పడింది. అయితే ఇప్పటివరకు వెలుగులోకి వచ్చిన ఏ వివాదానికి పరిష్కారం లభించకపోవడం గమనార్హం.