టాలీవుడ్‌లో పెళ్లికూతుర్లు!
on May 31, 2016
ఈమధ్య మన కథానాయికలకు పెళ్లిపై మనసైంది. ఎప్పుడు పెళ్లి గురించి అడిగినా, బోల్డంత సిగ్గు పడిపోయి - అప్పుడే పెళ్లేంటండీ మీరు మరీనూ అనే కథానాయికలు ఈసారి డైలాగ్ మార్చారు. 'పెళ్లికి రెడీనే.. సరైనోడు దొరికితే చేసేసుకొంటాం' అంటున్నారు. ఇంకొంతమంది `నేను ప్రేమలో ఉన్నా.. అతన్నే పెళ్లి చేసుకొంటా` అని ధైర్యంగానూ చెప్పేస్తున్నారు. ఒకరిద్దరు నేడో రేపో పెళ్లి చేసుకోవడానికి రెడీ కూడా అయిపోయారు. దాంతో టాలీవుడ్‌కి పెళ్లిళ్ల కల వచ్చేసినట్టైంది.
నేను ప్రేమలో ఉన్నా.. ఓ హీరోని పెళ్లి చేసుకోబోతున్నా అంటూ షాకిచ్చింది సమంత. అప్పటి నుంచీ టాలీవుడ్ అంతటా సమంత పెళ్లి కబురే వినిపిస్తోంది. సమంత మనసులో ఉన్నదెవరన్న విషయంపై ఆరాలు సాగుతూనే ఉన్నాయి. ఈ యేడాది చివర్లో సమంత పెళ్లి చేసుకోవడం ఖాయంలా కనిపిస్తోంది. ఈమధ్యే ప్రియమణి కూడా నిశ్చితార్థం చేసుకొంది. మనసిచ్చిపుచ్చుకొన్న ప్రియుడితోనే ఏడడుగులు నడవడానికి సిద్ధమైంది. త్వరలోనే వీరిద్దరి పెళ్లి రిజిస్టర్ ఆఫీసులో జరగడం ఖాయమైపోయింది. ఇప్పుడు ఇలియానా కూడా 'నేను పెళ్లికి రెడీ' అంటోందట. గత కొన్నేళ్లుగా ఇలియానా గురించి ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. అవకాశాలు రావడమే కష్టపోయింది. దాంతో పాటు ఇలియానాకీ సినిమాలపై మక్కువ తీరిపోయినట్టుంది. అందుకే పెళ్లి వైపు చూస్తోంది. ఆండ్రూ అనే ఫోటోగ్రాఫర్ తో ఇలియానా కొంతకాలంగా ప్రేమాయణం సాగిస్తోంది. ఇప్పుడు అతన్నే పెళ్లి కూడా చేసుకొంటుందట.
కాజల్ కూడా పదేళ్ల కెరీర్ పూర్తి చేసుకొంది. జీవితంలో స్థిరపడడానికి ఇదే రైట్ టైమ్ అనుకొంటోంది. చెల్లాయి పెళ్లి కూడా అయిపోయింది. అందుకే కాజల్ పెళ్లి కోసం ఇంట్లో తొందర పెడుతున్నారని టాక్. కాజల్ కూడా `నేనేం పెళ్లికి వ్యతిరేకం కాదు. జీవితంలో స్థిరపడాలని నాకూ ఉంది` అంటోంది. త్రిష కూడా పెళ్లికి తొందరపడుతోంది. ఆమధ్య నిశ్చితార్థం జరిగి, పెళ్లి పీటల వరకూ వెళ్లింది వ్యవహారం. కానీ ఎవరి దిష్టి తగిలిందో ఆ నిశ్చితార్థం క్యాన్సిల్అయ్యింది. ఈసారి మాత్రం పెళ్లి కి ముహూర్తం పెట్టి అందర్నీ ఆశ్చర్యపరచాలనుకొంటున్నట్టు టాక్. అనుష్క ఇంట్లోనూ పెళ్లి గొడవే. ఆమెను పెళ్లి కూతురుగా చూడాలని ఇంట్లోవాళ్లు ముచ్చటపడుతున్నారు. పైగా అనుష్క కెరీర్ ఇప్పుడు చరమాంకంలో ఉంది.ఎంత కాదన్నా మరో యేడాదిలోగా ఆమె పెళ్లి జరగడం ఖాయం అంటున్నారంతా. సో.. టాలీవుడ్‌లో ఇప్పుడు పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. ఎవరెప్పుడు పెళ్లికూతురుగా ముస్తాబై మనముందుకు వస్తారో.. వేచి చూద్దాం.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
