సుప్రీం కోర్టులో కేస్ గెలిచిన కమల్ హాసన్
on Jun 17, 2025

లోకనాయకుడు కమల్ హాసన్(Kamal Haasan),లెజండ్రీ డైరెక్టర్ మణిరత్నం(Mani Rathnam)కాంబోలో తెరకెక్కిన 'థగ్ లైఫ్'(Thug Life)ఈ నెల 5 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. గ్యాంగ్ స్టార్ డ్రామాగా తెరకెక్కిన ఈ పాన్ ఇండియా మూవీలో శింబు, త్రిష, అభిరామి, నాజర్, జోజు జార్జ్, అశోక్ సెల్వన్, ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించారు. గత మే నెల 24 న 'చెన్నై'వేదికగా 'థగ్ లైఫ్' ఆడియో ఫంక్షన్ జరిగింది. కన్నడ సూపర్ స్టార్ 'శివరాజ్ కుమార్' ముఖ్య అతిధిగా హాజరయ్యాడు. ఈ సందర్భంగా శివరాజ్ కుమార్ ని ఉద్దేశించి కమల్ మాట్లాడుతు కన్నడ భాష తమిళ భాష పుట్టిందనే వ్యాఖ్యలు చేసాడు. దీంతో కన్నడ భాషా సంఘాలు 'థగ్ లైఫ్' కన్నడ నాట విడుదల కావాలంటే, కన్నడ ప్రజలకి కమల్ క్షమాపణలు చెప్పాలని, ఒక వేళ రిలీజ్ చేస్తే థియేటర్స్ తగలబెడతామని బెదిరించాయి. కమల్ మాత్రం తన వ్యాఖ్యలపై స్పందిస్తూ ప్రేమ పూర్వకంగానే ఆ విధంగా మాట్లాడానని చెప్పినా కన్నడ సంఘాలు వెనకడుగు వెయ్యలేదు. దీంతో రిలీజ్ విషయంలో కమల్ కర్ణాటక హైకోర్టుకి వెళ్లినా ఫలితం లేకపోయింది.
దీంతో 'థగ్ లైఫ్' చిత్ర బృందం సుప్రీంకోర్టుని ఆశ్రయించింది. రీసెంట్ గా సుప్రీంకోర్ట్(Supreme Court)తన తీర్పుని వెల్లడిస్తు 'థియేటర్ లో పలానా చిత్రం ప్రదర్శించకూడదని బెదిరించే హక్కు కన్నడ సంఘాలకి లేదు. ఏ వ్యక్తి అయినా భావ వ్యక్తికరణ ప్రకటన చేసినప్పుడు, దాన్ని మరో కామెంట్ తో ప్రతిఘటించే శక్తీ ఉంటుంది. కానీ థియేటర్స్ తగలబెడతామనే హక్కు ఎవరకి ఉండదు. కమల్ హాసన్ తో విభేదించే హక్కుని కర్ణాటక ప్రజలు కలిగి ఉన్నారు. అదే సమయంలో ఒక మనిషికి చెందిన ప్రాథమిక హక్కులని కాపాడే హక్కు కూడా ఉంది.సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ ఇచ్చిన తర్వాత ఆ సినిమా విడుదల కావాల్సిందే. సినిమా చూడాలా వద్దా అనేది ప్రజల ఇష్టం. బెదిరింపులతో సినిమా ఆపకూడదు. ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వం తన నిర్ణయం చెప్పాలి. కమల్ హాసన్ క్షమాపణలు చెప్పాలని తీర్పులో వెల్లడించిన హైకోర్ట్ ఆదేశాల్ని కూడా ప్రశిస్తు సుప్రీం కోర్టు తన తీర్పుని వెల్లడి చేసింది.
ఈ నేపథ్యంలో కర్ణాటకలో 'థగ్ లైఫ్' రిలీజ్ అవుతుందేమో చూడాలి. ఇక పాన్ ఇండియా వ్యాప్తంగా 'థగ్ లైఫ్' డివైడ్ టాక్ ని తెచ్చుకుంది.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



