Home

»

Latest News

రాజభవనం VS ప్రేతాత్మలు: తెలుగు ఆడియ‌న్స్‌ని థ్రిల్ చేస్తున్న కొరియ‌న్ సిరీస్‌.!

Jul 23, 2026 2:04PM

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఓటీటీ వేదికలపై కొరియన్ డార్క్ ఫాంటసీ, హారర్ డ్రామాలకు విశేషమైన ఆదరణ లభిస్తోంది. కొరియన్ కథల్లోని సహజత్వం, ఆకట్టుకునే గ్రిప్పింగ్ టేకింగ్ ప్రేక్షకులను ఎంతగానో మంత్రముగ్ధులను చేస్తున్నాయి. ఈ క్రమంలోనే నెట్‌ఫ్లిక్స్ వేదికగా ఈ నెల 17 జులై 2026 నుండి తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతున్న సరికొత్త కొరియన్ డార్క్ ఫాంటసీ వెబ్ సిరీస్ 'ది ఈస్ట్ ప్యాలెస్' (The East Palace). నామ్ జూ హ్యూక్ (Nam Joo-Hyuk) ప్రధాన పాత్రలో నటిస్తూ, చోయ్ జంగ్-క్యూ దర్శకత్వంలో రూపొందిన ఈ 8 ఎపిసోడ్ల థ్రిల్లింగ్ సిరీస్‌కి ప్రముఖ క్రిటిక్స్ 5కి 3.0 రేటింగ్ ఇచ్చారు. రాజభవనం, వారసత్వ పోరాటాలు, క్షుద్ర శక్తులు మరియు దెయ్యాల కలబోతగా వచ్చిన ఈ సిరీస్ ప్రేక్షకులను ఎలా అలరించిందో చూద్దాం.

ఈ కథ అంతా ఒక అందమైన ప్రాచీన రాజభవనం మరియు దాన్ని పరిపాలించే ప్రిన్స్ 'క్రౌన్' చుట్టూ తిరుగుతుంది. ఈ రాజభవనంలో గతంలో పాలించిన రాజుకు నలుగురు వారసులు ఉండగా, వారు ఒకరి తర్వాత ఒకరు అనుమానాస్పదంగా మరణిస్తారు. ఆ విషాదకర సంఘటనలు జరిగి సరిగ్గా 30 ఏళ్ల తర్వాత, ఇప్పుడు మళ్లీ అదే దారుణమైన మరణాల పరంపర పునరావృతమవుతుంది. రాజా క్రౌన్ ముగ్గురు కుమారులు దారుణంగా చనిపోగా, నాలుగో కుమారుడు అంటే ప్రస్తుత యువరాజు తీవ్ర అనారోగ్యంతో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుంటాడు. ప్యాలెస్‌లోని కోనేటి దెయ్యం లేదా పిశాచిగా మారిన ఒక రాజనర్తకి ఆత్మ ఈ వరుస మరణాలకు కారణమని అందరూ నమ్ముతుంటారు.

చిన్నతనం నుంచే అతీంద్రియ శక్తులు కలిగిన 'గు-చోన్' (నామ్ జూ హ్యూక్) అనే సాధారణ యువకుడికి దుష్టశక్తులను, ప్రేతాత్మలను ఎదుర్కొనే ప్రత్యేక సామర్థ్యం ఉంటుంది. తన నాలుగో కుమారుడి ప్రాణాలను కాపాడుకోవడానికి రాజు క్రౌన్ గు-చోన్‌ను రహస్యంగా పిలిపిస్తాడు. కోనేటి దెయ్యాన్ని అంతం చేసి యువరాజును బతికించగలిగితే కోరిన బహుమానం ఇస్తానని చెబుతాడు. అయితే అసలు విషయాన్ని రహస్యంగా ఉంచి, గు-చోన్‌ను ఒక 'వాస్తు నిపుణుడు'గా ప్యాలెస్‌లోకి పంపిస్తారు. అదే సమయంలో ప్యాలెస్‌కి దూరంగా పెరిగిన రాజు కూతురు యువరాణి (రో యున్-సో)ని పిలిపించి, గు-చోన్‌కు సహాయం చేస్తున్నట్లుగా నటిస్తూ అతని కదలికలను నిఘా వేయమని ఆదేశిస్తాడు.

ప్యాలెస్‌లో అడుగుపెట్టిన గు-చోన్, యువరాణి ఇద్దరూ కలిసి ప్యాలెస్‌లోని ప్రతి మూలను పరిశీలించడం ప్రారంభిస్తారు. పరిశోధనలో భాగంగా రాజభవనంలోని ఒక రహస్య కోనేరు, ఉప్పుగని ప్రాంతంలో దుష్ట ప్రేతాత్మల సంచారం ఎక్కువగా ఉన్నట్లు వారు గమనిస్తారు. అలాగే మంత్రించిన కుండల వెనుక ఏదో పెద్ద మర్మం దాగి ఉందని గు-చోన్ గ్రహిస్తాడు. యువరాజు ప్రాణాలు తీసేందుకు ప్రయత్నిస్తున్న ఆ పిశాచి మూలాలను వెతికేందుకు గు-చోన్ ప్రయత్నిస్తుంటే, అసలు రాజభవనంలో తన తల్లిని హత్య చేసిన అసలు నేరస్థుడెవరో తెలుసుకోవడానికి యువరాణి తనదైన శైలిలో అన్వేషణ సాగిస్తుంది.

ఈ భయంకరమైన రాజభవనంలోని రహస్యాలను తెలుసుకోవడానికి ప్రయత్నించిన వారు ఎవరూ ప్రాణాలతో బయటపడరనే భయంకరమైన ప్రచారం రాజ్యంలో బలంగా ప్రచారంలో ఉంటుంది. దాంతో తాను వచ్చిన పనిని వీలైనంత త్వరగా పూర్తి చేసి ప్రాణాలతో బయటపడాలని గు-చోన్ భావిస్తాడు. కానీ తన తల్లి హత్య వెనుక ఉన్న నిజాలు తేలేవరకు ప్యాలెస్ వదలనని యువరాణి పట్టుబడుతుంది. వీరిద్దరి శోధనకు రాజమాత (జంగ్ యంగ్-నామ్) నిరంతరం అడ్డంకులు సృష్టిస్తూ ఉంటుంది. ఈ క్రమంలో పిశాచిగా మారిన రాజనర్తకి ఎవరు, ఆ ప్యాలెస్ తూర్పు భాగంలో దాగి ఉన్న అసలు రహస్యమేమిటి అనే అంశాలు కథను ఊహించని మలుపులు తిప్పుతాయి.

సాధారణంగా రాజులు, రాజభవనాల నేపథ్యం అంటే అధికారం కోసం వారసత్వ పోరాటాలు, క్షుద్ర పూజలు సహజమే. కానీ ఈ సిరీస్‌లో జానపద కథకు హారర్ మరియు ఫాంటసీ అంశాలను జోడించి నెక్స్ట్ లెవెల్‌లో రూపొందించారు. నైట్ ఎఫెక్ట్స్, భారీ విజువల్స్, అద్భుతమైన సెట్స్ సిరీస్‌కి ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ముఖ్యంగా కథలోని 4వ ఎపిసోడ్ నాటికి అసలు కథ ముగిసిపోయిందేమో అనిపించినప్పటికీ, అక్కడి నుంచే కథ మరొక అనూహ్యమైన ట్విస్ట్ తీసుకుని ప్రేక్షకులను సీటు అంచున కూర్చోబెడుతుంది. ప్రేతాత్మలతో జరిగే యుద్ధ సన్నివేశాలు, చోయ్ జంగ్-క్యూ దర్శకత్వ ప్రతిభ, జంగ్ సే-రిన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈ 8 ఎపిసోడ్ల సిరీస్‌ను తప్పక చూడాల్సిన డార్క్ ఫాంటసీగా తీర్చిదిద్దాయి.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com