20 ఏళ్ళ తర్వాత సైలెంట్‌గా సీక్వెల్.. మరో భారతీయుడు2 కాబోతోందా?
on Jan 2, 2025
దక్షిణాదిలో రూపొందిన ప్రేమకథా చిత్రాల్లో ‘7జి.బృందావన కాలని’ చిత్రానికి ఓ ప్రత్యేక స్థానాన్ని ఇచ్చారు ప్రేక్షకులు. రొటీన్ ప్రేమకథల్లా కాకుండా ప్రేమలోని అనుభూతిని, విరహంలో వుండే విభిన్న భావాలను తెరపై ఆవిష్కరించి తెలుగు ప్రేక్షకుల మనసుల్ని దోచుకుందీ సినిమా. సెల్వరాఘవన్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి నిర్మించారు. ఈ సినిమా రిలీజ్ అయి ఇప్పటికి 20 సంవత్సరాలవుతోంది. ఇప్పుడున్న మాధ్యమాలు అప్పట్లో అందుబాటులో లేవు. దాంతో ఆ సినిమా ప్రదర్శింపబడుతున్న థియేటర్లన్నీ ఎప్పుడూ ప్రేమికులతో నిండి ఉండేవి. ఆ తర్వాత టీవీలో కూడా బృందావన కాలని సినిమాకి విపరీతమైన ఆదరణ లభించింది. మంచి ప్రేమకథా చిత్రాలకు ట్రెండ్‌తో పనిలేదు. మనసుకు హత్తుకునే ప్రేమథను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తే తప్పకుండా ఘనవిజయాన్ని చేకూరుస్తారు. అదే ఉద్దేశంతో 7జి బృందావన కాలని చిత్రానికి సీక్వెల్‌ను రూపొందిస్తున్నారు. ఈ విషయాన్ని చాలా కాలం క్రితమే ప్రకటించారు. సైలెంట్‌గా షూటింగ్ కూడా పూర్తి చేస్తున్నారు.
ఇప్పటివరకు 7జి బృందావన కాలని2కి సంబంధించి ఎలాంటి అప్‌డేట్ ఇవ్వలేదు మేకర్స్. ఈ సినిమాలో నటీనటులు ఎవరు అనేది ఇంతవరకు రివీల్ చెయ్యలేదు. ఫస్ట్ పార్ట్‌లో జంటగా నటించిన రవికృష్ణ, సోనియా అగర్వాల్ ఇద్దరిలోనూ లుక్ పరంగా ఎన్నో ఛేంజెస్ వచ్చాయి. సెకండ్ పార్ట్‌లో కూడా వాళ్ళే నటించే అవకాశం లేదని అర్థమవుతోంది. అందువల్లే కొత్త హీరో, కొత్త హీరోయిన్‌తో చేస్తున్నారని తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ సినిమా అప్‌డేట్‌ను అందించారు దర్శకులు సెల్వరాఘవన్. షూటింగ్ చివరి దశలో ఉందంటూ సినిమాకి సంబంధించిన ఒక పోస్టర్‌ను విడుదల చేశారు. ఇద్దరు ప్రేమికులు నడుచుకుంటూ వెళ్ళే డార్క్ షేడ్ వున్న ఫోటోతో ఫస్ట్‌లుక్‌ను రిలీజ్ చేశారు. అయితే ఈ సినిమా కోసం యూత్ ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్న విషయం తెలిసిందే.
ఇదిలా ఉంటే.. ఈ సీక్వెల్‌పై రకరకాల కామెంట్స్ వస్తున్నాయి సోషల్ మీడియాలో. దాదాపు 28 సంవత్సరాల క్రితం కమల్‌హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు ఎంతటి సంచలన విజయం సాధించిందో అందరికీ తెలుసు. ఆ చిత్రానికి సీక్వెల్‌గా భారతీయుడు 2 చిత్రాన్ని నిర్మించారు. గత ఏడాది విడుదలైన ఈ చిత్రం ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఇప్పుడు నిర్మాణంలో ఉన్న 7జి బందావన్ కాలని 2 చిత్రానికి కూడా అదే ఫలితంగా లభిస్తుందా అనే చర్చ కూడా నడుస్తోంది. సినిమా రిలీజ్ అయిన 5 సంవత్సరాల లోపు సీక్వెల్ ప్లాన్ చేస్తే సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. మరి బృందావన కాలని సీక్వెల్‌కి ప్రేక్షకుల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది అనేది తెలియాలంటే సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే.