ట్రోల్స్ తట్టుకోలేక సూసైడ్.. అనుపమ ఎమోషనల్, చిన్మయి ఫైర్!
on Nov 27, 2023
సోషల్ మీడియాలో ట్రోల్స్ రోజురోజుకి దారుణంగా పెరిగిపోతున్నాయి. ట్రోల్స్ కి ఒక హద్దు అంటూ లేకుండా పోతుంది. అసలు ట్రోల్స్ అనేవి ఆ ట్రోల్ చేయబడిన వ్యక్తి చూసినా నవ్వుకునేంత ఆరోగ్యకరంగా ఉండాలి. కానీ కొందరు వ్యక్తిగతంగా మితిమీరిన ట్రోల్స్ చేస్తున్నారు. వీటి కారణంగా ఎందరో బాధపడుతున్నారు. సున్నిత మనస్కులైతే ఆత్మహత్య కూడా చేసుకుంటున్నారు. తాజాగా అలాంటి ఘటనే చోటుచేసుకుంది.
మధ్యప్రదేశ్ కి చెందిన 16 ఏళ్ళ బాలుడు ప్రాన్షు మేకప్ ఆర్టిస్ట్ గా రాణిస్తున్నాడు. అలాగే అతనికి సోషల్ మీడియాలో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. అయితే రీల్స్ లో అతని లుక్, బాడీ ల్యాంగ్వేజ్ చూసి తేడాగా ఉన్నావంటూ కొందరు విపరీతంగా ట్రోల్ చేశారు. ఆ ట్రోల్స్ రోజురోజుకి పెరిగిపోతుండటంతో తట్టుకోలేక ఆ బాలుడు ఆత్మహత్య చేసుకొని మరణించాడు.
ప్రాన్షు మరణం గురించి అతని తల్లి మాట్లాడిన మాటలు కంటతడి పెట్టిస్తున్నాయి. "2019లో నాకు విడాకులయ్యాయి. ఆ తరువాత నా కొడుకుతో కలిసి ఒంటరిగానే జీవిస్తున్నాను. గత ఏడాదే నా కొడుకు నాకు కొత్తగా పరిచయమయ్యాడు. అమ్మాయిలు, అబ్బాయిలు ఇద్దరికీ అట్రాక్ట్ అవుతున్నానమ్మా అని చెప్పాడు. అయినా నేను వాడిని వారించలేదు. అలాగే మేకప్ చేయడం కూడా వద్దని ఆపలేదు. నా కొడుకు సొంతంగా మేకప్ వేయడాన్ని నేర్చుకున్నాడు. తన కోరిక మేరకు మేకప్ ఆర్టిస్ట్ అయ్యేందుకు చాలానే కష్టపడేవాడు. ఇప్పుడు నా కొడుకుని పోగొట్టుకోవడం బాధగా ఉంది. నేను తల్లిదండ్రులందరికీ ఒకమాట చెప్పాలి అనుకుంటున్నాను. పిల్లలు ఏం కావాలనుకుంటే అది కానివ్వండి, ఏం చేయాలనుకుంటే అది చేయనివ్వండి, ఎలా ఉన్నా అంగీకరించండి" అని ప్రాన్షు తల్లి ఎమోషనల్ నోట్ రాసుకొచ్చింది.
ప్రాన్షు మరణంపై హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్, సింగర్ చిన్మయి స్పందించారు. ప్రాన్షు తల్లి ఎమోషనల్ నోట్ ని షేర్ చేసిన అనుపమ గుండె బరువెక్కిందని తెలిపింది. ఈ ఘటనపై ఆవేదన వ్యక్తం చేసిన చిన్మయి.. ఒక బాలుడి మరణానికి కారణమయ్యారంటూ ట్రోలర్స్ పై మండిపడింది. ఇలాంటి ఘటనలు చూసైనా అలాంటి ట్రోలర్స్ తీరులో మార్పు వస్తుందేమో చూడాలి.
Also Read