మిథాలీ క్యారెక్టర్‌తో తాప్సీ శభాష్ అనిపిస్తుందా?
on Jul 14, 2020
హైదరాబాద్‌కు చెందిన ఇండియన్ విమెన్స్ క్రికెట్ మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ బయోపిక్‌గా 'శభాష్ మిథు' అనే సినిమా రూపొందనున్నది. మిథాలీ క్యారెక్టర్‌ను పోషించేందుకు తాప్సీ పన్ను సిద్ధమవుతోంది. ఆమె ప్రిపరేషన్స్‌ను లాక్డౌన్ అడ్డుకున్నప్పటికీ 'శభాష్ మిథు' ప్రి-ప్రొడక్షన్ వర్క్ మాత్రం జరుగుతోంది. ఇంటర్నేషనల్ ట్రావెల్ ఆంక్షల ఎత్తివేతకు ఎదురుచూస్తున్న నిర్మాతలు.. లండన్‌లో సుదీర్ఘ షెడ్యూల్‌కు ప్లాన్ చేస్తున్నారు. ఈ విషయం గురించి ప్రొడక్షన్ కంపెనీ వయాకామ్ 18 స్టూడియోస్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ అజిత్ అంధారే మాట్లాడుతూ యూకేలో షూటింగ్ చేయడానికి గల అవకాశాలను పరిశీలిస్తున్నామనీ, అందరి డేట్లు లభిస్తే అక్కడకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నామనీ తెలిపాడు. ఇప్పటి పరిస్థితుల్లో లొకేషన్లను అన్వేషించడం ఛాలెంజ్ లాంటిదనీ, షూటింగ్‌కు అనువైన ప్రదేశాల కోసం పిక్చర్లపై ఆధారపడాల్సిందేననీ ఆయన చెప్పాడు.
ఇప్పడు లభించిన తీరిక సమయంలో డైరెక్టర్ రాహుల్ ధొలాకియా 'శభాష్ మిథు' స్క్రీన్‌ప్లేకు తుదిమెరుగులు దిద్దుతున్నాడు. మరోవైపు పాటలకు సంబంధించిన మ్యూజిక్ కంపోజిషన్ కొనసాగుతోంది. ఈ సినిమా కంటే ముందే క్రికెట్ బ్యాక్‌డ్రాప్‌గా రూపొందిన రణ్వీర్ సింగ్ సినిమా '83' ఈ ఏడాది క్రిస్మస్కు విడుదల కానున్నది. కపిల్‌దేవ్ సారథ్యంలో ప్రుడెన్షియల్ వరల్డ్ కప్ గెలిచిన క్రికెట్ జట్టు కథతో '83' సినిమా తయారైంది. క్రికెట్‌ను ఓ మతంగా భావించే భారతదేశంలో ఇంతదాకా మహిళా క్రికెట్‌ను చిన్నచూపు చూస్తూ వచ్చామనీ, మిథాలీ రాజ్ లాంటి గొప్ప మహిళా క్రికెటర్ కథను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడాన్ని ఓ గొప్ప అవకాశంగా భావిస్తున్నామనీ అజిత్ అంధారే అంటున్నాడు.
ఒకదాని తర్వాత ఒకటిగా కథకు కీలకమైన పాత్రలు, లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ వస్తోన్న తాప్సీ కెరీర్లో 'శభాష్ మిథు' ఓ కలికితురాయి అయ్యే అవకాశాలున్నాయి.