మెగా అవార్డుల కోసం మెగాస్టార్ మీటింగులు?
on Oct 17, 2019

మెగాస్టార్ చిరంజీవి రెండు రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలిశారు. తొలితరం స్వాతంత్ర్య సమరయోధుడు, రేనాటి సూర్యుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథతో రూపొందించిన చారిత్రక చిత్రం 'సైరా నరసింహారెడ్డి' చూడమని కోరారు. నిన్నటికి నిన్న ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడును కలిశారు. 'సైరా' సినిమా చూపించారు. రాజకీయ ప్రముఖులను మెగాస్టార్ ఎందుకు కలుస్తున్నారు? ఎందుకు 'సైరా' సినిమా చూపిస్తున్నారు? రాజకీయ ప్రముఖులు సినిమా బావుందని మెచ్చుకుంటే థియేటర్లకు కొత్తగా వచ్చే ప్రేక్షకులు ఉండరు. మెగాస్టార్ చిరంజీవిని మించిన బ్రాండ్ సైరాకు అవసరం లేదు. మరెందుకు ఈ మెగా పొలిటికల్ మీటింగులు? అవార్డుల కోసమని ఫిలింనగర్ గుసగుస. రాష్ట్ర, జాతీయ స్థాయిలో అవార్డుల కోసం మెగాస్టార్ ఇప్పటి నుండి జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
కొన్నేళ్ల క్రితం మాస్ కమర్షియల్ అంశాలకు దూరంగా 'రుద్రవీణ' సినిమా చేశారు మెగాస్టార్. మళ్ళీ ఇన్నాళ్లకు తన సహజశైలికి భిన్నంగా 'సైరా నరసింహారెడ్డి' చేశారు. ఇందులో మెగాస్టార్ నుండి ఫ్యాన్స్ ఆశించే మాస్ పాటల్లేవ్. కమర్షియల్ ఫైటుల్లేవ్. కథ ప్రకారం సినిమా చేశారు. అందులోనూ స్వాతంత్య సమర శంఖాన్ని పూరించిన వ్యక్తి కథ. ముందుగా ఈ సినిమాను రాజకీయ ప్రముఖులకు చూపిస్తే సినిమా గొప్పదనం వారికీ తెలుస్తుంది. అవార్డుల సమయంలో సినిమాకు అడ్వాంటేజ్ ఉంటుందని ఇలా చేస్తున్నారని టాక్. వచ్చే ఏడాది అవార్డులు ప్రకటిస్తారు. అప్పుడు ఏం జరుగుతుందో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



