నవీన్ పోలిశెట్టి దర్శకుడితో తాప్సీ చిత్రం?
on Jun 14, 2021

`ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ`.. నవీన్ పోలిశెట్టికి కథానాయకుడిగా మంచి గుర్తింపుని తీసుకువచ్చిన కామెడీ థ్రిల్లర్. ఈ సినిమాతోనే స్వరూప్ ఆర్.ఎస్.జె దర్శకుడిగా పరిచయమయ్యాడు. `ఏజెంట్..` తరువాత `జాతిరత్నాలు`తో నవీన్ సంచలన విజయం సాధిస్తే.. స్వరూప్ మాత్రం కొత్త చిత్రం రూపకల్పనలో తలమునకలై ఉన్నాడు. `మిషన్ ఇంపాజిబుల్` పేరుతో తెరకెక్కనున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ ని మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మిస్తోంది. తిరుపతి నేపథ్యంలో సాగే ఈ సినిమా.. `ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ` తరహాలోనే అనూహ్య మలుపులతో సాగుతుందట. ఇప్పటికే కొంతమేర చిత్రీకరణ జరుపుకున్న ఈ చిత్రం.. కరోనా రెండో దశ విజృంభణ కారణంగా తాత్కాలికంగా ఆగిపోయింది. త్వరలోనే షూటింగ్ పునః ప్రారంభం కానుంది.
ఇదిలా ఉంటే.. ఇటీవల ఈ సినిమాలోని ఓ ప్రధాన పాత్ర కోసం తాప్సీని బౌండెడ్ స్క్రిప్ట్ తో సంప్రదించాడట స్వరూప్. స్క్రిప్ట్, తన క్యారెక్టర్ బాగా నచ్చడంతో తాప్సీ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. హైదరాబాద్ లో జరిగే తదుపరి షెడ్యూల్ లో తాప్సీ చేరనుందని సమాచారం. అంతేకాదు.. హిందీనాట తాప్సీకి ఉన్న ఇమేజ్, క్రేజ్ దృష్ట్యా తెలుగుతో పాటు హిందీలోనూ ఈ థ్రిల్లర్ ని రిలీజ్ చేయాలని స్వరూప్ భావిస్తున్నాడట.
మరి.. `ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ`లాగే `మిషన్ ఇంపాజిబుల్`తోనూ స్వరూప్ మరో మెమరబుల్ హిట్ అందుకుంటాడేమో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



