దెయ్యంగా మారనున్న గజినీ
on Jun 7, 2014
సన్యాసిగా, పోలీసుగా, కురూపిగా, గజినీగా ఆకట్టుకున్న సూర్య మనుషుల అవతారాలు మాని, దెయ్యంగా మారబోతున్నాడు. ఆ వివరాలేంటో చూద్దాం...
తమిళ దర్శకులకీ, నటులకీ ప్రయోగాలంటే ఆసక్తి ఎక్కువని చెప్పాలి. మాస్ ఇమేజ్ తో పాటు, కమర్షియల్ సినిమాల్లో చక్కటి ఎక్స్పరిమెంట్ మూవీలు చేస్తూ జాతీయ స్థాయి గుర్తింపు పొందిన ఈ తరం నటుడు సూర్య. గజినీ, సెవెంత్ సెన్స్, సుందరాంగుడు... ఇలా సూర్యా చేసిన విభిన్న తరహా పాత్రలు తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయమే.
ఇప్పుడూ తాజాగా సూర్య అలాంటి మరో ప్రయోగానికి సిద్ధమవుతున్నారు. వెంకటప్రభు దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి సూర్య ఒప్పుకున్నారనే సంగతి తెలిసిందే. గతంలో సూర్య సన్ ఆఫ్ క్రిష్ణన్, సెవెంత్ సెన్స్, బ్రదర్స్ లాంటి చిత్రాల్లో డబుల్ రోల్లో కనిపించాడు. ఒకే సినిమాలో, రెండు పాత్రల్లో కనిపించినా ఎంతో వేరియేషన్, పర్ఫెక్షన్ చూపించిన సూర్య మళ్లీ డ్యూయల్ రోల్ కనిపిస్తున్నాడంటే అభిమానులకు పండగే.
అయితే ఈ సారి చేస్తున్న డబుల్ రోల్స్ లో ఒకటి యూత్ రోల్ కాగా, మరోక పాత్ర భూతం. గజినీ కోసం - 6 ప్యాక్, గుండు, ట్యాటూస్ తో, సూర్యా సన్ ఆఫ్ కృష్ణ చిత్రంలో తండ్రి-కొడుకుగా, సింగం, యముడు చిత్రాల్లో పోలీసుగా ఇంకా తాను చేసిన ప్రతి చిత్రంలో, తన పాత్రలకు సూర్య ఎంత న్యాయం చేస్తాడో తెలిసిందే. ఇక ఈ దెయ్యం పాత్రలో ఎలా జీవిస్తాడో చూడాల్సిందే. ఈ చిత్రంలో నయనతార, ఆమీ జాక్సన్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు.