వెంకీబాబాయ్తో సురేశ్‌గారి అబ్బాయ్ నటించట్లేదు
on Dec 9, 2019
మూవీ మోఘల్ రామానాయుడిగారికి ఓ కల ఉండేది... అబ్బాయ్ వెంకటేశ్, మనవళ్లు నాగచైతన్య, రానాతో కలిసి ఓ సినిమా నిర్మించాలని! అది కలగానే మిగిలింది. అయితే... తాజాగా మేనల్లుడు నాగచైతన్యతో కలిసి వెంకటేశ్ ‘వెంకీమామ’ చేశారు. పైలోకాల నుండి రామానాయుడుగారు ఈ చిత్రం చూసి తప్పకుండా సంతోషిస్తారని చెప్పవచ్చు. మరి, అన్నయ్య సురేశ్‌బాబు కుమారుడు రానా దగ్గుబాటితో కలిసి వెంకటేశ్ ఎప్పుడు సినిమా చేస్తారనేది క్లారిటీ లేదు. ఈలోపు సురేశ్‌బాబు చిన్న కుమారుడు, రానా తమ్ముడు అభిరామ్‌తో వెంకటేశ్ కలిసి నటిస్తున్నారని ఓ వార్త బయటకొచ్చింది.
తమిళ హిట్ ‘అసురన్’ను తెలుగు వెంకటేశ్ హీరోగా కలైపులి ఎస్. థానుతో కలిసి సురేశ్‌బాబు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించనున్నారు. తమిళంలో ధనుష్ పోషించిన పాత్రను తెలుగులో వెంకటేశ్ పోషిస్తున్నారు. సినిమాలో హీరోకి ఇద్దరు కుమారులు ఉంటారు. ఓ కుమారుడిగా అభిరామ్ నటించనున్నారని వార్తలు వచ్చాయి. అటువంటిదేమీ లేదని సురేశ్‌బాబు తెలిపారు. ‘‘అభిరామ్ నటనలో శిక్షణ తీసుకుంటున్నాడు. అది పూర్తవ్వాలి. రావాలి. ‘అసురన్’లో అభిరామ్ నటించడం లేదు’’ అని ఈ నెల 13న ‘వెంకీమామ’ విడుదల కానున్న సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో సురేశ్‌బాబు తెలిపారు.