తలైవాకి కూడా బంధుప్రీతి తలకెక్కిందా?!
on Sep 19, 2023
సినిమా సూపర్‌హిట్ అయ్యింది, బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది, కలెక్షన్లు కొల్లగొట్టింది, రికార్డులు తిరగరాసింది... ఇలాంటి మాటలు సాధారణంగా వింటూ వుంటాం. ఒక సినిమా సూపర్‌హిట్ అయిందంటే దానికి కృషి చేసింది ఎవరు? అంత పెద్ద విజయం సాధించడానికి కారకులు ఎవరు? అని ప్రశ్నించుకుంటే.. అదంతా టీమ్‌వర్క్. ఏ ఒక్కరి వల్ల సినిమా సూపర్‌హిట్ అవ్వదు అనే మాట వినిపిస్తుంది. ఎవరు ఎన్ని చెప్పినా, సినిమా హిట్ అవ్వడానికి టీమ్ వర్కే కారణం అని చెప్పినా.. ఆ సినిమా డైరెక్టర్‌దే మేజర్ పార్ట్ వుంటుందనేది అందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. చాలా మంది టాప్ హీరోలు ఒక సినిమా హిట్ అయ్యిందంటే ఆ క్రెడిట్ అంతా నిస్సందేహంగా డైరెక్టర్‌కే ఇస్తారు. కానీ, కొంతమంది మాత్రం అది డైరెక్టర్ గొప్పతనం అని ఒప్పుకోలేరు.
ఇప్పుడు అలాంటి స్థితిలోనే సూపర్‌స్టార్ రజనీకాంత్ ఉన్నట్టు తాజా పరిణామాలు తెలియజేస్తున్నాయి. ఇటీవల జరిగిన ‘జైలర్’ ఈవెంట్‌లో రజనీకాంత్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. వాళ్ళు, వీళ్ళు అని కాకుండా ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్నట్టు కనిపిస్తున్నారు. సోషల్ మీడియాలో రజనీ కామెంట్స్‌పై విమర్ళలు చేస్తున్నారు.
అసలేం జరిగింది...?
ఈవెంట్‌లో ‘జైలర్’ సినిమా గురించి రజనీకాంత్ మాట్లాడుతూ ‘రీరికార్డింగ్ పూర్తి కాకముందు నేను, నెల్సన్ స్నేహితుడు, సన్ పిక్చర్స్‌కి సంబంధించిన వ్యక్తి సినిమా చూశాం. నెల్సన్ స్నేహితుడికి సినిమా బాగా నచ్చింది. సూపర్‌హిట్ అవుతుంది అన్నాడు. నువ్వు నెల్సన్ ఫ్రెండ్‌వి కాబట్టి నీకు అలా అనిపిస్తుంది. సినిమా ఎబో ఏవరేజ్ అన్నాను. అయితే అనిరుధ్ చేసిన రీరికార్డింగ్‌తో మొత్తం ఛేంజ్ అయిపోయింది. సినిమా అద్భుతంగా వచ్చింది’ అని చెప్పుకొచ్చారు.
కేవలం రీరికార్డింగ్ వల్లే సినిమా అంత పెద్ద హిట్ అయ్యిందన్న మీనింగ్‌తో రజనీ మాట్లాడడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. రజనీకాంత్ లాంటి హీరో అలా మాట్లాడడం, డైరెక్టర్ నెల్సన్ గురించి ఏమీ చెప్పకపోవడంతో అందరూ షాక్ అయ్యారు. సినిమాలో విషయం లేకపోతే, సినిమా తీసే దర్శకుడిలో హిట్ కొట్టాలన్న కసి లేకపోతే రీరికార్డింగ్ ఏం చేస్తుంది? కేవలం రీరికార్డింగ్ వల్ల సినిమా సూపర్‌హిట్ అవుతుందా? అసలు అలాంటి సినిమాలు ఉన్నాయా? అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. గతంలో కూడా బాషా సినిమా రీరికార్డింగ్ వల్లే హిట్ అయ్యింది అని వ్యాఖ్యానించారు రజనీ. ఇప్పుడు మళ్ళీ అదే కామెంట్ చేయడంతో అందరూ రజనీపై అసహనం వ్యక్తం చేస్తున్నారు.
‘రోబో’ తర్వాత ఆ స్థాయిని మించి హిట్ అయిన సినిమా ‘జైలర్’. అయితే ఈ సినిమా కంటే ముందు ‘పేట’, ‘దర్బార్’ సినిమాలు విజయం సాధించలేకపోయాయి. ఇక్కడ విశేషం ఏమిటంటే ఆ రెండు సినిమాలకు కూడా అనిరుధ్ సంగీత దర్శకుడు. ‘జైలర్’ సూపర్‌హిట్ అవ్వడానికి అనిరుధ్ మ్యూజిక్కే కారణం అయితే, ఆ రెండు సినిమాలు కూడా పెద్ద హిట్ అయిపోవాలి కదా. అవెందుకు బిలో ఏవరేజ్ సినిమాలుగా నిలబడ్డాయి? అనిరుధ్ గురించి రజనీ అలా మాట్లాడం వెనుక ఒక మతలబు ఉందని కొందరు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. అదేమిటంటే.. రజనీకాంత్‌కు అనిరుధ్ బంధువు. ఆ కారణంగానే సినిమా హిట్ అవ్వడానికి కారణమైన నెల్సన్‌ని పట్టించుకోకుండా ఆ క్రెడిట్‌ని అనిరుధ్‌కి ఇస్తున్నారని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. దీన్నిబట్టి చూస్తే రజనీకాంత్ లాంటి సూపర్‌స్టార్ కూడా బంధుప్రీతికి అతీతుడు కాదని అర్థమవుతోందని యాంటీ ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు. సూపర్‌స్టార్ ఫ్యాన్స్ ఆ ట్రోల్స్‌ని తిప్పికొడుతున్నారు.
Also Read