128 మంది సెక్స్ వర్కర్లను కాపాడాడు.. పబ్లిసిటీకి దూరంగా ఉన్నాడు!
on Aug 11, 2020
బాలీవుడ్లో 1990లలో యాక్షన్ హీరోగా అశేష అభిమానులను అలరించాడు సునీల్ శెట్టి. కండలు తిరిగిన దేహంతో, యూనిక్ డైలాగ్ డెలివరీతో తన కాలంలోని హాటెస్ట్ యాక్టర్లలో ఒకడిగా ఆయన పేరు సంపాదించాడు. ఆగస్ట్ 11 సునీల్ శెట్టి బర్త్‌డే. "అన్నా" అని అందరూ ఆప్యాయంగా పిలుచుకొనే ఆయనకు సంబంధించి ఒక అరుదైన, గొప్ప విషయం ఉంది. తెరమీదనే కాదు, తెర బయట కూడా ఆయన డేరింగ్ హీరో అని రుజువు చేసిన ఘటనకు సంబంధించిన విషయం అది. ఆ ఘటన జరిగింది 1996లో అయితే, దాని గురించి ఆయనెప్పుడూ.. ఆఖరికి ఇప్పటికి కూడా పబ్లిసిటీ చేసుకోని, ఇంట్లోవాళ్లకు కూడా చెప్పని సింప్లెస్ట్ మ్యాన్ సునీల్.
1996 ఫిబ్రవరి 5న ముంబై పోలీసులు ముంబైలోని ప్రఖ్యాత కామాఠిపుర రెడ్ లైట్ ఏరియాపై భారీ రైడ్‌ను నిర్వహించారు. 456 మంది సెక్స్ వర్కర్లను ఆ వ్యభిచార కూపం నుంచి విముక్తి కలిగించారు. వాళ్లంతా 14 నుంచి 30 ఏళ్ల మధ్య వయసువాళ్లు. అందరినీ వాళ్ల చిరునామాల ప్రకారం ఇళ్లకు పంపించారు పోలీసులు. అయితే నేపాల్‌కు చెందిన 128 మంది అమ్మాయిల గుర్తింపు ఆధారాలను వ్యభిచార గృహం నిర్వాహకులు ధ్వంసం చేశారు. వాళ్లను నేపాల్‌కు పంపాలంటే అక్కడి ప్రభుత్వానికి గుర్తింపుకు సంబంధించిన ఆధారాలు చూపించాలి. అలాంటి అంతర్జాతీయ అంశాన్ని తన చేతుల్లోకి తీసుకున్నాడు 'అన్న' సునీల్.
తన అత్తగారైన 'సేవ్ ద చిల్డ్రన్' ఎన్జీవో ఫౌండర్ విపులా కద్రి, కొంతమంది ఉన్నతస్థాయి ముంబై పోలీస్ అధికారుల సాయం తీసుకున్న సునీల్.. ఒక బృందాన్ని ఏర్పాటుచేసి మొత్తం 128 మంది అమ్మాయిల నుంచి సమాచారాన్ని సేకరించాడు. వాళ్లంతా నేపాల్‌లోని వివిధ ప్రాంతాలకు చెందినవాళ్లు. ఎక్కువమంది కాఠ్మండు నుంచి వచ్చినవాళ్లు. వాళ్ల ఇంటి వివరాలను సేకరించి, అక్కడకు వెళ్లడానికి అందరికీ టిక్కెట్లు అరేంజ్ చేసి పంపించాడు. ఆ తర్వాత వాళ్లు క్షేమంగా ఇళ్లకు చేరారో లేదో కూడా వాకబు చేశాడు. అందరూ తమ తమ ఇళ్లకు చేరుకున్నారని తెలిసి ఆనందపడ్డాడు.
ఇంత మంచి పని చేసిన ఆయన మీడియాకు ఈ విషయం లీక్ కాకుండా జాగ్రత్తపడ్డాడు. కారణం.. దీన్ని ఆయన పబ్లిసిటీ చేసుకోవాలని కానీ, హెడ్‌లైన్స్‌లో నిలవాలని కానీ అనుకోకపోవడం. పైగా ఆ అమ్మాయిలపై ఎవరి ఫోకస్ పడకూడదని భావించడం. అయితే, ఈ ఏడాది మే 1న పేరుపొందిన డిజిటల్ మీడియా కంపెనీ వైస్ మీడియా 'ద ఫర్గాటెన్ ఒన్స్: హ్యూమన్ ట్రాఫికింగ్ ఇన్ నేపాల్' అనే డాక్యుమెంటరీ ట్రైలర్‌ను రిలీజ్ చేయడంతో ఈ కథ బాలీవుడ్ జనాలకు తెలిసింది. అప్పుడు అందరూ సునీల్ శెట్టిని ప్రశంసలతో ముంచెత్తారు. అన్న అని సునీల్‌ను అందరూ ఎందుకు పిలుస్తారో ఈ ఒక్క ఉదంతం వెల్లడిస్తుంది కదూ!!
Also Read