ENGLISH | TELUGU  

"వినోదం అందించే చేతిని చంప‌డం ఆపండి".. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వంపై సిద్ధార్థ్ ఫైర్‌!

on Dec 3, 2021

 

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం సినిమా ప‌రిశ్ర‌మ‌పై చిన్న‌చూపు చూస్తుండ‌టం, టికెట్ల ధ‌ర‌ల‌ను త‌గ్గించ‌డం, సినిమా హాళ్ల‌లో రోజువారీ షోల‌పై ప‌రిమితి విధించ‌డం లాంటి చ‌ర్య‌ల‌పై యాక్ట‌ర్ సిద్ధార్థ్ వ‌రుస ట్వీట్ల‌తో త‌న ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేశాడు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం, తెలుగు సినిమా ఇండ‌స్ట్రీ వారికి మ‌ధ్య గొడ‌వ‌లు నెల‌కొన్న నేప‌థ్యంలో అత‌ను ఈ విష‌యాల‌పై దృష్టి పెట్టాడు. ప్రాంతాల వారీగా స‌గ‌టు ఇంటి అద్దె, నిత్యావ‌స‌రాల‌పై త‌ల‌స‌రి వినియోగం ఆధారంగా టికెట్ ధ‌ర‌ల‌ను నిర్ణ‌యించాల‌ని కూడా అత‌ను ప్ర‌భుత్వానికి సూచించాడు.

"ఒక ప్లేట్ ఇడ్లీ లేదా కాఫీకి ఎంత వ‌సూలు చేయాలో మీరు ఏసీ రెస్టారెంట్‌కి చెప్ప‌రు. సినిమా ప‌రిశ్ర‌మ‌కు త‌మ పెట్టుబ‌డిని ఎలా రిక‌వ‌రీ చేసుకోవాలో చెప్పాల‌ని త‌హ‌త‌హ‌లాడుతూ ప్ర‌భుత్వం ఎందుకు నిరంత‌రం దాన్ని ఒక స‌మ‌స్య‌గా చూడాల్సి వ‌స్తోంది?  టికెట్ రేట్లు, షోల సంఖ్య‌పై ప‌రిమితులు విధిస్తూ జీవోలు తీసుకురావ‌డం అనేది ఎంఆర్‌టీపీ (Monopolistic and Restrictive Trade Practice) చ‌ట్టాన్ని ఉల్లంఘించ‌డ‌మే. ద‌య‌చేసి సినిమానీ, సినిమా హాళ్ల‌నీ బ‌తికే అవ‌కాశం ఇవ్వండి" అని అత‌ను అర్ధించాడు.

"గౌర‌వ‌నీయ ప్ర‌భుత్వాల‌కు నా సూచ‌న‌.. అన్నింటికీ ఒకే విధంగా కాక‌పోతే.. ఒక ఏరియాలో స‌గ‌టు ఇంటి అద్దె, నిత్యావ‌స‌రాల‌పై త‌ల‌స‌రి వినియోగాన్ని గ‌ణించి, ఆ ఏరియాలోని సినిమా హాళ్ల టికెట్ రేట్ల‌ను నిర్ణ‌యించ‌డానికి ఒక ఫార్ములాను త‌యారుచేయండి." అని అత‌ను సూచించాడు.

#SaveCinema ట్యాగ్‌తో, అతను “నేను మొదటిసారిగా 25 సంవత్సరాల క్రితం ఫారిన్‌లో సినిమా చూశాను. నేను నా స్టూడెంట్ ఐడెంటిటీ కార్డ్‌ని ఉపయోగించి, 8 డాలర్లకు సినిమా చూశాను. దాని విలువ‌ అప్పట్లో రూ. 200. నేడు మన సినిమాలు సాంకేతికత, ప్రతిభ, ఉపాధి అంశాల్లో అన్ని దేశాలతో సరిపోలుతున్నాయి. సినిమా టిక్కెట్లు, పార్కింగ్ స్టాండ్ రేట్లపై ప్రభుత్వాలకు, రాజకీయ నాయకులకు నైతిక హక్కు లేదు. మీరు సినిమా కంటే మద్యానికి, పొగాకుకు ఎక్కువ గౌరవం ఇస్తున్నారు. ఈ దురాచారాన్ని ఆపండి. మా బిజినెస్‌ ద్వారా లక్షలాది మంది ప్రజలు చట్టబద్ధంగా జీవనోపాధి పొందుతున్నారు. మా వ్యాపారం ఎలా చేయాలో మీరు మాకు చెప్పకండి. ఇప్పుడు చేస్తున్న‌ట్లే అశాస్త్రీయంగానైనా సినిమాల‌పై పన్ను విధించండి, సెన్సార్ చేయండి. నిర్మాతల్నీ, వారి ఉద్యోగుల్ని జీవనోపాధి నుండి దూరం చేయ‌కండి. సినిమాలు చూడమని ఎవరూ బలవంతం చేయడం లేదు. ఉచితంగా వినోదం కావాలి అంటూ చాలామంది పైరసీని ప్రోత్సహించారు. సినిమా వీక్షణ‌ను చారిటీలాగా చెయ్యాల‌నుకుంటున్న వారికి.. స‌ర‌స‌మైన ధ‌ర‌లో చూసేందుకు వేచి ఉండండి. ఈ ఇండ‌స్ట్రీ మీకు స‌బ్సిడీ ఇవ్వడానికి క‌ట్టుబ‌డి ఉండ‌దు. ఇది వినోదాన్ని ఇవ్వ‌డానికి క‌ట్టుబ‌డి ఉంటుంది. ప్ర‌తి సినీ కోటీశ్వ‌రుడికి, ల‌క్ష‌లాది మంది దిన‌స‌రి వేత‌న కార్మికులు, పెట్టుబ‌డిదారులు ఉంటారు. మీరు సంప‌న్నుల‌ను ఎంచుకోవాలంటే, ప్ర‌తి ఫీల్డులోనూ వారున్నారు. ఎందుక‌ని మా ఇండ‌స్ట్రీనే వేరుగా చూడాలి?" అని ప్ర‌శ్నించాడు సిద్ధార్థ్‌.

"ఒక సినిమా బ‌డ్జెట్‌, దాని స్థాయిని వినియోగ‌దారుడు డిసైడ్ చేయ‌డు. దాన్ని డిసైడ్ చేసేది క్రియేట‌ర్‌, ఇన్వెస్ట‌ర్‌. సినిమా నుంచి ఎవ‌రైనా ఎంత సంపాదించాలో డిసైడ్ చేసే హ‌క్కు ఏ ఒక్క‌రికీ లేదు. పేద‌రికం నుంచి వ‌చ్చి బిలియ‌నీర్‌గా ఎదిగిన రాజ‌కీయ‌నాయ‌కుల్ని కానీ, వ్యాపార‌వేత్త‌ల్ని కానీ మీరు ప్ర‌శ్నించ‌గ‌ల‌రా?  ఫిల్మ్ ఇండ‌స్ట్రీని వేధించ‌డం ఇక‌నైనా ఆపండి. మాకు తిండి విలువ తెలుసు, మ‌న‌కు రోజువారీ తిండి పెడుతున్న రైతు గొప్ప‌త‌నం తెలుసు. వారి కోసం ఎప్పుడూ మేం ఫైట్ చేస్తాం. మేం రైతు అంత గొప్ప‌వాళ్లం కాక‌పోవ‌చ్చు, కానీ మేం కూడా మ‌నుషుల‌మే, ప‌న్ను చెల్లింపుదారుల‌మే. మేం క‌ష్ట‌ప‌డ‌తాం, వినోదాన్నీ, క‌ళ‌నూ సృష్టించ‌డానికి మా జీవ‌నోపాధిని ప‌ణంగా పెడ‌తాం. వినోదాన్ని అందించేందుకు ప్ర‌య‌త్నించే  చేతిని చంప‌డం ఆపండి." అని అత‌ను రాసుకొచ్చాడు.

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.