రాజమౌళి టాప్ మూవీస్.. మీ ఫేవరెట్ ఏది?
on Oct 9, 2023
దర్శకధీరుడు రాజమౌళి కెరీర్ లో టాప్ సినిమాలు ఏవో చెప్పడం అంత తేలిక కాదు. సినిమా సినిమాకి ఘన విజయాలను అందుకుంటూ.. తన స్థాయిని పెంచుకోవడంతో పాటు తెలుగు సినిమా స్థాయిని పెంచారు రాజమౌళి. సీరియల్ డైరెక్టర్ నుంచి సినిమా డైరెక్టర్ గా మారిన ఆయన.. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన 'స్టూడెంట్ నెం.1'తో టాలీవుడ్ దర్శకుడిగా పరిచయమయ్యారు. ఇప్పటిదాకా 12 సినిమాలు డైరెక్ట్ చేసిన రాజమౌళి, అపజయం అనేది ఎరుగకుండా వరుస విజయాలతో పాన్ వరల్డ్ డైరెక్టర్ గా ఎదిగారు.
సింహాద్రి:
రాజమౌళి డైరెక్షన్ లో వచ్చిన 'స్టూడెంట్ నెం.1' ఘన విజయం సాధించినప్పటికీ, ఆ సినిమాకి రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణ చేయడంతో రాజమౌళికి రావాల్సినంత పేరు రాలేదు. ఆ తర్వాత తన రెండో సినిమా 'సింహాద్రి'ని కూడా ఎన్టీఆర్ తోనే చేసే అవకాశాన్ని దక్కించుకున్న రాజమౌళి.. ఆ సినిమాతో తానేంటో నిరూపించుకున్నారు. ఈ సినిమా అప్పట్లో ఎన్నో సంచలనాలు సృష్టించింది. 50కి పైగా కేంద్రాల్లో 175 రోజులు ఆడి, ఆల్ టైం ఇండస్ట్రీ రికార్డుని క్రియేట్ చేసింది. ఇప్పటికీ ఆ రికార్డు చెక్కు చెదరలేదంటే సింహాద్రి ఏస్థాయి ప్రభంజనాన్ని సృష్టించిందో అర్థం చేసుకోవచ్చు. 20 ఏళ్ళ కుర్రాడి చేత గొడ్డలి పట్టించి రికార్డుల ఊచకోత కోశాడు అంటే అది రాజమౌళి దర్శకత్వ ప్రతిభకు నిదర్శనం.
ఛత్రపతి:
ప్రభాస్ ఇమేజ్ ని అమాంతం పెంచేసిన సినిమా అంటే 'ఛత్రపతి' అని చెప్పొచ్చు. అదిరిపోయే యాక్షన్ సన్నివేశాలు, మదర్ సెంటిమెంట్ తో రూపొందిన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర వసూళ్ళ వర్షం కురిపించింది. సొర చేపతో ప్రభాస్ తలపడే సన్నివేశం గానీ, శివాజీ ఛత్రపతిగా ఎదిగే సన్నివేశాలు గానీ కట్టిపడేశాయి. యాక్షన్, ఎమోషన్, ఎంటర్టైన్మెంట్ సమపాళ్లలో ఉండేలా ఒక పర్ఫెక్ట్ కమర్షియల్ ఫిల్మ్ లా ఛత్రపతిని మలిచారు రాజమౌళి.
విక్రమార్కుడు:
రవితేజలోని ప్రతిభని పూర్తిస్థాయిలో వాడుకున్న సినిమా అంటే 'విక్రమార్కుడు' అని చెప్పొచ్చు. అత్తిలి సత్తిబాబుగా, విక్రమ్ సింగ్ రాథోడ్ గా రవితేజను రాజమౌళి చూపించిన తీరుకి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ చనిపోతే, ఆ స్థానంలోకి అదే పోలికలతో ఉన్న ఒక దొంగ వెళ్తే ఎలా ఉంటుందన్న ఆలోచనతో రూపొందిన ఈ సినిమా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఇందులో కూడా యాక్షన్, ఎమోషన్, ఎంటర్టైన్మెంట్ సమపాళ్లలో ఉంటాయి.
మగధీర:
కేవలం ఒక్క సినిమా మాత్రమే చేసిన హీరోతో ఇండస్ట్రీ హిట్ కొట్టడం రాజమౌళికే సాధ్యమవుతుంది. చిరంజీవి వారసుడిగా పరిచయమైన రామ్ చరణ్ అప్పటికి 'చిరుత' సినిమా మాత్రమే చేసి ఉన్నాడు. అలాంటిది రామ్ చరణ్ తో పునర్జన్మల నేపథ్యంలో 'మగధీర' వంటి భారీ సినిమాని తీసి ఇండస్ట్రీ హిట్ కొట్టారు రాజమౌళి. తెలుగులో రూ.50 కోట్లు, రూ.60 కోట్లు, రూ.70 కోట్ల షేర్ మార్క్ లను అందుకున్న మొదటి సినిమా 'మగధీర'నే కావడం విశేషం. ఇందులో కాలభైరవ వంద మందితో తలపడే ఒక్క సన్నివేశం చాలు రాజమౌళి దర్శకత్వ ప్రతిభ ఏంటో చెప్పడానికి. ఈ సినిమా నుంచే తెలుగు దర్శక నిర్మాతలు భారీ సినిమాల గురించి ఆలోచించడం మొదలుపెట్టారు.
ఈగ:
హీరోలు, స్టార్ హీరోలతో మాత్రమే కాదు.. చిన్న 'ఈగ'తో కూడా సినిమా తీసి హిట్ కొట్టగలనని రాజమౌళి నిరూపించారు. ఆయన ధైర్యానికి, ప్రతిభకి నిదర్శనం ఈ సినిమా. ఈగను హీరోగా చూపించి, బలమైన విలన్ తో తలపడే సన్నివేశాలతో.. ఎమోషన్, ఎంటర్టైన్మెంట్ తో సినిమాని ఆసక్తికరంగా నడిపించిన తీరుకి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఘన విజయం సాధించడమే కాకుండా.. తెలుగు విభాగంలో ఉత్తమ చిత్రంగా జాతీయ అవార్డుని కూడా అందుకుంది.
బాహుబలి 1 & 2:
బాహుబలితో తెలుగు సినిమా స్థాయిని పెంచడమే కాకుండా, తెలుగు సినిమాని ప్రపంచానికి పరిచయం చేశారు రాజమౌళి. ప్రభాస్ తో వంద కోట్లకు పైగా బడ్జెట్ తో రాజమౌళి 'బాహుబలి' సినిమాని ప్రకటించినప్పుడు ఎందరో పెదవి విరిచారు. తెలుగు సినిమా మార్కెట్టే వంద కోట్లు లేదు.. అలాంటిది వంద కోట్లకు పైగా బడ్జెట్ తో సినిమా ఏంటని వెటకారం చేసినవాళ్లు కూడా ఉన్నారు. అలాంటి వారందరికీ తన సినిమా రిజల్ట్ తోనే సమాధానం చెప్పారు రాజమౌళి. 2015 జూలై 10న విడుదలైన బాహుబలి-1 వరల్డ్ వైడ్ గా రూ.600 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టి సంచలనం సృష్టించింది. ఇక 2017 ఏప్రిల్ 28న విడుదలైన బాహుబలి-2 అయితే కలలో కూడా ఊహించని విధంగా రూ.1800 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టి సరికొత్త చరిత్ర సృష్టించింది. ఇలా బాహుబలితో తెలుగు సినిమా గురించి ప్రపంచ సినీ ప్రేక్షకులు మాట్లాడుకునేలా చేశారు రాజమౌళి.
ఆర్ఆర్ఆర్:
'ఆర్ఆర్ఆర్'తో హాలీవుడ్ ప్రముఖులు సైతం తెలుగు సినిమా గురించి మాట్లాడుకునేలా చేశారు రాజమౌళి. ఇందులో ఎన్టీఆర్ పోషించిన భీమ్, రామ్ చరణ్ పోషించిన రామ్ పాత్రలను రాజమౌళి మలిచిన తీరుకి ప్రపంచవ్యాప్తంగా ఉన్నంగా సినీ ప్రియులు ఫిదా అయ్యారు. ఇందులో ప్రతి సన్నివేశం హాలీవుడ్ ప్రేక్షకుల్ని కట్టి పడేసింది. ముఖ్యంగా ఇంటర్వెల్ కి ముందు యానిమల్స్ తో భీమ్ బ్రిటీష్ కోటలోకి ప్రవేశించే సన్నివేశం అందరికీ గూస్ బంప్స్ తెప్పించింది. బాహుబలితో తెలుగు సినిమాని ప్రపంచానికి పరిచయం చేసిన రాజమౌళి, ఆర్ఆర్ఆర్ తో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులకు తెలుగు సినిమాని మరింత చేరువ చేశారు. అంతేకాదు తెలుగు సినిమాకి, ఆ మాటకొస్తే ఇండియన్ సినిమాకే అందని ద్రాక్ష లాంటి ఆస్కార్ ని ఈ సినిమాలోని నాటు నాటు పాటకి తెచ్చి పెట్టారు రాజమౌళి.
తన డైరెక్షన్ లో వచ్చిన మొదటి సినిమా 'స్టూడెంట్ నెం.1', తెలుగు ప్రేక్షకులకు అంతగా పరిచయం లేని రగ్బీ ఆట నేపథ్యంలో తీసిన 'సై', ఎన్టీఆర్ ను సరికొత్తగా చూపించిన 'యమదొంగ', కమెడియన్ సునీల్ ని హీరోగా పెట్టి తీసిన 'మర్యాద రామన్న'.. ఇలా రాజమౌళి దర్శకత్వం వహించిన ప్రతి సినిమా బాక్సాఫీస్ దగ్గర ఘన విజయం సాధించాయి.
(అక్టోబరు 10న రాజమౌళి పుట్టినరోజు సందర్భంగా)