'ఆర్ఆర్ఆర్' పని మీద ముంబై వెళ్తే.. 'పుష్ప' కోసం ఎదురుచూస్తున్నాం అంటున్నారు!
on Dec 12, 2021

టాలీవుడ్ నుంచి వరుస పాన్ ఇండియా మూవీలు వస్తున్నాయి. డిసెంబర్ 17 న 'పుష్ప', జనవరి 7 న 'ఆర్ఆర్ఆర్', జనవరి 14 న 'రాధేశ్యామ్' విడుదల కానున్నాయి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న పుష్ప ప్రీరిలీజ్ ఈవెంట్ నేడు(డిసెంబర్ 12 న) ఘనంగా జరిగింది. ఈ వేడుకకు గెస్ట్ గా హాజరైన దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి.. పుష్ప కోసం హిందీ వాళ్ళు ఎదురు చూస్తున్నారంటూ పుష్ప టీమ్ లో మరింత జోష్ పెంచారు.
"ఈరోజు నాకు ఒకరకంగా కొంచెం బాధగా ఉంది.. చాలా ఆనందంగా ఉంది. బాధ ఎందుకంటే నా బెస్ట్ ఫ్రెండ్, నా ఫేవరెట్ డైరెక్టర్ సుక్కు(సుకుమార్) ఇక్కడ లేడు. పుష్ప బెస్ట్ ఔట్ ఇవ్వడానికి బాంబేలో ఫుల్ బిజీగా ఉన్నాడు. మేం తరుచుగా మెసేజ్ లు పెట్టుకుంటూ ఉంటాం. మా సినిమాలకు సంబంధించి ఏదైనా రిలీజ్ అయితే ఒకరిని ఒకరం మెచ్చుకుంటూ ఉంటాం. అయితే ఈ మధ్య మాత్రం సుక్కు టైం సరిపోవట్లేదు సార్ అని మెసేజ్ లు పెడుతున్నాడు. అప్పుడు నేను.. సుక్కు నువ్వు ఈ సినిమాని నమ్మి ఎంత చేయగలుగుతావో అంత చేయమని చెప్పాను. దానికి తగ్గట్లుగానే పగలు రాత్రి తేడా లేకుండా, ఒక్క సెకన్ కూడా గ్యాప్ లేకుండా పని చేస్తున్నాడు. సినిమా అద్భుతంగా వస్తుందని చాలా నమ్మకంగా ఉన్నాను" అని రాజమౌళి చెప్పారు.
"నేను ఆర్ఆర్ఆర్ పని మీద పదేపదే ముంబై వెళ్ళినప్పుడు.. ఏ సినిమా కోసం ఎదురుచూస్తున్నారని ఎవరిని అడిగినా పుష్ప కోసం ఎదురుచూస్తున్నామని చెప్తున్నారు. బన్నీ, ఇంత మంచి ప్రొడక్ట్ మీ చేతిలో ఉంది. ఈ సినిమాని మ్యాగ్జిమం ప్రమోట్ చేయండి. దీని వెనుక నాతో పాటు, ఇండస్ట్రీలోని అందరి స్వార్థం ఉంది. ఇది మన తెలుగు సినిమా. ఎంతదూరం వెళ్లాలో, ఎంత పెద్దగా వెళ్లాలో అంత పెద్దగా వెళ్ళాలి. బన్నీ నీ డెడికేషన్ కి హ్యాట్సాఫ్. నువ్వు ఇండస్ట్రీకి బహుమతి లాంటోడివి. కష్టపడితే ఈ స్థాయికి ఎదుగుతామని నిరూపించిన బన్నీ ఎందరికో ఇన్స్పిరేషన్." అని రాజమౌళి అన్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



