వామ్మో.. శ్రీనువైట్ల.. ఫ్రీగా చేసేశాడా?
on Jan 4, 2017
ఒకప్పుడు పక్కా కమర్షియల్ డైరెక్టర్ అనే పేరు తెచ్చుకొన్నాడు శ్రీనువైట్ల. ఆయన సినిమాకెళ్తే వినోదానికి వినోదం,యాక్షన్‌కి యాక్షన్.. దొరికేసేవి. రాను రాను ఆ మార్క్, మార్కెట్ పడిపోయాయి. వరుస వైఫల్యాలతో... దర్శకుల జాబితాలో అట్టడుగుకి వెళ్లిపోయాడు. ఆగడు, బ్రూస్లీ ఫ్లాపులతో శ్రీను కెరీర్ అగమ్యగోచరంగా తయారైంది. శ్రీనుతో సినిమాలు చేయడానికి పెద్ద హీరోలంతా వెనుకడుగు వేశారు. నిర్మాతలే కరువయ్యారు. ఈ దశలో మిస్టర్ సినిమాకి డైరెక్టర్‌గా అవకాశం వచ్చింది. వరుణ్ తేజ్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్ దశలో ఉంది.
ఇటీవలే టీజర్ కూడా వచ్చింది. అది ఓకే అనిపించేలా ఉంది. ఈ సినిమాకి సంబంధించి ఓ ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. అదేంటంటే.. శ్రీనువైట్ల రూపాయి కూడా పారితోషికం తీసుకోకుండా ఈ సినిమా ఫ్రీగా చేసేశాడట. కేవలం నెలసరి వేతనం అందుకొన్నాడంతే. సినిమా హిట్టయితే అప్పుడు ఇవ్వండి, లేదంటే లేదు.. అని ముందే క్లియర్ గా చెప్పేశాడట. దాంతో నిర్మాతలు కూడా సరే అన్నారని, అందుకే ఈ సినిమా పట్టాలెక్కిందని తెలుస్తోంది.
శ్రీనువైట్ల పారితోషికం ఎంత కాదన్నా రూ.5 కోట్లు ఉంటుంది. కేవలం తనని తాను నిరూపించుకోవడానికి రూ.5 కోట్లు త్యాగం చేశాడన్నమాట. ఏం ఫర్వాలేదు... సినిమా హిట్టయి భారీగా లాభాలొస్తే అంతకు అంత ముక్కు పిండి మరీ వసూలు చేసేయొచ్చు. ఇదేదో లాభసాటి బేరంలానే ఉంది. మిగిలిన ఫ్లాప్ డైరెక్టర్లూ ఓసారి ఈ పద్ధతిలో సినిమాలు తీస్తే బాగుంటుంది కదూ..!