Home

»

Latest News

టాలీవుడ్‌లో తగ్గిన క్రేజ్.. కోలీవుడ్‌లో పెరిగిన డిమాండ్.. శ్రీలీలకు జాక్‌పాట్!

Nov 22, 2026 5:23PM

టాలీవుడ్‌లో ఒకప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉన్న యంగ్ హీరోయిన్ శ్రీలీలకు ప్రస్తుతం తెలుగులో అవకాశాలు తగ్గిపోయాయి. 'పెళ్లి సందD', 'ధమాకా' సినిమాలతో ఒక్కసారిగా స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన ఈ భామకు ఆ తర్వాత వరుస పరాజయాలు ఎదురయ్యాయి. 'స్కంద', 'ఆదికేశవ', 'ఎక్స్‌ట్రార్డినరీ మ్యాన్', 'గుంటూరు కారం', 'ఉస్తాద్ భగత్ సింగ్' వంటి సినిమాలు ఆశించిన విజయాలను అందుకోలేకపోయాయి. దీంతో టాలీవుడ్‌లో కొత్త సినిమాల విషయంలో శ్రీలీలకు కొంత గ్యాప్ ఏర్పడింది. అయితే తెలుగులో అవకాశాలు తగ్గినా తమిళ చిత్ర పరిశ్రమలో మాత్రం ఆమెకు మంచి అవకాశాలు వస్తున్నాయి.

ఇప్పటికే శివకార్తికేయన్ హీరోగా నటించిన 'పరాశక్తి' సినిమాతో తమిళ ప్రేక్షకులకు పరిచయమైన శ్రీలీల.. ఇప్పుడు అక్కడి అగ్ర హీరోల సినిమాల్లో వరుసగా అవకాశాలు అందుకుంటోంది. ధనుష్, మమ్ముట్టి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న 'ఓం' సినిమాలోనూ ఆమె కీలక పాత్ర పోషిస్తోంది. ఇందులో ధనుష్ భార్యగా, రోజా అనే పాత్రలో కనిపించనుంది. అంతేకాదు.. సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా కమల్ హాసన్ నిర్మిస్తున్న 'ధర్మన్' సినిమాలోనూ శ్రీలీలకు అవకాశం దక్కింది. అశ్వత్ మారిముత్తు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నయనతార, సిమ్రాన్, రాశీ ఖన్నా వంటి నటీనటులు కూడా ఉన్నారు.

ఇక తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ నటిస్తున్న 'డేర్ డెవిల్' సినిమాలోనూ శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని అజిత్ భార్య షాలిని తన సొంత నిర్మాణ సంస్థలో నిర్మిస్తున్నారు. ఈ సినిమా విషయంలో గతంలో శ్రీలీలను తప్పించారంటూ వార్తలు వచ్చినప్పటికీ, తాజాగా సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆమె పాల్గొనడంతో ఆ ప్రచారానికి తెరపడింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కూడా ప్రారంభమైంది. అజిత్ వంటి స్టార్ హీరోతో నటించే అవకాశం రావడంతో శ్రీలీల కెరీర్‌కు ఈ చిత్రం కీలకంగా మారనుంది.

ఒకప్పుడు టాలీవుడ్‌లో వరుస అవకాశాలతో దూసుకెళ్లిన శ్రీలీలకు ఇప్పుడు తెలుగులో కంటే తమిళంలోనే ఎక్కువ ప్రాధాన్యత లభిస్తుండటం ఆసక్తికరంగా మారింది. రజినీకాంత్, ధనుష్, అజిత్ వంటి ముగ్గురు అగ్ర హీరోల సినిమాల్లో అవకాశాలు దక్కించుకోవడం చిన్న విషయం కాదు. అయితే తమిళంలో ఆమెకు లభిస్తున్న ఈ అవకాశాలు ఎలాంటి విజయాలను అందిస్తాయి? అక్కడ స్టార్ హీరోయిన్‌గా నిలదొక్కుకుంటుందా? అనేది చూడాలి.

 

 

[Sreeleela, Rajinikanth, Dharman, Dhanush, O.m Ajith, DareDevil] 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com