'స్కైలాబ్' మూవీ రివ్యూ
on Dec 4, 2021
సినిమా పేరు: స్కైలాబ్
తారాగణం: నిత్యా మీనన్, సత్యదేవ్, రాహుల్ రామకృష్ణ, తనికెళ్ల భరణి, తులసి, విష్ణు, అనూష
స్క్రీన్‌ప్లే-డైలాగ్స్: విశ్వక్ ఖండేరావు
మ్యూజిక్: ప్రశాంత్ ఆర్.విహారి
సినిమాటోగ్రఫీ: ఆదిత్య జవ్వాది
ఎడిటర్: రవితేజ గిరిజాల
ప్రొడక్షన్ డిజైన్: శివం రావ్
సహ నిర్మాత: నిత్యామీనన్
నిర్మాత: పృథ్వీ పిన్నమరాజు
దర్శకత్వం: విశ్వక్ ఖండేరావు
బ్యానర్స్: బ్రైట్ ఫ్యూచర్స్, నిత్యామీనన్ కంపెనీ
విడుదల తేదీ: 4 డిసెంబర్ 2021
అంతరిక్ష పరిశోధనల కోసం అమెరికాకు చెందిన నాసా రూపొందించిన 'స్కైలాబ్' భూమి మీద పడబోతోంది అంటూ వచ్చిన వార్త 1979 సమయంలో కొన్ని కోట్ల మంది గుండెల్లో భయాన్ని కలిగించింది. ముఖ్యంగా ఈ స్కైలాబ్ తెలంగాణలో పడే అవకాశముందంటూ ప్రచారం జరగడంతో అక్కడి ప్రజలంతా ఆందోళనకు గురయ్యారు. కొద్దిరోజుల్లో మనకి ఈ భూమ్మీద నూకల చెల్లిపోతున్నాయి అంటూ చివరి కోరికలు తీర్చుకోవడం మొదలుపెట్టారు. ఓ వైపు ప్రాణభయంతో వణికిపోతూనే, మరోవైపు నచ్చింది తింటూ, నచ్చినట్టు ఉంటూ ఈ కొద్దిరోజులైనా దర్జాగా బతకాలి అనుకుంటూ ఎవరికి తోచింది వాళ్ళు చేశారు. చివరికి 'స్కైలాబ్' సముద్రంలో పడుతుందని తెలుసుకొని ఊపిరి పీల్చుకున్నారు. ఇది మన తల్లిదండ్రుల చిన్న వయస్సులో జరిగిన యదార్థ సంఘటన. ఈ ఘటనని మన పేరెంట్స్ కి గుర్తు చేస్తూ, మనకి తెలియజేస్తూ తీసిన సినిమా 'స్కైలాబ్'.
నిత్యామీనన్, సత్యదేవ్, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో విశ్వక్ ఖండేరావు దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'స్కైలాబ్'. ట్రైలర్ తోనే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి, అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఈ మూవీ ప్రేక్షకుల అంచనాలను అందుకుందో లేదో రివ్యూలో చూద్దాం.
కథ:
తెలంగాణలోని బండలింగంపల్లి గ్రామం. దొర కూతురు అయిన గౌరి(నిత్యామీనన్) తనపై దొరబిడ్డ అనే ముద్ర ఉండకూడనని, గౌరిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకోవాలని తాపత్రయపడుతూ ఉంటుంది. ప్రతిబింబం అనే పత్రికలో చిన్న చిన్న కథలు రాసుకుంటూ తనని తాను గొప్పగా ఊహించుకునే గౌరి.. ఎప్పటికైనా ఒక మంచి కథని పత్రికలో అచ్చు వేయించి, తన పేరు అందరికీ తెలిసేలా చేయాలి అనుకుంటుంది. ఇక అదే ఊరులో ఊరంతా అప్పులు చేసిన సుబేదార్ రామారావు(రాహుల్ రామకృష్ణ) ఉంటాడు. ఆస్తులు తరిగిపోయి, అప్పులు పెరిగిపోయినా.. ఏ పని చేయకుండా తాతలు ముత్తాతల గొప్పతనం గురించి చెప్పుకుంటూ బతికేసే కుటుంబానికి చెందిన రామారావు.. ఏదోకటి చేసి అప్పులు తీర్చి ఊళ్ళో తలెత్తుకొని తిరగాలని ఆశపడుతుంటాడు. సిటీలో డాక్టర్ గా పనిచేసే ఆనంద్(సత్య దేవ్)కి డబ్బంటే పిచ్చి. ఆ పిచ్చే అతని డాక్టర్ లైసెన్స్ రద్దయ్యేలా చేస్తుంది. దీంతో లంచం ఇచ్చి డాక్టర్ లైసెన్స్ తిరిగి తెచ్చుకోవడం కోసం, తాతని ఎలాగైనా కాకా పట్టి డబ్బులు తీసుకెళ్లాలని ఊరికి వస్తాడు. పేరుకోసం గౌరి, పరువు కోసం రామారావు, డబ్బుకోసం ఆనంద్ తపిస్తుంటారు. ఇలా ముగ్గురూ తమ ఆశలు నెరవేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్న సమయంలో ఆకాశంలో నుంచి 'స్కైలాబ్' భూమిపై పడుతుందన్న వార్త ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేస్తుంది. 'స్కైలాబ్' వార్తతో వీళ్ళ ముగ్గురి జీవితాలలో ఎలాంటి మార్పులు వచ్చాయి?.. ఊరిలో చోటుచేసుకున్న పరిణామాలు ఏంటి? అనేది మిగతా కథ.
విశ్లేషణ:
1979 లో జరిగిన యదార్థ ఘటనల ఆధారంగా కథ రాసుకొని 'స్కైలాబ్' అనే సినిమా తీయాలన్న ఆలోచనతోనే దర్శకుడు సగం విజయాన్ని సాధించాడు. 'స్కైలాబ్' టైటిల్, ట్రైలర్ తో ప్రేక్షకులను థియేటర్స్ కి రప్పించడంలో సక్సెస్ అయిన దర్శకుడు.. ప్రేక్షకులను అలరించడంలోను సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు. ఒక మారు మూల గ్రామంలోని అమాయకపు ప్రజల జీవితాన్ని సినిమాలో కళ్ళకు కట్టినట్టు చూపించారు. నేచురల్ కామెడీతో ఫస్ట్ హాఫ్ చాలా హాయిగా నడుస్తుంది. సెకండ్ హాఫ్ లో ఎమోషన్ టచ్ ఇచ్చినా.. పారలెల్ గా కామెడీ కూడా ఉండేలా చూసుకున్నారు. అయితే ఆ ఎమోషన్ సీన్స్ ఇంకాస్త బలంగా ఉంటే బాగుండేది. సీన్స్ ఇంకా బలంగా, స్క్రీన్ ప్లే ఇంకా టైట్ గా ఉంటే.. సినిమా వేరే స్థాయికి వెళ్ళుండేది.
బండలింగంపల్లి గ్రామంలో గౌరి, ఆనంద్, రామారావు పాత్రలకు మాత్రమే కాకుండా మరికొందరికీ కొన్ని ఆశలు ఉంటాయి. గుడిలోకి ప్రవేశం లేని దళితుడు శ్రీరాముడి శిల్పాన్ని చెక్కాలి అనుకోవడం, దొర ఇంట్లో పనిచేసే యువకుడు తన ప్రేయసితో కలిసి థియేటర్ లో సినిమా చూడాలనుకోవడం, ఒక పిల్లోడు గర్భిణీగా ఉన్న తన తల్లిని కష్టపెట్టకుండా పుట్టబోయే చెల్లికోసం డబ్బులు పోగుచేయడం.. ఇలా ఎన్నో పాత్రలకు కొన్ని ఆశలు ఉంటాయి. దర్శకుడి ఆలోచన బాగుంది కానీ, ఆ సన్నివేశాలను ఎమోషనల్ గా ఇంకాస్త బలంగా చూపిస్తే ఇంకా బాగుండేది.
'స్కైలాబ్' మూవీ టెక్నికల్ గా కూడా బాగుంది. ఆర్ట్ డైరెక్టర్, సినిమాటోగ్రాఫర్ 1970ల నాటి లుక్ ని తీసుకురావడంలో సక్సెస్ అయ్యారు. ప్రశాంత్ విహారి అందించిన సంగీతం ఈ సినిమాకి ప్లస్ అయింది. ఎడిటర్ రవితేజ కాస్త మొహమాటాన్ని పక్కన పెడితే బాగుండేది. అక్కడక్కడా సీన్స్ ల్యాగ్ అయిన ఫీలింగ్ కలుగుతుంది.
నటీనటుల పనితీరు:
నిత్యామీనన్, సత్యదేవ్, రాహుల్ రామకృష్ణల నటన గురించి ప్రత్యేకంగా చెప్పేది ఏముంది. పాత్రల్లో ఒదిగిపోయి, చాలా నేచురల్ గా నటించి పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. తనని గొప్పగా రచయిత్రిగా ఊహించుకునే గౌరి పాత్రలో నిత్యామీనన్ ఒదిగిపోయి నవ్వులు పూయించింది. మనసులో ఒకటి పెట్టుకొని పైకి అమాయకంగా కనిపించే ఆనంద్ పాత్రతో సత్యదేవ్ ఆకట్టుకున్నాడు. రాహుల్ రామకృష్ణ సుబేదార్ రామారావుగా తనదైన శైలిలో అలరించాడు. ఇక సీనియర్ నటుడు తనికెళ్ళ భరణి.. ఆనంద్ తాత సదానంద పాత్రలో నటించి మెప్పించారు. వీరితో పాటు మిగతా పాత్రధారులు కూడా తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.
తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:
కథ పెద్దది కాదు. కథలో పెద్దగా మలుపులు ఉండవు. అద్భుతమైన సినిమా చూశామన్న ఫీలింగ్ కలగదు. కానీ, ఆహ్లాదకరమైన వాతావరణంలో ఓ మంచి సినిమా చూసామన్న ఫీలింగ్ కలుగుతుంది.
రేటింగ్: 2.75/5
-గంగసాని
Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
