ప్రేక్షకుల్ని వదిలి పెట్టను.. మూడో దాడికి సిద్ధమైన శంకర్!
on Jan 17, 2025
రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు రాజ్యమేలుతున్న తరుణంలో సందేశంతో కూడిన కమర్షియల్ సినిమాలకు శ్రీకారం చుట్టిన దర్శకుడు శంకర్. జెంటిల్‌మెన్, భారతీయుడు, ఒకే ఒక్కడు, అపరిచితుడు వంటి సినిమాల్లో సొసైటీలోని లోపాలను ఎత్తిచూపుతూ కమర్షియల్ ఫార్మాట్‌లో శంకర్ చేసిన ప్రయత్నాలకు విపరీతమైన స్పందన వచ్చింది. ఆ సినిమాలతో ఇండియాలోనే ఒన్ ఆఫ్ ది బెస్ట్ డైరెక్టర్స్‌గా పేరు తెచ్చుకున్న శంకర్ కెరీర్ దాదాపు 17 సంవత్సరాలపాటు ఉజ్వలంగా కొనసాగింది. 2010లో సూపర్‌స్టార్ రజినీకాంత్‌తో చేసిన ‘రోబో’ అతని చివరి బ్లాక్‌బస్టర్‌గా చెప్పుకోవచ్చు. ఆ తర్వాత చేసిన స్నేహితుడు, ఐ, 2.0 చిత్రాలు పెద్ద డిజాస్టర్స్ కావడంతో శంకర్ కెరీర్ గ్రాఫ్ ఒక్కసారిగా పడిపోయింది. టెక్నికల్‌గా హై స్టాండర్డ్స్‌లో సినిమాలు చేస్తాడని పేరు తెచ్చుకున్న అతన్ని వరస పరాజయాలు కుంగదీశాయి.
అదే క్రమంలో ఇండియన్2 చిత్రానికి శ్రీకారం చుట్టి మరో రాంగ్ డెసిషన్ తీసుకున్నాడు శంకర్. గత ఏడాది రిలీజ్ అయిన ఈ సినిమా భారీ డిజాస్టర్ అనిపించుకుంది. 28 సంవత్సరాల క్రితం కమల్‌హాసన్‌తో ఇండియన్ చిత్రాన్ని రూపొందించి భారీ విజయాన్ని అందుకున్న శంకర్ ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్ గురించి ఆలోచించకుండా పాత కాన్సెప్ట్‌నే కంటిన్యూ చేస్తూ రూపొందించిన ఇండియన్ 2 చిత్రాన్ని ప్రేక్షకులు తిప్పి కొట్టారు. అదే సమయంలో గ్లోబల్‌స్టార్ రామ్‌చరణ్‌తో గేమ్ ఛేంజర్‌ని కూడా తెరకెక్కించాడు. తెలుగులో శంకర్ తొలి డైరెక్ట్ సినిమాగా తెరకెక్కిన గేమ్ ఛేంజర్ సంక్రాంతి కానుకగా విడుదలై శంకర్ ఖాతాలో మరో పరాజయాన్ని చేర్చింది. మొదటి షో నుంచే కొంత డివైడ్ టాక్, కొంత ఫ్లాప్ టాక్ తెచ్చుకున్న గేమ్ ఛేంజర్ ఫైనల్‌గా అతని ఫ్లాప్‌ల పరంపరలో మరో సినిమాగా నిలిచింది. 450 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వడం కూడా కష్టమేనని ట్రేడ్‌వర్గాలు చెబుతున్నాయి. ఇంకా థియేటర్స్‌లో ఉన్న ఈ సినిమా ఫైనల్ రిజల్ట్ ఏమిటి అనేది తెలియాల్సి ఉంది.
ఇదిలా ఉంటే.. రెండు వరస ఫ్లాప్‌ల తర్వాత మూడో సినిమాతో ప్రేక్షకులపై దాడి చేసేందుకు శంకర్ సిద్ధమవుతున్నాడు. ఇండియన్2 సినిమా రిలీజ్‌కి ముందే దానికి మూడో భాగం కూడా ఉంటుందని శంకర్ ప్రకటించిన విషయం తెలిసిందే. దానికి సంబంధించిన 5 నిమిషాల ట్రైలర్‌ను ఇండియన్ 2 చివరలో ప్రదర్శించారు. ఇండియన్3పై శంకర్ ఎన్నో హోప్స్ పెట్టుకున్నారని తెలుస్తోంది. ఈ సినిమాకి సంబంధించి ఇంకా ఆరునెలల షూటింగ్, విజువల్ ఎఫెక్ట్స్ బ్యాలెన్స్ ఉన్నాయని సమాచారం. అవన్నీ పూర్తి చేసి ఈ సంవత్సరమే ఇండియన్ 3ని ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని శంకర్ కృషి చేస్తున్నారు. అయితే వాటిని ఎప్పుడు పూర్తి చేస్తారు, ఎప్పుడు రిలీజ్ చేస్తారు అనే దానిపై ఇప్పటివరకు క్లారిటీ లేదు. ఎంత స్పీడ్‌గా బ్యాలెన్స్ వర్క్ ఫినిష్ చేసినా ఈ ఏడాది ఇండియన్3ని థియేటర్లలోకి తీసుకు రావడం కష్టమేనని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. మరో పక్క గత పదిహేను సంవత్సరాలుగా తను చేసిన సినిమాలతో బోలెడంత అప్రదిష్టను మూటగట్టుకున్న శంకర్ ఇండియన్3తో దాని నుంచి బయటపడతాడా లేదా అనేది పెద్ద సందేహంగా మారింది. వీటన్నింటినీ అధిగమించి శంకర్ తన పూర్వ వైభవాన్ని తిరిగి తెచ్చుకుంటాడా అనేది తెలియాలంటే ఇండియన్ 3 రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చెయ్యక తప్పదు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
