ఒరిజినల్ స్క్రీన్ జేమ్స్ బాండ్ 007 సర్ షాన్ కానరీ కన్నుమూత!
on Oct 31, 2020
ఒరిజినల్.. చాలా మందికి ఏకైక.. జేమ్స్‌బాండ్ పాత్రధారి సర్ షాన్ కానరీ కన్నుమూశారు. ఆయన వయసు 90 సంవత్సరాలు. నిర్మాతలు బార్బరా బ్రొక్కోలీ, మైఖేల్ జి. విల్సన్ తరపున జేమ్స్‌బాండ్ ఫ్రాంచైజీ ట్విట్టర్ హ్యాండిల్ ఈ విషయాన్ని ప్రకటించింది. "సర్ షాన్ కానరీ మృతి చెందారనే న్యూస్ మమ్మల్ని కలచివేసింది. ఒరిజినల్ జేమ్స్ బాండ్‌గా ఆయన ఎప్పటికీ గుర్తుండిపోతారు. "ద నేమ్ ఈజ్ బాండ్.. జేమ్స్ బాండ్" అంటూ ఆయన పలికిన మాటలు ఎప్పటికీ మరచిపోలేం. సెక్సీ అండ్ కరిష్మాటిక్ సీక్రెట్ ఏజెంట్ పాత్ర పోషణలో తనదైన విప్లవాత్మక శైలితో ప్రపంచాన్ని ఆయన మురిపించారు. ఈ ఫిల్మ్ సిరీస్ ఈ స్థాయిలో సక్సెస్ కావడంలో ఆయన పాత్రే అధికం అనే విషయం నిస్సందేహం. ఎప్పటికీ ఆయనకు రుణపడి ఉంటాం" అని అందులో రాసుకొచ్చారు.
సర్ షాన్ కానరీ నిద్రలోనే మృతి చెందినట్లు బీబీసీ రిపోర్ట్ చేసింది. "మా నాన్న కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నప్పటికీ, కొద్దిసేపటి క్రితమే ఆయన మృతి చెందారనే విషయాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. మా నాన్న గురించి తెలిసి, ఆయనను అభిమానించే వారందరికీ ఇది విషాదకరమైన రోజు. ఒక యాక్టర్‌గా ఆయన నటనను ఆస్వాదించిన ప్రపంచానికంతటికీ ఆయన మృతి తీరని లోటు" అని ఆయన కుమారుడు జాసన్ కానరీ చెప్పారు.
ఏడు సినిమాల్లో జేమ్స్ బాండ్ 007 పాత్రలో కనిపించిన షాన్ కానరీ ఇక లేరనే వార్త తెలిసిన క్షణం నుంచే సోషల్ మీడియాలో ఆయనకు నివాళులు వెల్లువెత్తాయి. కానరీ నటించిన జేమ్స్ బాండ్ సినిమాలు.. డాక్టర్ నో (1962), ఫ్రమ్ రష్యా విత్ లవ్ (1963), గోల్డ్‌ఫింగర్ (1964), థండర్‌బాల్ (1965), యు ఓన్లీ లివ్ ట్వైస్ (1967), డైమండ్స్ ఆర్ ఫరెవర్ (1971), నెవర్ సే నెవర్ ఎగైన్ (1984).
కేవలం జేమ్స్ బాండ్ పాత్రతోనే కాకుండా, అనేక ఇతర సినిమాల్లో చేసిన పాత్రలతోనూ కానరీ ప్రపంచవ్యాప్త సినీ ప్రేమికులను అలరించారు. వాటిలో ఎంట్రాప్మెంట్, ది హంట్ ఫర్ రెడ్ అక్టోబర్, ఫైండింగ్ ఫారెస్టర్, హైలాండర్, ద మ్యాన్ హూ వుడ్ బి కింగ్, ద నేమ్ ఆఫ్ ద రోజ్, ది అన్‌టచబుల్స్ లాంటి సినిమాలున్నాయి. 'ది అన్‌టచబుల్స్' మూవీలో చేసిన ఐరిష్ పోలీస్ ఆఫీసర్ పాత్రకు గాను 1988లో షాన్ కానరీ బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్‌గా ఆస్కార్ అవార్డును అందుకున్నారు.
Also Read