అల... మహేష్ డైరెక్టర్ సెటైర్ వేశాడు!
on Oct 28, 2019
సంక్రాంతి బరిలో రజనీకాంత్ 'దర్బార్', నందమూరి కల్యాణ్ రామ్ 'ఎంత మంచివాడవురా' ఉన్నప్పటికీ... ప్రధానంగా సూపర్‌స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న 'సరిలేరు నీకెవ్వరు', స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న 'అల... వైకుంఠపురములో' సినిమాల మధ్య పోటీ నెలకొంది. ఫస్ట్ లుక్స్, సినిమా పోస్టర్స్ మొదలుకుని రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్ వరకూ ప్రతి విషయంలో రెండూ పోటీ పడ్డాయి.
ప్రచారం విషయంలో మాత్రం 'అల... వైకుంఠపురములో' ఓ అడుగు ముందుంది. ఇప్పటికే విడుదల చేసిన రెండు పాటలకూ హిట్ టాక్ వచ్చింది. మరోవైపు 'సరిలేరు నీకెవ్వరు' టీమ్ నుండి ప్రతి పండక్కి మహేష్ కొత్త పోస్టర్ వస్తుంది తప్ప మరో అప్ డేట్ ఉండటం లేదు. ఘట్టమనేని అభిమానులు 'సరిలేరు నీకెవ్వరు' పబ్లిసిటీపై కించిత్ ఆగ్రహంతో ఉన్నారు. ఈ నేపథ్యంలో దీపావళికి అనిల్ రావిపూడి ఓ వీడియో విడుదల చేశారు. అందులో సుబ్బరాజ్, వెన్నెల కిషోర్ తో పాటు ఆయన కూడా ఉన్నారు.
సుబ్బరాజ్, వెన్నెల కిషోర్ ఇంటర్వ్యూ ఇస్తూ ఉంటారు. ట్రైన్ ఎపిసోడ్ తర్వాత కర్నూల్ ఎపిసోడ్, ఆ తర్వాత సార్ (సుబ్బరాజ్) ఎంట్రీ, తర్వాత ప్రకాష్ రాజ్ ఎంట్రీ, ఆ తర్వాత రష్మిక ఎంట్రీ, తరవాత హీరోగారు వస్తారు అని ఇద్దరూ చెబుతుంటే అనిల్ రావిపూడి వస్తారు. 'ఏం చేస్తున్నారు?' అని అడుగుతారు. స్క్రీన్ ప్లే అడుగుతుంటే చెబుతున్నామంటే... ప్రీ క్లైమాక్స్ వరకూ చెప్పేశారని అనిల్ రావిపూడి అంటారు. తర్వాత "మార్కెట్ ని అలర్ట్ చేయడనికి పీఆర్ టీమ్ ఉంది. ఇది దీవాలి. మన సినిమా సంక్రాంతికి' అని మరో డైలాగ్. ఇందులో అర్థం చేసుకున్నవాళ్లకు అర్థం చేసుకున్నంత కంటెంట్ ఉంది. 'సరిలేరు నీకెవ్వరు' మార్కెట్, పబ్లిసిటీ పీఆర్ టీమ్ చూసుకుంటుందనేది ఒకటి. సంక్రాంతికి విడుదల కాబట్టి అప్పుడే పబ్లిసిటీ అవసరం లేదనేది మరొకటి. సంక్రాంతికి వచ్చే సినిమాకు ఇప్పటినుండి పబ్లిసిటీ ఎందుకు? అంటే 'అల..'పై సెటైర్ అనుకోవాలి.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
