మరోసారి టాలీవుడ్‌కి సల్మాన్ ఖాన్.. ఏ హీరో కోసమో తెలుసా?
on Sep 9, 2024
స్టార్ హీరోల మధ్య ప్రొఫెషనల్‌గా పోటీ ఉండడం అనేది సహజం. అయితే అది సినిమాల వరకే పరిమితం అవుతుంది తప్ప వ్యక్తిగతంగా వారి మధ్య మంచి స్నేహమే ఉంటుంది. గతంలో హీరోల అభిమానుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుందేమో అన్నట్టుగా ఉండేది. అప్పట్లో మీడియా అంతగా విస్తరించి లేని కారణంగా హీరోల వ్యక్తిగత జీవితాలు ఎలా ఉంటాయి, ఇతర హీరోలతో వారి సాంగత్యం ఎలా ఉంటుంది అనేది సాధారణ ప్రేక్షకులకు తెలిసేది కాదు. ప్రస్తుతం హీరోలకు సంబంధించిన ఏ విషయమైనా క్షణాల్లో జనంలోకి వెళ్లిపోతోంది. అదీగాక, నటీనటుల మధ్య స్నేహ పూరిత వాతావరణం గత కొన్నేళ్ళు ఎంతో ఆరోగ్యకరంగా ఉందని చెప్పొచ్చు. అందుకే ఎలాంటి భేషజాలకు పోకుండా ఒక హీరో సినిమాల ప్రమోషన్స్‌కు మరో హీరో హాజరు కావడం, ఒక హీరో సినిమా సూపర్‌హిట్ అయితే మరో హీరో అభినందనలు తెలియజేయడం అనే సంప్రదాయాన్ని పాటిస్తూ ప్రేక్షకుల్లో హీరోల పట్ల మంచి అభిప్రాయాన్ని కలిగిస్తున్నారు.
గత కొన్నేళ్ళుగా హీరోల సత్సంబంధాలు మరింత పెరిగాయి అని చెప్పడానికి ఎన్నో ఉదాహరణలు కనిపిస్తున్నాయి. సినిమాల ప్రమోషన్స్ విషయంలోనే కాదు, కొందరు ఒక అడుగు ముందుకు వేసి ఒకరి సినిమాలో మరొకరు అతిథి పాత్రలు పోషించడం ద్వారా వారి మధ్య ఉన్న అనుబంధాన్ని మరింత పెంచుకుంటున్నారు. ఇప్పటికే చాలా మంది హీరోలు అతిథి పాత్రల్లో కనిపించి ప్రేక్షకులకు కనువిందు చేశారు. ఈ విషయంలో బాలీవుడ్‌కి, సౌత్ ఇండస్ట్రీకి మధ్య సంబంధాలు మరింత బలపడ్డాయి. ఆ మధ్య మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ‘గాడ్‌ఫాదర్’ చిత్రంలో బాలీవుడ్ స్టార్ సల్మాన్‌ఖాన్ గెస్ట్‌గా నటించారు.
గత ఏడాది సల్మాన్ ఖాన్ హీరోగా రూపొందిన హిందీ సినిమా ‘కిసీకా భాయ్ కిసీకి జాన్’ చిత్రంలో వెంకటేష్ అతిథి పాత్రలో నటించారు. ఈ సినిమాలో హీరోయిన్ సోదరుడి పాత్ర పోషించారు. అలాగే రామ్‌చరణ్ ఓ పాటలో కనిపించారు. వెంకటేష్ ఆ సినిమాలో నటిండానికి సల్మాన్ చేసిన రిక్వెస్టే కారణమని తెలుస్తోంది. ఇప్పుడు వెంకటేష్ కోసం సల్మాన్ ఖాన్ మరోసారి టాలీవుడ్‌కి రాబోతున్నారు. వెంకటేష్‌తో ఎఫ్2, ఎఫ్3 చిత్రాలు చేసిన అనిల్ రావిపూడి దర్శకత్వంలో మరో సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో గెస్ట్ రోల్ చేసేందుకు సల్మాన్ ఖాన్ ఓకే చెప్పారని తెలుస్తోంది. దీనికి సంబంధించి సల్మాన్‌తో వెంకటేష్, అనిల్ సంప్రదించారని సమాచారం. సల్మాన్ కూడా ఈ సినిమాలో నటించేందుకు ఓకే చెప్పారు. సల్మాన్ క్యారెక్టర్‌కి సంబంధించి మూడు రోజులు డేట్స్ అవసరమవుతాయట. దానికి కూడా సల్మాన్ అంగీకరించారని తెలుస్తోంది. ఏ డేట్స్ కావాలన్నా ఇస్తానని చెప్పారట. ఇప్పుడు వెంకటేష్, సల్మాన్ కాంబినేషన్‌లో వచ్చే సీన్స్‌ను ఎప్పుడు షూట్ చెయ్యాలి అనే ప్లానింగ్‌లో ఉన్నారు అనిల్. ఈ చిత్రానికి సంబంధించి పొల్లాచ్చి షెడ్యూల్‌ను పూర్తి చేశారు. ఈ షెడ్యూల్‌లో వెంకటేష్, ఐశ్వర్యా రాజేష్‌లపై ఒక పాటతోపాటు కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించారని తెలుస్తోంది. ఇక సల్మాన్‌తో చేయబోయే షూట్‌కి సంబంధించి త్వరలోనే ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని సమాచారం.
Also Read