Home

»

Latest News

నవంబర్‌లో సాయిపల్లవి డబుల్ ధమాకా.. సీత‌గా, ప‌వ‌ర్‌ఫుల్ ఆఫీస‌ర్‌గా.!

Oct 27, 2026 3:24PM

సాయిపల్లవి అభిమానులకు నవంబర్ నెలలో డబుల్ ధమాకా అందనుంది. ఆమె నటించిన రెండు భారీ చిత్రాలు కేవలం 15 రోజుల వ్యవధిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. రణ్‌బీర్ కపూర్ హీరోగా నటిస్తున్న పౌరాణిక చిత్రం ‘రామాయణ’లో సీతాదేవిగా కనిపించనున్న సాయిపల్లవి.. ఆ తర్వాత ధనుష్‌ హీరోగా తెరకెక్కిన ‘ఓం’ సినిమాలో మరో విభిన్నమైన పాత్రతో అలరించనుంది. ఈ రెండు సినిమాలు వరుసగా విడుదల కానుండటంతో ఆమె అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.

నితేశ్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రామాయణ’ భారతీయ ఇతిహాసం ఆధారంగా రూపొందుతోంది. ఇందులో రణ్‌బీర్ కపూర్ శ్రీరాముడిగా, సాయిపల్లవి సీతాదేవిగా, యశ్ రావణుడిగా నటిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో, అంతర్జాతీయ స్థాయి సాంకేతిక ప్రమాణాలతో ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. తొలి భాగం నవంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమాలో సీత పాత్ర సాయిపల్లవి కెరీర్‌లో ప్రత్యేకంగా నిలిచే పాత్రల్లో ఒకటిగా ఉంటుందని అభిమానులు ఆశిస్తున్నారు.

మరోవైపు ధనుష్‌, మమ్ముట్టి కీలక పాత్రల్లో నటిస్తున్న ‘ఓం: చాప్టర్ 1 – ఉధిరం: ది బ్లడ్ వుడ్’ సినిమాలో సాయిపల్లవి సీబీఐ అధికారిణి నిత్యారెడ్డిగా కనిపించనుంది. ఎర్రచందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఈ యాక్షన్ థ్రిల్లర్‌కు రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో సాయిపల్లవి పాత్రకు సంబంధించిన తొలి గ్లింప్స్ కూడా ఆసక్తిని పెంచుతోంది. గతంలో ప్రకటించిన అక్టోబర్ 16 విడుదల తేదీ నుంచి ఈ చిత్రాన్ని వాయిదా వేసి నవంబర్ 20న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ నిర్ణయించారు.

ఇలా నవంబర్ 5న ‘రామాయణ’, నవంబర్ 20న ‘ఓం’ విడుదల కానుండటంతో కేవలం 15 రోజుల వ్యవధిలోనే సాయిపల్లవి రెండు భిన్నమైన పాత్రల్లో ప్రేక్షకులను పలకరించనుంది. ఒక సినిమాలో పౌరాణిక పాత్రలో కనిపిస్తే, మరో సినిమాలో దర్యాప్తు చేసే అధికారిణిగా కనిపించనుండటం విశేషం. కథల ఎంపికలో వైవిధ్యానికి ప్రాధాన్యం ఇచ్చే సాయిపల్లవికి ఈ రెండు సినిమాలు ఎలాంటి గుర్తింపును తీసుకొస్తాయో చూడాలి.

 

 

[Sai Pallavi, Ramayana Movie 2026, Sai Pallavi OM Movie, Dhanush OM Chapter 1, Sai Pallavi as Sita, Nithya Reddy CBI Officer, Ramayana Release Date, OM Movie Release Date]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com