'రూలర్' అంటే వేటాడే సింహం! టీజర్‌లో అదరగొట్టిన బాలయ్య!!
on Nov 21, 2019
నందమూరి బాలకృష్ణ ఫ్యాన్స్‌ను ఆనంద పారవశ్యంలో ముంచెత్తుతూ ఆయన సినిమా 'రూలర్' టీజర్ గురువారం సాయంత్రం 4 గంటల 28 నిమిషాలకు రిలీజైంది. తమిళ సీనియర్ డైరెక్టర్ కె.ఎస్. రవికుమార్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో బాలయ్య సరసన సోనాల్ చౌహాన్, వేదిక హీరోయిన్లుగా నటిస్తున్నారు. 2018 సంక్రాంతికి వచ్చి ఫర్వాలేదనిపించే స్థాయిలో ఆడిన 'జై సింహా' తర్వాత బాలయ్య, కె.ఎస్. రవికుమార్ కాంబినేషన్‌లో ఈ సినిమా తయారవుతుండటం గమనార్హం. 'రూలర్'.. బాలకృష్ణ 105వ చిత్రం. ప్రకాశ్ రాజ్, జయసుధ, భూమికా చావ్లా, సాయాజీ షిండే వంటి పేరుపొందిన నటీనటులు ఈ మూవీలో నటిస్తున్నారు.
సినిమాలో బాలకృష్ణ రెండు రకాల షేడ్స్ ఉన్న కేరెక్టర్ చేస్తున్నారని ముందు నుంచీ దర్శక నిర్మాతలు చెబుతూ వస్తున్నారు. టీజర్ కూడా ఆ విషయాన్నే తెలియజేసింది. ఒక షేడ్ పోలీసాఫీసర్ కాగా, మరొకటి హెలికాప్టర్లలో ట్రావెల్ చేసే బిలియనీర్. రెండు షేడ్లలో ఆయన రూపం కూడా ఒకదానికొకటి చాలా భిన్నంగా కనిపిస్తోంది. పోలీసాఫీసర్‌గా బుర్ర మీసాలు, గడ్డంతోనూ, బిలియనీర్‌గా వాన్ డైక్ బియర్డ్‌తోనూ ఆయన కనిపిస్తున్నారు. బిలియనీర్ గెటప్ మాత్రం అదుర్స్ అనిపించే రేంజిలో ఉంది. ఆ వేషంలో బాలయ్య యువకుడిలా మారిపోయారు. యాక్షన్, పవర్‌ఫుల్ డైలాగ్స్, ఎమోషనల్ అండ్ సెంటిమెంట్ సీన్స్, కామెడీ, శృంగారం, రౌద్రం.. వంటి అన్ని ఎలిమెంట్స్‌తో 'రూలర్' తయారవుతోందని టీజర్‌ని బట్టి ఇట్టే ఊహించవచ్చు.
టీజర్ మొదట్లోనే "ధర్మా మా ఊరికే గ్రామదైవం. ఎవరికి ఏ కష్టమొచ్చినా తనే ముందుంటాడు." అని నేపథ్యంలో వినిపించిన ఒక స్త్రీ గొంతు బాలయ్య క్యారెక్టరైజేషన్ ఏమిటనేది తెలియజేసింది. ఊరన్నా, గ్రామమన్నా ఒకటే అనేది మనకు తెలిసిన అర్థం. కానీ ఈ మూవీ డైలాగ్ రైటర్ ఆ రెండూ వేరువేరని అనుకున్నట్లున్నాడు. అందుకనే "ధర్మా మా ఊరికే గ్రామదైవం" అని రాశాడు. ఆ రెండింటికీ తేడా ఏమిటనేది ఆయన తెలిపితే బాగుంటుంది.
"ఒంటిమీద ఖాకీ యూనిఫాం ఉంటేనే బోనులో పెట్టిన సింహంలా ఉంటాను. యూనిఫాం తీశానా.. బయటకు వచ్చిన సింహంలా ఆగను. ఇక వేటే." అని బాలకృష్ణ తనేమిటో తెలియజేశాడు. 1 నిమిషం 15 సెకన్ల నిడివి ఉన్న టీజర్‌లో బాలయ్య చెప్పిన ఏకైక డైలాగ్ ఇదే. బాలకృష్ణ అంటే 'సింహం' అని డైరెక్టర్లందరూ ఫిక్సయిపోయింట్లున్నారు. అందుకే డైలాగ్స్‌లో సింహం అనే మాట ఎక్కడో చోట పెట్టకుండా ఉండలేకపోతున్నారు. అలాగే టైటిల్‌లోనూ సింహం బొమ్మ ఉండేలా చూసుకుంటున్నారు. 'రూలర్' టైటిల్ లోగోలోనూ మనం మూడు సింహాలను చూడొచ్చు. మూవీలో బాలయ్య పోలీసాఫీసర్ కాబట్టి, మూడు సింహాల గుర్తును ఉపయోగించారు.
శాంపిల్‌గా చూపించిన యాక్షన్ సీన్స్ చూస్తే మూవీలో భారీ యాక్షన్ ఎపిసోడ్స్ ఉన్నాయనీ, ఇవి మాస్ ఆడియెన్స్‌తో పాటు బాలయ్య ఫ్యాన్స్‌ను అమితంగా అలరిస్తాయనీ ఊహించవచ్చు. యాక్షన్ ఎపిసోడ్లలో బాలయ్య విశ్వరూపాన్ని మనం చూడబోతున్నాం. టీజర్ ప్రకారం ప్రకాశ్ రాజ్, జయసుధ, భూమిక పాత్రలు సినిమాకు కీలకమనే అభిప్రాయం కలుగుతుంది. భూమిక కేరెక్టర్ సెంటిమెంట్‌ని పండిస్తుందని తెలుస్తోంది. హీరోయిన్లు.. సోనాల్ చౌహాన్, వేదిక ఇద్దరూ గ్లామర్‌ను బాగా కురిపించారు. సోనాల్ అయితే స్వింసూట్‌లో దర్శనమివ్వనున్నది. విలన్ పాత్రధారిగా తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేని నటుడు కనిపిస్తున్నాడు. మీడియాకు ఇచ్చిన కేస్టింగ్ వివరాల్లోనూ అతడి పేరు లేదు. సప్తగిరి, రఘుబాబు, శ్రీనివాసరెడ్డి, ధన్‌రాజ్, రఘు కారుమంచి.. నవ్వులు పూయించనున్నారు.
యాక్షన్ ఎపిసోడ్లు కానీ, హెలికాప్టర్ ఉపయోగించడం కానీ, మిగతా సీన్లు కానీ చూస్తుంటే భారీ బడ్జెట్‌తో, రిచ్‌గా ఈ మూవీని నిర్మిస్తున్నారనేది స్పష్టం. తన డ్రీం ప్రాజెక్ట్, రెండు భాగాల ఎన్టీఆర్ బయోపిక్.. బాక్సాఫీస్ దగ్గర అనూహ్య పరాజయాన్ని పొందడంతో కమర్షియల్‌గా పెద్ద విజయాన్ని సాధించాలనే తపనతో, కసితో 'రూలర్' మూవీని చేస్తున్నారు బాలయ్య. చిరంతన్ భట్ బ్యాగ్రౌండ్ స్కోర్, సి. రాంప్రసాద్ సినిమాటోగ్రఫీతో 'టీజర్' అదిరింది. ఈ డిసెంబర్ 20న వస్తున్న 'రూలర్'తో ఆయన ఏం సంచలనం సృష్టిస్తారా అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.