'ఆర్ఆర్ఆర్' ట్రైలర్.. 'పులి'ని పట్టుకోవాలంటే 'వేటగాడు' కావాలి!
on Dec 9, 2021
ఇండియాస్ బిగ్గెస్ట్ ఫిల్మ్ 'ఆర్ఆర్ఆర్' ట్రైలర్ వచ్చేసింది. దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధానపాత్రలు పోషిస్తున్న 'ఆర్ఆర్ఆర్' మూవీ ట్రైలర్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. ట్రైలర్ ను మొదట గురువారం ఉదయం 10 గంటలకు తెలుగు రాష్ట్రాలలోని పలు థియేటర్స్ లో ప్రదర్శించిన మేకర్స్.. ఆ తరవాత 11 గంటలకు యూట్యూబ్ లో విడుదల చేశారు. 3 నిమిషాల 7 సెకన్ల నిడివి గల ఈ ట్రైలర్ రోమాలు నిక్కబొడుచుకునేలా ఉంది.
Also Read: తారక్, మహేష్ మల్టీస్టారర్.. ఫ్యాన్స్ కి పండగే!
'స్కాట్ దొరగారు మా ఆదిలాబాద్ వచ్చినప్పుడు ఒక చిన్న పిల్లని తీసుకొచ్చారు. మీరు తీసుకొచ్చింది గోండ్ల పిల్లనండీ' అంటూ బ్రిటిష్ అధికారులతో రాజీవ్ కనకాల చెప్పే డైలాగ్ తో ట్రైలర్ ప్రారంభమవుతుంది. 'అయితే వాళ్లకేమన్నా రెండు కొమ్ములుంటాయా?' అని అధికారి అడగగా.. 'ఒక కాపరి ఉంటాడు' అని రాజీవ్ చెప్తాడు. అప్పుడు అడవిలో పరుగెత్తుకుంటూ గోండు బెబ్బులి భీమ్(తారక్) ఎంట్రీ ఇస్తాడు. భీమ్ పులిని బందించి తన కళ్ళ ముందు గాండ్రిస్తున్న పులి కళ్ళలోకి చూస్తూ గట్టిగా గర్జిస్తాడు.
'పులిని పట్టుకోవాలి అంటే వేటగాడు కావాలి.. ఆ పని చేయగలిగేది ఒక్కడే సార్' అనే వాయిస్ రాగానే ఖాకీ దుస్తుల్లో రామ్ పవర్ ఫుల్ ఎంట్రీ ఇచ్చాడు. వందల మందిని తన కంటి చూపుతో అదుపుచేయగల శక్తి వంతమైన వ్యక్తిగా రామ్ ని చూపించారు. 'భీమ్ పులి అయితే, ఆ పులిని పట్టుకోగల వేటగాడు రామ్' అనేది బ్రిటిష్ అధికారుల ఉద్దేశమన్నట్లుగా ట్రైలర్ లో చూపించారు. 'బ్రిటిష్ ప్రభుత్వానికి ఎదురుతిరిగిన నేరానికి నిన్ను అరెస్ట్ చేస్తున్నాను' అంటూ ఖాకీ దుస్తుల్లో ఉన్న రామ్.. భీమ్ ని పట్టుకోవడం కూడా ట్రైలర్ లో చూడొచ్చు.
Also Read: మహేష్, చరణ్ మల్టీస్టారర్.. డైరెక్టర్ ఎవరో తెలుసా?
ట్రైలర్ లో భీమ్, రామ్ ల స్నేహాన్ని చూపించారు. ఒకరంటే ఒకరికి ప్రాణం అన్నట్లుగా వారి స్నేహం ఉంది. అలాగే దేశం కోసం ప్రాణాలు పోగొట్టుకోవడానికి కూడా సిద్ధం అన్నట్లుగా పోరాడే వీరులుగానూ భీమ్, రామ్ కనిపిస్తున్నారు. "తొంగి తొంగి, నక్కి నక్కి కాదు.. తొక్కుకుంటూ పోవాలి.. ఎదురొచ్చినోడిని ఏసుకుంటూ పోవాలి" అంటూ భీమ్ చెప్పే డైలాగ్, 'యుద్ధాన్ని వెతుక్కుంటూ ఆయుధాలు వాటంతట అవే వస్తాయి' అంటూ అజయ్ దేవ్ గణ్ చెప్పే డైలాగ్, "భీమ్.. ఈ నక్కల వేట ఎంతసేపు?.. కుంభస్థలాన్ని బద్దలుకొడదాం పదా" అంటూ రామ్ చెప్పే డైలాగ్ ట్రైలర్ కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఇక ఫైర్ మధ్యలో నుంచి అల్లు సీతారామరాజు గెటప్ లో రామ్ చరణ్ ఎంట్రీ ఇచ్చిన షాట్ ట్రైలర్ కే హైలైట్ గా నిలిచింది. రాజమౌళి విజన్ ని కళ్ళకు కట్టినట్లు చూపించాడు డీఓపీ సెంథిల్. ఎప్పటిలాగానే కీరవాణి బ్యాగ్రౌండ్ స్కోర్ ట్రైలర్ ని మరో స్థాయికి తీసుకెళ్లింది. ట్రైలర్ లో ప్రతి షాట్ లో రాజమౌళి మార్క్ కనిపిస్తుంది. 'బాహుబలి'తో తెలుగు సినిమా స్థాయిని పెంచిన రాజమౌళి.. 'ఆర్ఆర్ఆర్'తో మరో పది మెట్లు పైకి తీసుకెళ్ళబోతున్నాడని ట్రైలర్ తోనే అర్థమవుతోంది.
Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
