మనోజ్ పనైపోయింది, కెరీర్ ఖతం అన్నారు.. మౌనంగా భరించా.. తిరిగొస్తున్నా!
on Sep 23, 2023

జయాపజయాలతో సంబంధం లేకుండా విభిన్న చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మంచు మనోజ్ ఏవో వ్యక్తిగత కారణాల వల్ల కొంతకాలం నటనను బ్రేక్ ఇచ్చాడు. 2017 లో వచ్చిన 'ఒక్కడు మిగిలాడు' తర్వాత అతను సోలో హీరోగా నటించిన సినిమా రాలేదు. ఇప్పటికే ఆరేళ్ళు గడిచిపోయాయి. మధ్యలో 'అహం బ్రహ్మాస్మి' అనే సినిమా ప్రకటించాడు కానీ పట్టాలెక్కలేదు. విడాకుల వల్ల బాగా డిస్టర్బ్ అయ్యాడని, ఇక మనోజ్ సినిమాలు చేయడం కష్టమేనని వార్తలు వినిపించాయి. అయితే మనోజ్ అదిరిపోయే రీఎంట్రీకి సిద్ధమవుతున్నాడు. భూమా మౌనికతో వివాహం తర్వాత అతను సరికొత్తగా కనిపిస్తున్నాడు. ప్రస్తుతం 'వాట్ ది ఫిష్' అనే సినిమాలో నటిస్తున్న మనోజ్.. అలాగే డిజిటల్ ఎంట్రీకి కూడా రెడీ అయ్యాడు.
ఓటీటీ వేదిక ఈటీవీ విన్ కోసం ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఓ గేమ్ షో చేస్తోంది. దీనికి మనోజ్ హోస్ట్ గా వ్యవహరించనున్నాడు. "ప్రియమైన అభిమానుల కోసం.. తిరిగొస్తున్నా కొంచెం కొత్తగా, సరికొత్తగా రాంప్ ఆడియ్యడానికి" అంటూ మనోజ్ సోషల్ మీడియా వేదికగా గేమ్ షో ప్రోమోని షేర్ చేశాడు. ఆ ప్రోమోలో మనోజ్ వాయిస్ ఓవర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. "నా ప్రపంచం సినిమా. నేను చిన్నప్పటి నుంచి సినిమా మీద పెంచుకున్న ప్రేమ నా ప్రొఫెషన్ గా మారింది. నన్నొక నటుడిగానూ, హీరోగానూ చేసింది. రాకింగ్ స్టార్ అనే ఒక పేరు కూడా ఇచ్చింది. ఫ్యాన్స్, విజిల్స్, అరుపులు, కేకలు.. ఇలా ఒక పండగలా జరిగిన నా లైఫ్ లోకి సడెన్ గా ఒక సైలెన్స్ వచ్చింది. మనోజ్ అయిపోయాడు అన్నారు, కెరీర్ ఖతం అన్నారు. యాక్టింగ్ ఆపేశాడు, ఇంక తిరిగిరాడు అన్నారు. ఎనర్జీ స్టార్ లో ఎనర్జీ తగ్గింది అన్నారు. విన్నాను, చూశాను.. మౌనంగా భరించాను.. తిరిగి వస్తున్నాను" అంటూ మనోజ్ పవర్ ఫుల్ వాయిస్ ఓవర్ తో రూపొందించిన ప్రోమో ఆకట్టుకుంటోంది. చూస్తుంటే మనోజ్ తన కమ్ బ్యాక్ లో అటు బిగ్ స్క్రీన్ మీద, ఇటు డిజిటల్ లోనూ ఒక ఆట ఆడుకునేలా ఉన్నాడు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



