సూసైడ్ చేసుకోవాలనుకున్న రియా చక్రవర్తి తల్లి!
on Oct 8, 2020
సుమారు నెల రోజులు జైలులో గడిపిన తర్వాత బెయిల్‌పై విడుదలైంది రియా చక్రవర్తి. ఆమె తమ్ముడు షోవిక్ మాత్రం ఇంకా కటకటాల వెనకే ఉన్నాడు. జైలు నుంచి బయటకు వచ్చాక పది రోజుల పాటు రోజూ ఆమె పోలీస్ స్టేషన్‌కు హాజరు కావాలనీ, తన పాస్‌పోర్ట్‌ను డిపాజిట్ చేయాలనీ, విదేశాలకు వెళ్లాలనుకుంటే కోర్టు పర్మిషన్ తీసుకోవాలనీ, ముంబై దాటి వెళ్లాలంటే దర్యాప్తు అధికారికి తెలియజేయాలనీ కోర్టు నిబంధనలు విధించింది. ఈ సందర్భంగా రియా తల్లి సంధ్యా చక్రవర్తి తన ఫీలింగ్స్‌ను టైమ్స్ ఆఫ్ ఇండియాతో పంచుకున్నారు.
ఈ కష్ట కాలాన్ని రియా ఓ ఫైటర్‌లా ఎదుర్కొందని ఆమె అభిప్రాయపడ్డారు. అయినప్పటికీ ఈ ఒత్తిడి నుంచి బయటపడ్డానికి కుమార్తెకు థెరపీ ఇప్పించి, జీవితాన్ని మళ్లీ యథావిధిగా కొనసాగేలా చేయాలనుకుంటున్నట్లు తెలిపారు. రియా జైలు నుంచి బయటకు రావడం రిలీఫ్ కలిగించిందని చెప్పిన ఆమె, "నా కొడుకు ఇంకా కటకటాల వెనకే ఉన్నాడు. రేపు ఏమవుతుందోననే ఆందోళన నన్నింకా వెంటాడుతోంది" అని బాధపడ్డారు.
ఈ సందర్భంగా తను ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన చేసినట్లు కూడా సంధ్యా చక్రవర్తి వెల్లడించారు. "మా కుటుంబాన్ని ఓ మూలకు నెట్టేయడం కాదు, నాశనం చేశారు. నా ఆత్మహత్యతో దీనికి ముగింపు పలకాలని ఒకానొక దశలో భావించాను." అని ఆమె చెప్పారు. తన పిల్లలిద్దరూ జైలులో ఉండటంతో నిద్రకు దూరమయ్యానని సంధ్య తెలిపారు. జైలు నుంచి ఇంటికొచ్చిన రియా తమ ముఖాల్ని చూసి ఎందుకంత దిగులుగా ఉన్నారనీ, దీనిపై పోరాడాలంటే బలంగా ఉండాలనీ చెప్పిందని ఆమె గుర్తు చేసుకున్నారు. "కానీ మేం ఎవరితో పోరాడాలి? జనాల్ని సంతృప్తిపర్చడానికి ఎవరో ఒకరు అరెస్ట్ కావాలి. అందుకు రియా మూల్యం చెల్లించాల్సి వచ్చింది." అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
Also Read