కృష్ణంరాజు బాటలోనే ప్రభాస్.. ఆ విషయంలో పబ్లిసిటీ అవసరం లేదు!
on Apr 3, 2025
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో కృష్ణంరాజు కుటుంబానికి ఓ విశిష్ట స్థానం ఉంది. విజయనగర సామ్రాజ్య వంశానికి చెందిన ఈ కుటుంబం పేదల పట్ల వ్యవహరించే తీరు గురించి కథలు కథలుగా చెప్పుకోవడం మనకు తెలుసు. ముఖ్యంగా కృష్ణంరాజు ఈ విషయంలో తనకంటూ ప్రత్యేకమైన అభిప్రాయాలు, ఆశయాలు ఏర్పరుచుకున్నారు. తమ సినిమా సహచరుల పట్ల వ్యవహరించే తీరుగానీ, సాయాన్ని కోరి వచ్చే వారి పట్ల చూపించే ఆదరాభిమానాలుగానీ మరే ఇతర హీరోలకు సాధ్యం కాదంటే అతిశయోక్తి కాదు. కృష్ణంరాజు జీవించి ఉన్న రోజుల్లో ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. కానీ, దానికి ఎలాంటి ప్రచారం చేసుకునేవారు కాదు. ఆయన జీవితంలో అలాంటి కార్యక్రమాలు ఎన్నో చెయ్యాలనుకున్నారు. కానీ, అవి నెరవేరకముందే ఆయన కన్నుమూశారు. ఇప్పుడు ఆ బాధ్యతను ఆయన నట వారసుడు ప్రభాస్ తీసుకున్నారు. ఒక్కొక్కటిగా పెదనాన్న కన్న కలలను నెరవేర్చే పనిలో నిమగ్నమై ఉన్నారు.
ఇప్పటికే ప్రభాస్ చేత సాయం పొందినవారు వేలల్లో ఉన్నారు. కానీ, ఏరోజూ తాను చేసిన సాయం గురించి ఎక్కడా ప్రస్తావించరు. తను చేసిన సేవా కార్యక్రమాల గురించి పదిమందికీ తెలియాలని కోరుకోరు. కృష్ణంరాజుకి తీరని కల ఒకటి ఉంది. ఆధునిక వసతులతో కూడిన ఒక హాస్పిటల్‌ను నిర్మించి పేదలకు ఉచితంగా వైద్య సేవలు అందించాలనేదే ఆయన కోరిక. దాన్ని సాకారం చేసేందుకు ప్రభాస్ సిద్ధమవుతున్నారు. అతని సహకారంతో కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవి ఓ హాస్పిటల్‌ను నిర్మించబోతున్నారు. ఆ హాస్పిటల్ వివరాలను ఆమె తెలియజేస్తూ ‘దేశంలో అందర్నీ వేధిస్తున్న ఆరోగ్య సమస్య మధుమేహం. దాని వల్ల అవయవాలు కోల్పోయిన వారిని చూసి కృష్ణంరాజుగారు, ప్రభాస్ ఎంతో చలించిపోయేవారు. అలాంటి వారికి ఉచితంగా వైద్యం అందించేందుకు ఒక హాస్పిటల్ నిర్మించాలన్నది ఆయన కల. ఆయన అభిమాని డాక్టర్ వేణు కవతప్‌తోపాటు 20 మంది అపోలో వైద్యుల బృందం ఆధ్వర్యంలో భీమవరం చుట్టు పక్కల ఉన్న షుగర్ బాధితులకు ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్నాం. ఇప్పటికే రెండు సార్లు హెల్త్ క్యాంపులు నిర్వహించాం. ఈ విషయంలో ప్రభాస్ తన పూర్తి సహకారాన్ని అందిస్తున్నాడు. త్వరలోనే ఒక హాస్పిటల్‌ను నిర్మించాలని తలపెట్టాం. దేశంలోని ఏ ప్రాంతం వారైనా ఇక్కడికి వచ్చి ఉచితంగా వైద్య సేవలు పొందవచ్చు. ఆధునిక సౌకర్యాలతో ఈ హాస్పిటల్‌ను నిర్మిస్తాం. ఇది కూడా ప్రభాస్ సాయంతోనే జరుగుతుంది’ అన్నారు.
ఇప్పటివరకు వివిధ సందర్భాల్లో ప్రభాస్ చేసిన సాయం గురించి అందరికీ తెలుసు. దేశంలో జరిగిన అనేక విపత్తుల్లో నేనున్నానంటూ సాయం చేయడంలో ప్రభాస్ ఎప్పుడూ ముందుంటారు. కరోనా సమయంలో రూ.3 కోట్లు ప్రధాన మంత్రి సహాయ నిధికి, రూ.1 కోటి రెండు తెలుగు రాష్ట్రాలకు, రూ.50 లక్షలు చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్‌కి.. మొత్తం నాలుగున్నర కోట్లు సాయాన్ని అందించారు ప్రభాస్. అంతేకాదు, ప్రతి ఏటా 100 మంది విద్యార్థులకు ఫీజులతో సహా వారికి కావాల్సిన అన్ని సదుపాయాలు కల్పిస్తున్నారు. గత ఏడాది వరదలు సంభవించినప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి రూ.2 కోట్లు సాయాన్ని అందించారు. ఇన్ని రకాలుగా ప్రజలకు సాయం చేస్తున్నప్పటికీ ఎప్పుడూ ప్రచారాన్ని కోరుకోని వ్యక్తి ప్రభాస్. సినీ పరిశ్రమలోని ఎంతో మంది సంపాదన వందల కోట్లలో ఉంటుంది. కానీ, పేదవారికి సాయం చేయాలనే మనసు కొందరికి మాత్రమే ఉంటుంది. అలాంటి వారిలో మొదటి వరసలో నిలిచే వ్యక్తి రెబల్‌స్టార్ ప్రభాస్ ఒక్కరే.
Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
