'ధమాకా'.. రవితేజ డబుల్ షేడ్స్!
on Oct 16, 2021
ప్రస్తుతం మాస్ మహారాజా రవితేజ చేతిలో ఉన్న చిత్రాల్లో `ధమాకా` ఒకటి. `సినిమా చూపిస్త మావ`, `నేను లోకల్`, `హలో గురు ప్రేమ కోసమే` వంటి హ్యాట్రిక్ హిట్స్ తరువాత త్రినాథరావ్ నక్కిన డైరెక్ట్ చేస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇటీవలే రెగ్యులర్ షూటింగ్ బాట పట్టిన `ధమాకా`.. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది.
ఇదిలా ఉంటే.. `డబుల్ ఇంపాక్ట్` అనే ట్యాగ్ లైన్ తో తెరకెక్కుతున్న `ధమాకా`కి సంబంధించి ఓ ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. అదేమిటంటే.. ఇందులో డబుల్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపిస్తారట రవితేజ. అటు క్లాస్, ఇటు మాస్.. ఇలా రెండు ఛాయలున్న విభిన్న తరహా వేషమిదని ఇన్ సైడ్ ఇన్ఫర్మేషన్. మరి.. ఈ ప్రచారంలో వాస్తవమెంతో తెలియాలంటే వచ్చే ఏడాది వరకు వేచి చూడాల్సిందే.
కాగా, `ధమాకా`లో రవితేజకి జంటగా `పెళ్ళి సందడి` ఫేమ్ శ్రీ లీల కథానాయికగా నటించనుండగా.. భీమ్స్ సిసిరోలియో బాణీలు అందిస్తున్నాడు. బెజవాడ ప్రసన్నకుమార్ కథ, స్క్రీన్ ప్లే సమకూర్చుతున్నారు.