డైరెక్టర్ పై రవితేజకు ఎందుకంత కోపం.. కావాలనే తక్కువ చేసి మాట్లాడాడా?
on Feb 10, 2022

2011 లో వచ్చిన 'వీర' తర్వాత మాస్ మహారాజ రవితేజ, డైరెక్టర్ రమేష్ వర్మ కాంబినేషన్ లో వస్తున్న సినిమా 'ఖిలాడి'. వీర సినిమా నిరాశపరిచినప్పటికే ఖిలాడిపై మంచి అంచనాలే ఉన్నాయి. 'క్రాక్' వంటి బ్లాక్ బస్టర్ తో రవితేజ ఫామ్ లో ఉండటం, 'రాక్షసుడు'తో హిట్ అందుకున్న రమేష్ వర్మ డైరెక్షన్ చేస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ట్రైలర్ కూడా ఆకట్టుకోవడంతో సినిమాపై మంచి ఏర్పడ్డాయి. డైరెక్టర్ కూడా ఈ సినిమా సక్సెస్ పై చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. అయితే రవితేజ మాత్రం సినిమా సక్సెస్ పట్ల కాన్ఫిడెంట్ గా ఉన్నా, రమేష్ వర్మ విషయంలో మాత్రం ఎందుకో అసహనంగా ఉన్నట్లు అనిపిస్తోంది.
సినిమా వేడుకలో హీరోని డైరెక్టర్, డైరెక్టర్ ని హీరోని పొడగటం కామన్. కానీ బుధవారం జరిగిన ఖిలాడి ప్రీరిలీజ్ ఈవెంట్ లో రవితేజ ఎందుకనో డైరెక్టర్ రమేష్ వర్మని తక్కువ చేసి మాట్లాడే ప్రయత్నం చేశారు. రమేష్ వర్మ ప్రతిభావంతుడు అని ఒక్క మాట కూడా రవితేజ చెప్పలేదు. రమేష్ వర్మ అదృష్టవంతుడు అని, మహర్జాతకుడు అని.. ఆయన అదృష్టానికి చిరునామా నిర్మాత కోనేరు సత్యనారాయణ అని అన్నారు. అరటిపండు వలిచి నోట్లో పెట్టినట్లు మంచి యాక్టర్స్, టెక్నీషియన్స్ ఇలా అన్నీ కోనేరు అమర్చి పెట్టారని అన్నారు.
కోనేరు సత్యనారాయణ గారికి రిక్వెస్ట్ కాదు డిమాండ్ చేస్తున్న అంటూ రవితేజ చెప్పిన మాట కూడా పలు అనుమానాలకు దారి తీస్తోంది. "ప్రాజెక్ట్ లో ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వండి, దగ్గరుండి చూసుకోండి.. చాలా విషయాలు తెలుస్తాయి, అన్ని విషయాలు తెలియవు మీకు.. దగ్గర ఉన్నారనుకోండి బోలెడు విషయాలు తెలుస్తాయి మీకు" అంటూ రవితేజ చేసిన వ్యాఖ్యలు ఉద్దేశపూర్వకంగా చేసినట్లు ఉన్నాయి. ఎందుకంటే, కోనేరు బాగా ఫ్రీడమ్ ఇస్తామని, తనని నమ్మి మొత్తం తన మీదే వదిలేస్తారని రమేష్ వర్మ గతంలో చెప్పారు.
ఇక ఈ సినిమా ఒప్పుకోవడానికి ఇద్దరు ప్రధాన కారణమని రవితేజ అన్నారు. ఒకరు నిర్మాత కోనేరు కాగా, మరొకరు రైటర్ శ్రీకాంత్ విస్సా అని చెప్పుకొచ్చారు. కోనేరు మంచి వ్యక్తి అని, శ్రీకాంత్ చాలా ప్రతిభావంతుడని పొగిడారు. శ్రీకాంత్ స్టొరీ చెప్పాడు కాబట్టే ఒప్పుకున్నానని, ఇతనికి మంచి భవిష్యత్ ఉందని, మా కాంబోలో మరిన్ని సినిమాలు వస్తాయని చెప్పాడు. అలా ఆ ఇద్దరినీ ఆకాశానికి ఎత్తేసిన రవితేజ.. డైరెక్టర్ ని ప్రశంసిస్తూ ఒక్క మాట కూడా చెప్పకపోవడం గమనార్హం. పైగా రమేష్ వర్మకి ఒకే ఒక్క విషయంలో మాత్రం థాంక్స్ చెప్పుకోవాలి, తన వల్లే శ్రీకాంత్ పరిచయమయ్యాడు అని రవితేజ అన్నాడు. అలా రవితేజ అన్న సమయంలో వేదిక మీద ఉన్న రమేష్ వర్మ కాస్త ఇబ్బంది పడ్డాడు.
హీరో, డైరెక్టర్ మధ్య ఏం జరిగిందో తెలీదు కానీ.. ఏదో మనస్సులో పెట్టుకొని ఉద్దేశపూర్వకంగానే డైరెక్టర్ ని తక్కువ చేసి హీరో మాట్లాడాడని మాత్రం అర్థమవుతోంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



