'చిట్టి'తో షూట్ షురూ చేసిన 'రావణాసుర'!
on Feb 2, 2022
మాస్ మహారాజా రవితేజ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఈ ఏడాది ఆయన నాలుగైదు సినిమాలతో ప్రేక్షకులను పలకరించే అవకాశముంది. ఆయన నటించిన 'ఖిలాడీ' మూవీ ఫిబ్రవరి 11 న విడుదల కానుంది. 'రామారావు ఆన్ డ్యూటీ' మార్చి 25 లేదా ఏప్రిల్ 15 న ప్రేక్షకుల ముందుకు రానుంది. 'ధమాకా' కూడా సమ్మర్ లోనే విడుదలయ్యే అవకాశముంది. ఇవి కాకుండా మరో రెండు సినిమాలు 'టైగర్ నాగేశ్వరరావు', 'రావణాసుర' రవితేజ చేతిలో ఉన్నాయి. తాజాగా రావణాసుర మూవీ షూటింగ్ ప్రారంభమైంది. ఈ సినిమా కూడా ఈ ఏడాదే రిలీజ్ కానుంది.
రవితేజ హీరోగా సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'రావణాసుర'. ఈ సినిమాలో ఫరియా అబ్దుల్లా, అను ఇమ్మానుయేల్, మేఘా ఆకాష్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ బుధవారం ప్రారంభమైంది. మొదటి షెడ్యూల్ లో రవితేజ, ఫరియా అబ్దుల్లా కాంబినేషన్ లో ఉన్న సన్నివేశాలను తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా సెట్ లో డైరెక్టర్ సుధీర్ వర్మతో కలిసి రవితేజ, ఫరియా దిగిన ఫోటోని సోషల్ మీడియా ద్వారా పంచుకున్న మూవీ టీమ్ షూటింగ్ స్టార్ట్ అయినట్లు తెలిపింది.
అభిషేక్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో యంగ్ హీరో సుశాంత్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. హర్షవర్ధన్ రామేశ్వర్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా సెప్టెంబర్ 30 న విడుదల కానుంది.