రంగస్థలం కూడా కాపీనే!
on Apr 7, 2018
రంగస్థలం ఊపు మామూలుగా లేదు. టాలీవుడ్ ఆల్ టైమ్ రికార్డుల పని పడుతోంది. బాహుబలి తరవాత అత్యధిక వసూళ్లు అందుకున్న తెలుగు సినిమాగా నిలవడానికి ఎంతో దూరంలో లేదు. రామ్‌చరణ్ నటనకీ, సుకుమార్ దర్శకత్వ ప్రతిభకు అంతా జోహార్లు చెబుతున్నారు. ఓ సింపుల్ పాయింట్‌ని భలే చెప్పాడే.. అంటూ మెచ్చుకుంటున్నారు. అయితే ఈ సినిమా కూడా కాపీనే అని తేలింది. 2015లో కాళిచరణ్ అనే ఓ సినిమా వచ్చింది. చైతన్య కృష్ణ కథానాయకుడిగా నటించిన సినిమా ఇది. సేమ్ టూ సేమ్ రంగస్థలంలా 1980 నేపథ్యంలో సాగే కథ. అదీ.. పొలిటికల్ డ్రామానే. రంగస్థలంలో హీరోకి చెవుడు.. కాళిచరణ్లో హీరోయిన్‌కి చెవుడు. ముందు జగపతిబాబుని విలన్‌గా చూపించి, అసలు విలన్ ప్రకాష్‌రాజ్ అని తేల్చారు రంగస్థలంలో. కాళిచరణ్లో కూడా అంతే. ముందు పంకజ్ కేసరి విలన్ అనుకుంటారు. చివరికి రావు రమేష్ అని తేలుతుంది. ప్రకాష్‌రాజ్ పాత్ర ఎలా మేక వన్నె పులిలా కనిపించిందో.. ఇక్కడ రావు రమేష్ పాత్ర అలా ఉంటుంది. మొత్తానికి రంగస్థలం.. కాళిచరణ్కి మధ్య చాలా పోలికలు కనిపిస్తాయి. కాకపోతే అది ఫ్లాపు.. ఇది సూపర్ హిట్టు అంతే తేడా.