7 రోజులకి 25 కోట్లు.. ఇదీ ఆయన స్టామినా!
on Feb 19, 2023
సూపర్ స్టార్ తలైవా రజినీకాంత్ స్టార్డం గురించి ఎంత ఎక్కువ చెప్పుకున్నా తక్కువే. నటునిగా మారి దశాబ్దాలు గడుస్తున్నా రజనీ రేంజ్ పెరుగుతోంది గాని ఎక్కడా తగ్గడం లేదు. తన క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాలంటే మాటల్లో చెప్పలేం. కానీ రజనీ తన స్టార్డంకి తగిన హిట్ వచ్చి చాలా కాలమే అయింది. ఈమధ్య కాలంలో ఆయన నుంచి ప్రేక్షకులు ఆశించే బ్లాక్ బస్టర్ మాత్రం రాలేదు. ఆయన చివరగా నటించిన బ్లాక్ బస్టర్ అంటే అది రోబో చిత్రం మాత్రమే. ఆ తర్వాత వచ్చిన కొచ్చాడియన్, లింగా , కబాలి, కాలా, 2.0, పేట, దర్బార్, పెద్దన్న వంటి చిత్రాలు ఆయన స్థాయిని కనీసం అందుకోలేకపోయాయి.
గత కొంతకాలంగా రజిని తన స్టార్ట్డం స్థాయి బ్లాక్ బస్టర్లని దక్కించుకోలేకపోతున్నారు. ఐకానిక్ స్టైల్స్ తో అశేష అభిమాన గణాన్ని సొంతం చేసుకున్న రజిని వెండితెరపై కనిపిస్తే ఆ మెరుపులే వేరు. తాజాగా అయినా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ నిర్మిస్తున్నజైలర్ చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో తమన్న హీరోయిన్ గా నటిస్తోంది. కీలకపాత్రలలో రమ్యకృష్ణ, కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ నటిస్తున్నారు. ఇక ఈ సినిమాలో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కూడా కనిపిస్తుండగా అనిరుద్ రవిచంద్రన్ సంగీత మందిస్తున్నారు. చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమా సమ్మర్ లో విడుదలకు సిద్ధమవుతోంది.
ఇదిలా ఉంటే ఈ మూవీలో నటిస్తూనే రజినీ తన కుమార్తె ఐశ్వర్య రూపొందిస్తున్న లాల్ సలాం లో అతిధి పాత్రలో కనిపించబోతున్నారు. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై సుబాస్కరన్ నిర్మిస్తున్న ఈ మూవీలో విష్ణు విశాల్, విక్రాంత్ హీరోలుగా నటిస్తున్నారు. ఈ మూవీ చిత్రీకరణ దశలో ఉంది. ఈ మూవీ కోసం ఏడు రోజుల షూటింగ్ చేశారు రజిని. దానికి గాను ఆయన ఏకంగా 25 కోట్ల పారితోషకం తీసుకున్నారని తెలుస్తోంది. ఇదే నిజమైతే ఈ స్థాయిలో పారితోషం అందుకున్న ఏకైక ఇండియన్ స్టార్ గా రజినీకాంత్ రికార్డు సాధించినట్టే.